Dr Priyanka
-
ఆధార్‌కార్డులో ఆంధ్రప్రదేశ్ ఉన్నా దరఖాస్తు చేసుకోవచ్చు : కలెక్టర్ డాక్టర్ ప్రియాంక
భద్రాద్రి/కొత్తగూడెం: ప్రజాపాలన దరఖాస్తులకు ఆదాయం, లోకల్ ఏరియా సర్టిఫికెట్లు జతపర్చాల్సిన అవసరంలేదని కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల తెలిపారు. దరఖాస్తుదారులు వ్యక్తం చేస్తున్న సందేహాలపై శుక్రవారం ఆమె స్పష్టతనిచ్చారు. ఆధార్‌కార్డుల్లో ఆంధ్రప్రదేశ్ అని ఉన్నా మార్చాలిన అవసరం లేదని తెలిపారు. ఆధార్, రేషన్ కార్డు జిరాక్స్, పాస్‌పోర్టు ఫొటో సరిపోతాయని పేర్కొన్నారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్, ఖమ్మం జిల్లా ఉంటే దరఖాస్తులు తీసుకోరని, ఆదాయం, కుల ధ్రువీకరణపత్రాలు అడుగుతున్నారని సామాజిక మాధ్యమాల్లో వచ్చే పుకార్లను నమ్మవద్దని సూచించారు. సందేహాలు ఉంటే ప్రజలు హెల్ప్‌డెస్క్‌ను, రెవెన్యూ, ఎంపీడీఓ, ఎంపీఓ, గ్రామకార్యదర్శి, అంగన్వాడీ సిబ్బంది, మహిళాస్వయం సహాయక సంఘ సభ్యులను సంప్రదించాలని వివరించారు. అసత్య ప్రచారాలను నమ్మొద్దన్నారు. ఇతర వివరాలకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కంట్రోల్‌రూం 08744–241950కు కార్యాలయ పనివేళల్లో ఫోన్ చేయాలని చెప్పారు. రెండో రోజు 74 గ్రామ పంచాయతీల్లో, మూడు మున్సిపల్ వార్డుల్లో ప్రజాపాలన గ్రామసభలు నిర్వహించామని తెలిపారు. 34,995 గృహాల లబ్ధిదారుల నుంచి 44,711 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రజాపాలన కార్యక్రమానికి ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తోందని తెలిపారు. స్వీకరించిన ప్రతి దరఖాస్తుకు బాధ్యతగా రశీదు అందజేయడంతోపాటు ప్రత్యేకంగా రిజిస్టర్లో నమోదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఇంటికి దరఖాస్తులను ఉచితంగా అందజేస్తున్నట్లు చెప్పారు. జిరాక్స్ కాపీలకు అధిక ధరలు వసూలు చేస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని, సంబంధిత జిరాక్స్ కేంద్రం అనుమతులు రద్దు చేస్తామని హెచ్చరించారు. ఎవరైనా ఎక్కువ వసూలు చేస్తే తహసీల్దార్, ఎంపీడీఓ, ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేయాలని సూచించారు. 30న గ్రామ పంచాయితీ, మున్సిపాలిటీలలో షెడ్యూల్ ప్రకారం గ్రామ సభలు జరుగుతాయని తెలిపారు. ఇవి చదవండి: దరఖాస్తు ఫారాలు విక్రయిస్తే కేసులు.. : కలెక్టర్ రాహుల్‌రాజ్ -
జాతి సిగలో నగర కీర్తి
► సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో మెరిసిన మనోళ్లు ► ఉభయ రాష్ట్రాల్లో ఉత్తమ ర్యాంకు నగరవాసికే సాక్షి, సిటీబ్యూరో: ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ ఫలితాల్లో నగర ఆణిముత్యం మెరిసింది. నగర ‘కీర్తి’ని జాతీయ స్థాయిలో ఇనుమడింప చేసింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి 14 వర్యాంకు సాధించిన సీహెచ్.కీర్తి అత్యుత్తమ ప్రతిభను చాటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి ఈ ర్యాంకే అత్యుత్తమం కావడం విశేషం. వైజాగ్‌కు చెందిన కీర్తి కుటుంబం పదేళ్ల కిందటే నగరానికి వచ్చి స్థిరపడింది. పదోతరగతి, ఇంటర్మీడియెట్ నగరంలోనే అభ్యసించిన ఆమె.. ఉత్తమ ర్యాంకు వచ్చే వరకు విశ్రమించలేదు. రెండు సార్లు ఓ మాదిరి ర్యాంకు పొందినా అసంతృప్తే వెంటాటింది. మరింత ఆత్మస్థైర్యాన్ని కూడగట్టుకుని చదివి మూడో ప్రయత్నంలో ఉత్తమ ర్యాంకును అందుకుని పలువురికి స్ఫూర్తిగా నిలిచారు. చిన్ననాటి ఆకాంక్షను నెరవేర్చుకున్న ఆ బిడ్డ తల్లిదండ్రుల సంతోషానికి అవధులు లేవు. ఈ తరహాలోనే మరిన్ని ర్యాంకులు నగరాన్ని వరించాయి. నగరానికి చెందిన యువతీ యువకులే కాకుండా.. ఇక్కడ శిక్షణ పొందిన వారు మెరిశారు. సివిల్ సర్వీసెస్ లక్ష్యంగా శిక్షణ కోసం వివిధ జిల్లాల నుంచి ఇక్కడికి వచ్చి... విజయ కీర్తి పతాకం ఎగురవేశారు. నగరానికి చెందిన ఎడ్మ రిషాంత్‌రెడ్డికి 180, ప్రవళిక 232, ఉప్పల్‌కు చెందిన డాక్టర్ ప్రియాంక 529వ ర్యాంకు సాధించారు. వివిధ జిల్లాలే కాకుండా.. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ శిక్షణ పొందిన ఎందరో ఉత్తమ ర్యాంకులు కైవసం చేసుకున్నారు. వందలోపు ర్యాంకులు సాధించిన వల్లూరి క్రాంతి (65వ ర్యాంకు), సీహెచ్. రామకృష్ణ (84వ ర్యాంకు)లు కూడా ఇతర జిల్లాల వారే. ఇలా వెయ్యిలోపు 50కిపైగా ర్యాంకులు పొందిన వారు నగరంలోని శిక్షణ కేంద్రాల్లో చదువుకున్న వారేనని ఆయా ఇనిస్టిట్యూట్ల నిర్వాహకులు, విద్యావేత్తలు చెబుతున్నారు. స్టడీ సెంటర్ల కేంద్రాల నిర్వాహకులు, ర్యాంకులు పొందిన అభ్యర్థుల కుటుంబ సభ్యులు మంగళవారం రాత్రి టపాసులు కాల్చి సంబరాలు జరుపుకొన్నారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందాన్ని పంచుకున్నారు.