
సంస్కరణల సంకల్పముంది
► పరివర్తన తేవటంలో అధికారులు కలిసికట్టుగా పనిచేయాలి
► ధైర్యంగా, నిజాయితీగా పనిచేయండి.. సమస్యలొస్తే నేనున్నా
► సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: దేశంలో సంస్కరణలను కొనసాగించేందుకు బలమైన రాజకీయ సంకల్పం తనకుందని ప్రధాని మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలో జరిగిన సివిల్ సర్వీసెస్ డే ఉత్సవాల్లో అధికారులనుద్దేశించి ప్రధాని మాట్లాడారు. అధికారులు విశాల దృక్పథంతో.. దేశాన్ని పరివర్తనం చేయటంలో ఒక జట్టుగా పనిచేయాలని సూచించారు. అధికారులు వేగంగా నిర్ణయాలు తీసుకోవటంలో ఎవరికీ భయపడొద్దని నిజాయితీగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ‘రాజకీయ సంకల్పం సంస్కరణలు (రిఫామ్) తీసుకొస్తుంది.
కానీ, బ్యూరోక్రసీ దాన్ని అమలు (పెర్ఫామ్)చేస్తుంది. ప్రజల భాగస్వామ్యం పరివర్తనం (ట్రాన్స్‌ఫామ్) తీసుకొస్తుంది. నిజాయితీగా నిర్ణయాలు తీసుకోండి. ఇబ్బందులొస్తే నా మద్దతుంటుంది’ అని అన్నారు. నిర్ణయాలు తీసుకున్నాక.. విధానపరమైన సమస్యలొస్తే కాగ్, సీబీఐ, సీవీసీ (త్రీ సీస్)తో ఇబ్బందులపై పలువురు అధికారులు మాట్లాడిన నేపథ్యంలో ప్రధాని వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ‘లెక్కల ద్వారా ఏమైనా మార్పొస్తుందా? ఫలితాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవాలి.
కాగ్‌కు ఫలితమే కావాలి. కాగ్ లెక్కల ప్రకారమే ముందుకెళ్లాలంటే దేశంలో మార్పు తీసుకురాలేం? మనం కూడా ఎలాంటి మార్పునూ గమనించలేం’ అని తెలిపారు. సీనియర్ అధికారులు తమకంతా తెలుసనే సిండ్రోమ్ నుంచి బయటకు వచ్చి జూనియర్ల ఆలోచనలకు సరైన మార్గదర్శనం చేయాలన్నారు. అధికారుల గురించి ప్రజలు ఆలోచించే తీరు గురించి మోదీ మాట్లాడుతూ.. ‘అధికారులు చెడ్డోళ్లు కానప్పుడు వారు దురాలోచనలతో పనిచేయరు.
అలాంటప్పుడు సామాన్యుడు ఒక అభిప్రాయాన్ని పెంచుకునే బదులు ఫిర్యాదు చేస్తాడు? కారణమేంటో మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. అది జరిగినపుడు ప్రజల అభిప్రాయాన్ని మార్చటం కష్టమేం కాదనుకుంటున్నా’ అని అన్నారు. కశ్మీర్ వరదలప్పుడు ఆర్మీ చేసిన సాయానికి ప్రజలు చప్పట్లు కొట్టారని.. అదే ప్రజలు తర్వాత ఆర్మీపై రాళ్లు రువ్వారన్నారు. కానీ ఒక్క క్షణం ఆర్మీ చేసిన పని ప్రజలను హత్తుకుందన్నారు. అధికారులు జట్టుగా ముందుకెళ్తేనే మంచి ఫలితాలొస్తాయన్నారు.
అందుకే ఫోన్లు వద్దంటా!
అధికారులతో తనెప్పుడు సమావేశమైనా మొబైల్ ఫోన్లు లేకుండానే వారిని రమ్మంటానని ప్రధాని తెలిపారు. సమావేశం జరుగుతుండగానే అధికారులు మొబైల్‌లో సోషల్ మీడియా సైట్లను చెక్ చేసుకుంటుంటారన్నారు. ‘ఈ మధ్య జిల్లాస్థాయి అధికారులు కూడా సోషల్ మీడియాలో చాలా బిజీ అయిపోతున్నారు. అందుకే నా సమావేశాల్లో మొబైల్ ఫోన్లను నిషేధించాను. సోషల్ మీడియా ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలి. సొంత డబ్బా కొట్టుకునేందుకు కాదు’ అని ప్రధాని చురకలంటించారు.
ప్రభుత్వం ఈ–గవర్నెన్స్ నుంచి మొబైల్ గవర్నెన్స్‌కు మారిపోతోందని అలాంటప్పుడు మొబైల్‌ను ప్రజా సంక్షేమం కోసం వినియోగించాలన్నారు. ‘నేను కోచింగ్‌కు వెళ్లలేదు. అందుకే అధికారిని కాలేకపోయాను. అధికారినే అయివుంటే ఈ 16 ఏళ్లలో డైరెక్టర్ స్థాయిలో ఉండేవాడినేమో. నా అదృష్టం కొద్ది ప్రజా సేవలో ఉన్నాను’ అని మోదీ వ్యాఖ్యానించడంతో సభలో నవ్వులు విరిశాయి. ఈ కార్యక్రమం సందర్భంగా ప్రభుత్వ పథకాల అమల్లో క్రియాశీలకంగా వ్యవహరించిన ఐఏఎస్ అధికారులకు ప్రధాని అవార్డులు అందజేశారు.
ఆదివారం ‘నీతి’ గవర్నింగ్ కౌన్సిల్ భేటీ
విజన్ 2030 రోడ్ మ్యాప్‌తో 15 ఏళ్లపాటు అనుసరించాల్సిన అభివృద్ధి ప్రణాళికలను చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన ఆదివారం నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం కానుంది. అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు పాల్గొనే ఈ సమావేశంలో మూడేళ్లు, ఏడేళ్లలో చేరుకోవాల్సిన లక్ష్యాల గురించి వ్యూహాలు రూపొందిస్తారు. రాష్ట్రపతి భవన్‌లో ఆదివారం దినమంతా ఈ సమావేశం జరగనుంది.