
156 మంది ఐపీఎస్‌లకు శిక్షణ పూర్తి
* రేపు పాసింగ్ ఔట్ పరేడ్
* ఎన్‌పీఏ డెరైక్టర్ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ 2013 బ్యాచ్‌కు చెందిన 156 మంది ఐపీఎస్‌లకు 46 వారాల పాటు శిక్షణ ఇచ్చినట్లు సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ (ఎస్‌వీపీ ఎన్‌పీఏ) డెరైక్టర్ అరుణ బహుగుణ తెలిపారు. వారికి ఈ నెల 31న పాసింగ్ ఔట్ పరేడ్ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు గురువారమిక్కడ పోలీసు అకాడమీలో విలేకరులతో చెప్పారు. గత రెండేళ్లుగా యువత ఐపీఎస్ వైపు ఎక్కువగా మొగ్గుచూపుతోందన్నారు.
ముఖ్యంగా బీటెక్, ఎంటెక్ వంటి సాంకేతిక విద్యను అభ్యసించి, కొన్నాళ్లు ఉద్యోగం సైతం చేసిన వారు ఇటువైపు వస్తుండటం మంచి పరిణామన్నారు. పోలీసు విభాగంలో మహిళల శాతం చాలా తక్కువగా ఉండేదని ప్రస్తుతం అది కూడా పెరుగుతోందని చెప్పారు. శిక్షణ పొందిన వారిలో భారత్‌కు చెందిన వారు 141 మంది కాగా, మిగతా 15 మంది భూటాన్, నేపాల్, మాల్దీవులకు చెందిన వారున్నట్లు తెలిపారు. వీరికి అన్ని కోణాల్లో విస్తృత శిక్షణ ఇచ్చినట్లు చెప్పారు.
సైబర్‌క్రైం, ఐటీ, మహిళల అక్రమ రవాణా, ఫోరెన్సిక్ వంటి వాటితో పాటు గ్రేహౌండ్స్‌తో కలసి పనిచేయడం, అడవుల్లో సాహసాలు వంటి క్షేత్రస్థాయి పరిజ్ఞానం కల్పించామన్నారు. శిక్షణలో భాగంగా తిరుపతి ఉప ఎన్నిక బందోబస్తుకు, రద్దీ సమయంలో శాంతిభద్రతల పర్యవేక్షణ అవగాహన కోసం నాసిక్ కుంభమేళా ఉత్సవాలకు పంపినట్లు తెలిపారు. ప్రస్తుతం వీరందరూ ప్రొబెషనరీ పీరియడ్ కోసం కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లనున్నట్లు పేర్కొన్నారు.