న్యూఢిల్లీ: ప్రజల భాగస్వామ్యం ఉంటేనే దేశాభివృద్ధి సాధ్యమని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రభుత్వ పథకాల అమల్లో అధునాతన సాంకేతికత, సృజనను వినియోగించుకోవాలని ప్రభుత్వ అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం ముగిసిన రెండ్రోజుల సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమంలో మోదీ ప్రసంగించారు. పరిపాలనలో నిర్ణయాలు తీసుకోవడం, ఫైళ్లను ముందుకు కదిలించడంలో నెలకొన్న జాప్యం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.‘నాలుగు పుణ్య క్షేత్రాలు సందర్శిస్తే మనిషికి మోక్షం లభిస్తుంది. కానీ ఒక ఫైల్ అలాంటి యాత్రలు 32 చేసినా ఫలితం ఉండట్లేదు’ అని మోదీ అన్నారు. కొత్త విధానాలు, చట్టాలు చేసే సమయంలో ప్రజా ప్రయోజనాలకే పెద్దపీట వేయాలని అన్నారు.
ప్రభుత్వ విధానాల అమలులో వ్యూహాత్మకంగా ఆలోచించాలని, ఉన్నతాధికారులు సాంకేతికతను వినియోగించుకుంటే అది వారికి అదనపు బలమవుతుందని అన్నారు. సివిల్ అధికారుల శక్తి, సామర్థ్యాలు గొప్పవని, అవి జాతి ప్రయోజనాలకు ఎంతో దోహదపడుతాయని పేర్కొన్నారు. వెనకబడిన జిల్లాల అభివృద్ధికి వ్యూహాలు, ప్రాధమ్య కార్యక్రమాలతో కూడిన రెండు పుస్తకాలను మోదీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమాల అమల్లో ఉత్తమ పనితీరు కనబరచిన జిల్లాల అధికారులు, కేంద్ర, రాష్ట్రాల సంస్థలకు అవార్డులు అందజేశారు. మణిపూర్‌లోని కరంగ్‌ని దేశంలోనే తొలి నగదు రహిత దీవిగా తీర్చిదిద్దిన అధికారులకు మోదీ అవార్డును బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment