సివిల్స్‌లో నారీ భేరి | Civil Services 2022 Final Results Released | Sakshi
Sakshi News home page

సివిల్స్‌లో నారీ భేరి

Published Wed, May 24 2023 4:05 AM | Last Updated on Wed, May 24 2023 6:50 AM

Civil Services 2022 Final Results Released - Sakshi

న్యూఢిల్లీ: సివిల్‌ సర్విసెస్‌–2022 తుది ఫలితాలను యూనియన్‌ పబ్లిక్‌ సర్విసు కమిషన్‌(యూపీఎస్సీ) మంగళవారం విడుదల చేసింది. మొదటి నాలుగు ర్యాంకులను మహిళలే కైవసం చేసుకోవడం విశేషం. ఢిల్లీ యూనివర్సిటీ గ్రాడ్యుయేట్‌ ఇషితా కిశోర్‌ తొలి ర్యాంకు సాధించారు. గరీమా లోహియా, తెలుగు యువతి నూకల ఉమా హారతి, స్మృతీ మిశ్రా వరుసగా రెండు, మూడు, నాలుగో ర్యాంకు సొంతం చేసుకున్నారు.

టాప్‌–25 ర్యాంకర్లలో 14 మంది మహిళలు, 11 మంది పురుషులు ఉన్నట్లు యూపీఎస్సీ ప్రకటించింది. ఈ పరీక్షలో మొత్తం 933 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. వీరిలో 613 మంది పురుషులు, 320 మంది మహిళలు ఉన్నారు. సివిల్స్‌లో టాప్‌–3 ర్యాంకులు మహిళలే సాధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం కావడం గమనార్హం. సివిల్స్‌–2021లో శృతి శర్మ, అంకితా అగర్వాల్, గామినీ సింగ్లా తొలి మూడు ర్యాంకులు దక్కించుకున్న సంగతి తెలిసిందే.  

మూడో ప్రయత్నంలో తొలి ర్యాంక్‌  
ఈసారి సివిల్స్‌ తొలి ర్యాంకర్‌ ఇషితా కిశోర్‌ ఆప్షనల్‌ సబ్జెక్టుగా పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్‌ ఎంచుకొని మూడో ప్రయత్నంలో విజయం సాధించారు. ఆమె యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పరిధిలోని శ్రీరామ్‌ కాలేజీ ఆఫ్‌ కామర్స్‌ నుంచి ఎకనామిక్స్‌(ఆనర్స్‌)లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేశారు. రెండో ర్యాంకర్‌ గరీమా లోహియా యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ పరిధిలోని కిరోరీమల్‌ కాలేజీ నుంచి కామర్స్‌లో గ్రాడ్యుయేషన్‌ అభ్యసించారు.

సివిల్స్‌లో కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. రెండో ప్రయత్నంలో రెండో ర్యాంక్‌ సాధించారు. మూడో ర్యాంకర్‌ నూకల ఉమా హారతి ఐఐటీ–హైదరాబాద్‌ నుంచి సివిల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ పూర్తిచేశారు. ఆంథ్రోపాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టుగా ఎంచుకున్నారు. ఐదో ప్రయత్నంలో మూడో ర్యాంక్‌ సొంతం చేసుకున్నారు.

ఇక స్మృతీ మిశ్రా మూడో ప్రయత్నంలో నాలుగో ర్యాంకు దక్కించుకున్నారు. ఆమె  ఢిల్లీలోని మిరండా హౌజ్‌ కాలేజీలో బీఎస్సీ చదివారు. జువాలజీ ఆప్షనల్‌ సబ్జెక్టుగా సివిల్స్‌లో జయకేతనం ఎగురవేశారు. ఐదో ర్యాంకర్‌ మయూర్‌ హజారికా తొలి ప్రయత్నంలోనే అనుకున్నది సాధించారు. అస్సాంకు చెందిన హజారియా ఎంబీబీఎస్‌ చదివారు.  

ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి రాక  
టాప్‌–25 ర్యాంకర్ల విద్యార్హతలను గమనిస్తే చాలామంది ఐఐటీ, ఎన్‌ఐటీ, యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, గుజరాత్‌ నేషనల్‌ లా యూనివర్సిటీ, జాదవ్‌పూర్‌ యూనివర్సిటీ వంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల నుంచి ఇంజనీరింగ్, హుమానిటీస్, సైన్స్, కామర్స్, మెడికల్‌ సైన్స్‌లో గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసినవారే ఉన్నారు. మెయిన్స్‌ పరీక్షలో ఎక్కువ మంది ఆంథ్రోపాలజీ, కామర్స్‌ అండ్‌ అకౌంటెన్సీ, ఎకనామిక్స్, ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్, లా, హిస్టరీ, మ్యాథ్స్, పొలిటికల్‌ సైన్స్‌ అండ్‌ ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, ఫిలాసఫీ, సోషియాలజీ, జువాలజీని ఆప్షనల్‌ సబ్జెక్టులుగా ఎంచుకున్నారు.  

రిజర్వ్‌ లిస్టులో 178 మంది  
అర్హత సాధించిన వారిలో 345 మంది జనరల్‌ కేటగిరీ, 99 మంది ఆర్థికంగా వెనుకబడిన తరగతి(ఈడబ్ల్యూఎస్‌), 263 మంది ఇతర వెనుకబడిన తరగతులు(ఓబీసీ), 154 మంది షెడ్యూల్డ్‌ కులాలు(ఎస్సీ), 72 మంది షెడ్యూల్డ్‌ తెగల(ఎస్టీ) వర్గానికి చెందినవారున్నారు. 178 మంది అభ్యర్థులను రిజర్వ్‌ జాబితాలో చేర్చినట్లు యూపీఎస్సీ తెలియజేసింది. మొత్తం విజేతల్లో 41 మంది దివ్యాంగులు ఉన్నారు.   

నా కల నెరవేరింది   
సివిల్స్‌లో తొలి ర్యాంకు సాధించడం ద్వారా నా కల నెరవేరింది. ఐఏఎస్‌ అధికారిగా మహిళా సాధికారత కోసం, అణగారిన వర్గాల సంక్షేమ కోసం కృషి చేస్తా. మొదటి ర్యాంకు లభించడం చాలా సంతోషంగా ఉంది. ఇందుకు తొలుత నా కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేయాలి.

సివిల్స్‌లో మొదటి రెండు ప్రయత్నాలు విఫలమైనప్పటికీ వారు నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. మెరుగైన ర్యాంకు సాధించాలన్న లక్ష్యంతో ప్రతిరోజూ 8 గంటల నుంచి 9 గంటలపాటు చదివాను. నా కఠోర శ్రమకు ఈ ఫలితం దక్కిందని భావిస్తున్నా. నా ప్రాధాన్యత ఉత్తరప్రదేశ్‌ క్యాడర్‌. ఈసారి సివిల్స్‌లో మొదటి నాలుగు ర్యాంకులు మహిళలు సొంతం చేసుకోవడం ఆనందంగా ఉంది – ఇషితా కిశోర్, సివిల్స్‌ ఫస్ట్‌ ర్యాంకర్‌  

రెండో ర్యాంకు ఊహించలేదు 
‘‘సివిల్స్‌ సాధించాలన్నది నా చిన్నప్పటి కల. ఏకంగా రెండో ర్యాంకు సాధిస్తానని ఊహించలేదు. గ్రాడ్యుయేషన్‌ పూర్తయిన తర్వాత సివిల్స్‌ ప్రిపరేషన్‌ ప్రారంభించా. ఈ ప్రయాణంలో మా అమ్మ, కుటుంబ సభ్యులు నాకు తోడుగా నిలిచారు. ప్రిపరేషన్‌ నిరంతరం కాకుండా మధ్యలో అప్పుడప్పుడు విరామం ఇచ్చా. బంధుమిత్రులను కలుసుకున్నా.

స్ఫూర్తి, సొంతంగా చదుకోవడం, విశ్లేషణతో ఎవరైనా పరీక్షల్లో విజయం సాధించవచ్చు. సరైన మార్గనిర్దేశం కూడా అవసరమే. పెద్ద నగరంలో ఉంటున్నామా, చిన్న పట్టణంలో ఉంటున్నామా అనేది సమస్య కాదు. ఇంట్లో ఉండి చదువుకుంటే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయి. సర్విసులో చేరాక మహిళాభివృద్ధి, యువత సంక్షేమం కోసం పనిచేస్తా’’   – గరీమా లోహియా, సివిల్స్‌ రెండో ర్యాంకర్‌   

