జాతి సిగలో నగర కీర్తి
► సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మెరిసిన మనోళ్లు
► ఉభయ రాష్ట్రాల్లో ఉత్తమ ర్యాంకు నగరవాసికే
సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నగర ఆణిముత్యం మెరిసింది. నగర ‘కీర్తి’ని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 14 వర్యాంకు సాధించిన సీహెచ్.కీర్తి అత్యుత్తమ ప్రతిభను చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ర్యాంకే అత్యుత్తమం కావడం విశేషం. వైజాగ్‌కు చెందిన కీర్తి కుటుంబం పదేళ్ల కిందటే నగరానికి వచ్చి స్థిరపడింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ నగరంలోనే అభ్యసించిన ఆమె.. ఉత్తమ ర్యాంకు వచ్చే వరకు విశ్రమించలేదు.
రెండు సార్లు ఓ మాదిరి ర్యాంకు పొందినా అసంతృప్తే వెంటాటింది. మరింత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని చదివి మూడో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకును అందుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. ఈ తరహాలోనే మరిన్ని ర్యాంకులు నగరాన్ని వరించాయి. నగరానికి చెందిన యువతీ యువకులే కాకుండా.. ఇక్కడ శిక్షణ పొందిన వారు మెరిశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా శిక్షణ కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి... విజయ కీర్తి పతాకం ఎగురవేశారు.
నగరానికి చెందిన ఎడ్మ రిషాంత్‌రెడ్డికి 180, ప్రవళిక 232, ఉప్పల్‌కు చెందిన డాక్టర్ ప్రియాంక 529వ ర్యాంకు సాధించారు. వివిధ జిల్లాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. వందలోపు ర్యాంకులు సాధించిన వల్లూరి క్రాంతి (65వ ర్యాంకు), సీహెచ్. రామకృష్ణ (84వ ర్యాంకు)లు కూడా ఇతర జిల్లాల వారే. ఇలా వెయ్యిలోపు 50కిపైగా ర్యాంకులు పొందిన వారు నగరంలోని శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న వారేనని ఆయా ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. స్టడీ సెంటర్ల కేంద్రాల నిర్వాహకులు, ర్యాంకులు పొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.