
ఇంగ్లిష్ మార్కులను పరిగణించం
సివిల్స్ ప్రిలిమ్స్ పై ప్రభుత్వం ప్రకటన
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించిన సెంకడ్ పేపర్‌లో ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాలకు సంబంధించిన మార్కులను అభ్యర్థుల ఉత్తీర్ణత లెక్కింపులో పరిగణనలోకి తీసుకోబోమని ప్రభుత్వం శనివారం ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 24నే నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని, ఈ పరీక్షలో అంతర్భాగమైన ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాల (పదవ తరగతి స్థాయిలోనివి) విభాగాన్ని పరిగణనలోకి తీసుకోబోమని, అందువల్ల ఈ విభాగంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయవలసిన అవసరంలేదని అభ్యర్థులు గమనించాలని ఒక ప్రకటనలో తెలిపారు.
పరీక్షలో పేపర్-2కు 200మార్కులను, రెండు గంటల వ్యవధిని కేటాయించారు. పేపర్-2 పరీక్ష వ్యవధి 2గంటలు యథాతథంగా ఉంటుందని, ఇంగ్లిష్ భాషా అవగాహనా నైపుణ్యాల విభాగం మినహా మిగతా ప్రశ్నలకు జవాబులు రాయడానికి అభ్యర్థులు ఈ మొత్తం వ్యవధిని వినియోగించుకోవచ్చని ప్రభుత్వం తన ప్రకటనలో తెలిపింది. కాగా, యూపీఎస్‌సీ కొత్త చైర్‌పర్సన్‌గా రజనీ రజ్దాన్ శనివారం పదవీ బాధ్యతలు స్వీకరించారు.