15 రోజుల్లోగా మార్కుల వివరాలు  
యూపీఎస్సీ వెబ్‌సైట్‌  http//www.upsc. gov.in  ద్వారా ఫలితాలు, సివిల్స్‌ విజేతల వివరాలు తెలుసుకోవచ్చు. అభ్యర్థులకు ఏదైనా సమాచారం కావాలంటే 011– 23385271/ 23381125/ 23098543 ఫోన్‌ నంబర్ల ద్వారా పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల దాకా సంప్రదించవచ్చని యూపీఎస్సీ సూచించింది. సివిల్స్‌–2022లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను 15 రోజుల్లోగా వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలియజేసింది.  
 
సివిల్స్‌ ప్రిలిమినరీ పరీక్షను గత ఏడాది జూన్‌ 5న నిర్వహించారు. 11,35,697 మంది దరఖాస్తు చేసుకోగా, 5,73,735 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 13,090 మంది మెయిన్స్‌కు అర్హత సాధించారు. గత ఏడాది సెపె్టంబర్‌లో జరిగిన మెయిన్స్‌ పరీక్షలో 2,529 మంది అభ్యర్థులు పర్సనాలిటీ టెస్టు(ఇంటర్వ్యూ)కు ఎంపికయ్యారు. తుది ఫలితాల్లో 933 మంది అర్హత    సాధించారు.   
 
విజేతలకు మోదీ అభినందనలు  
సివిల్స్‌–2022 విజేతలకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలియజేశారు. దేశానికి సేవలందించే అవకాశం రావడం, ప్రజల జీవితాన్ని సానుకూల మార్పును తీసుకొచ్చే అదృష్టం లభించడం గొప్ప విషయమంటూ ట్వీట్‌ చేశారు. విజయం సాధించలేకపోయినవారు నైపుణ్యాలను, బలాలను  ప్రదర్శించేందుకు దేశంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. ర్యాంకర్లకు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, జితేంద్ర సింగ్‌ తదితరులు అభినందనలు తెలియజేశారు.   

హెడ్‌ కానిస్టేబుల్‌కు 667వ ర్యాంక్‌ 
ఢిల్లీ పోలీసు శాఖలో హెడ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న రామ్‌భజన్‌ కుమార్‌ సివిల్స్‌లో 667వ ర్యాంకు సాధించి, అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారు. ఆయన వయసు 34 ఏళ్లు. ఎనిమిదో ప్రయత్నంలో ర్యాంకు సాధించడం గమనార్హం. ప్రస్తుతం సైబర్‌ సెల్‌ పోలీసు స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. సివిల్స్‌ ఫలితాలు వెలువడిన తర్వాత రామ్‌భజన్‌కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, సహచరులు, సీనియర్‌ అధికారులు ఆయనను అభినందించారు. ఓబీసీ కేటగిరీకి చెందిన రామ్‌భజన్‌కు తొమ్మిది సార్లు సివిల్స్‌ రాసేందుకు అనుమతి ఉంది. ఎట్టకేలకు ర్యాంకు సాధించడం ద్వారా తన కల నెరవేర్చుకున్నానని ఆయన చెప్పారు. ఒకవేళ ఈసారి విఫలమైనా తొమ్మిదోసారి పరీక్ష రాయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. ఇప్పటిదాకా ఏడు ప్రయత్నాలు సఫలం కాకపోయినా నిరాశ పడలేదని అన్నారు.

తన భార్య అందించిన అండదండలతో ముందుకు సాగానని వివరించారు. తాను రాజస్తాన్‌ నుంచి వచ్చానని, అక్కడ తన తండ్రి కూలీగా పనిచేస్తున్నాడని వెల్లడించారు. కష్టాల్లోనే పుట్టి పెరిగానని పేర్కొన్నారు. అంకితభావం, కఠోర శ్రమ, సహనంతో అనుకున్న లక్ష్యం సాధించడం సులువేనని సూచించారు. కానిస్టేబుల్‌గా పనిచేస్తూ 2019లో యూపీఎస్సీ పరీక్షలో ర్యాంకు సాధించిన ఫిరోజ్‌ ఆలం తనకు స్ఫూర్తిగా నిలిచారని చెప్పారు. రామ్‌భజన్‌ 2009లో పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా చేరారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement