- 22 అధికార భాషల్లోనూ ప్రశ్నాపత్రాలు ఉండాలి
- వాయిస్ ఆఫ్ తెలంగాణ డిమాండ్
పంజగుట్ట: సివిల్ సర్వీసెస్ పరీక్షల ప్రశ్న పత్రాలను అన్ని ప్రాంతీయ భాషల్లోనూ రూపొందిం చాలని వాయిస్ ఆఫ్ తెలంగాణ అధ్యక్షుడు లింగాల పాండురంగారెడ్డి డిమాండ్ చేశారు. సివిల్స్ పరీక్షల నిర్వహణలో కేంద్రం అనుసరిస్తున్న లోపభూయిష్టమైన విధానం కారణం గా ప్రాంతీయ భాష విద్యార్థులకు తీరని అన్యా యం జరుగుతోందని ఆయన ఆరోపించారు.
హిందీ విద్యార్థుల పట్ల మక్కువతో కేంద్రం స్థానిక భాషల విద్యార్థులపై వివక్ష ప్రదర్శిస్తోం దని, సివిల్ సర్వీస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ (సి స్టార్) ప్రశ్నాపత్రాన్ని కేవలం ఇంగ్లీష్, హిందీ మాధ్యమాల్లో రూపొందించడం సబబు కాదన్నారు. బుధవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో పాండురంగారెడ్డి మీడియాతో మాట్లాడారు. జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో అన్ని ప్రాంతాల వారికి సమాన అవకాశాలు ఉండే విధంగా ప్రశ్నాపత్రాలు ఉండాలన్నారు. కానీ ప్రస్తుత యూపీఎస్సీ విధానం చూస్తుంటే కేవలం హిందీ వారికి ప్రయోజనకం చేకూర్చాలనే ఉద్దేశం అర్థమవుతోందన్నారు.
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్ష ప్రశ్నాపత్రాలను గుర్తింపు పొందిన 22 భాషల్లోనూ తయారు చేయాలన్నారు. ఇంగ్లీష్ ప్రశ్నావళిలోని కఠిన పదాలు, భాషాపండింతులకు కూడా అర్థంకాని వ్యాకరణం వల్ల ప్రాంతీయ విద్యార్థులు పరీక్షలో విఫలమవుతున్నారని అన్నారు. ఈ ఏడాది ఆగస్టులో నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షలకు 28,600 మంది తెలుగు విద్యార్థులు హాజరవగా వారిలో కేవలం 535 మంది మాత్రమే మెయిన్స్‌కు హాజరవడం దీనికి నిదర్శనమన్నారు.