‘కరెంట్’లో నిర్లక్ష్యానికి పరిహారం
సమస్యలను నిర్దేశిత గడువులోగా పరిష్కరించాల్సిందే..
లేదంటే వినియోగదారులకు రూ.100-4000 వరకు పరిహారం చెల్లించాలి
- పరిహారం మొత్తాన్ని 90 రోజుల్లో విద్యుత్ బిల్లుల్లో సర్దుబాటు చేయాలి
- కొత్త ప్రమాణాలను జారీ చేసిన ఈఆర్సీ
సాక్షి, హైదరాబాద్ : విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయాలతో విసిగిపోతున్నారా? ఫిర్యాదు చేసినా కరెంటోళ్లు సకాలంలో స్పందించడం లేదా? కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కోసం వారాల తరబడి జాప్యం చేస్తున్నారా? ఇంట్లో చెడిపోయిన విద్యుత్ మీటర్‌ను మార్చమంటే పట్టించుకోవడం లేదా? ఇకపై ఇలాంటి నిర్లక్ష్యానికి విద్యుత్ శాఖ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదు! నిర్దేశించిన ప్రమాణాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యుత్ సరఫరాతో పాటు, పౌర సేవలు అందించడంలో విఫలమైతే బాధిత వినియోగదారులకు విద్యుత్ శాఖ పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల పనితీరులో కచ్చితంగా అమలు చేయాల్సిన కొత్త ప్రమాణాలను ప్రకటిస్తూ తెలంగాణ విద్యుత్ నియంత్రణ సంస్థ(ఈఆర్సీ) బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
గత రెండేళ్లుగా నిర్వహించిన బహిరంగ విచారణల్లో వచ్చిన అభిప్రాయాల ఆధారంగా.. డిస్కంల పనితీరు నిర్దేశించిన ప్రమాణాల మేరకు లేదని నిర్ధారణకు వచ్చిన తర్వాతే కొత్త ప్రమాణాలను జారీ చేస్తున్నట్లు ఈఆర్సీ పేర్కొంది. నిర్దేశిత ప్రమాణాలను ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారులకు రూ.100 నుంచి రూ.4 వేల వరకు పరిహారాన్ని చెల్లించాలని స్పష్టంచేసింది. ఈ ప్రమాణాల అమలు, బాధిత వినియోగదారులకు పరిహారం చెల్లింపుపై ప్రతి నెలా నివేదికలు సమర్పించాలని డిస్కంలను ఆదేశించింది.
పరిహారం మొత్తం బిల్లులో సర్దుబాటు
ఈఆర్సీ ఆదేశాల ప్రకారం.. విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, నాణ్యత, మీటర్లు, బిల్లులు, ఇతర అంశాలపై వచ్చే ఫిర్యాదులను వినియోగదారుల సేవా కేంద్రాల వద్ద డిస్కంలు నమోదు చేసుకోవాలి. ప్రమాణాల అమలుపై వినియోగదారుల వారీగా సమాచారాన్ని క్రోడీకరించాలి. ఒకవేళ ప్రమాణాల మేరకు సేవలు అందించకుంటే 90 రోజుల వ్యవధిలో నిర్దేశించిన పరిహారాన్ని సంబంధిత వినియోగదారుడు/వినియోగదారులకు చెల్లించాలి. అయితే నగదు రూపంలో కాకుండా పరిహారాన్ని విద్యుత్ బిల్లులో సర్దుబాటు చేయాలి. పరిహారం చెల్లించే విషయంలో డిస్కంలు విఫలమైతే వినియోగదారులు ‘ఫోరం ఫర్ రిడ్రస్సల్ ఆఫ్ గ్రీవెన్సెస్ ఆఫ్ కన్స్యూమర్స్(సీజీఆర్‌ఎఫ్)ను సంప్రదించవచ్చని ఈఆర్సీ పేర్కొంది.
కొత్త కనెక్షన్ జాప్యమైతే ఒక్కో రోజుకు పరిహారం
వినియోగదారుడు దరఖాస్తు చేసుకున్న 30 రోజుల్లో కొత్త కనెక్షన్‌ను మంజూరు చేయాలి. తర్వాత జరిగే జాప్యంపై ఒక్కో రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. కొత్త కనెక్షన్ కోసం లైన్ల విస్తరణ చేయాల్సి ఉంటే... ఎల్‌టీ కనెక్షన్‌ను 30 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.200), హెచ్‌టీ 11 కేవీ కనెక్షన్‌ను 45 రోజుల్లో (లేకుంటే ఒక్కో రోజుకి పరిహారం రూ.400), హెచ్‌టీ 33 కేవీ కనెక్షన్‌ను 60 రోజుల్లో(లేకుంటే ఒక్కోరోజుకి రూ.1000 పరిహారం), ఎక్స్‌ట్రా హెచ్‌టీ సప్లైను 180 రోజుల్లో(లేకుంటే ఒక్కో రోజుకి రూ.1000 పరిహారం) మంజూరు చేయాలి.
ఇతర ప్రమాణాలు ఇవీ..
► యాజమాన్య పేరు మార్పు, కేటగిరీ మార్పులను 7 రోజుల్లో పరిష్కరించాలి. లో టెన్షన్ సింగిల్ ఫేజ్ నుంచి లో టెన్షన్ త్రీ ఫేజ్‌కు 30 రోజుల్లో మార్చాలి.
► విద్యుత్ బిల్లులపై వినియోగదారుల ఫిర్యాదులను 24 గంటల్లో పరిష్కరించాలి. అదనపు సమాచారం అవసరమైతే 7 రోజుల సమయం తీసుకోవచ్చు. ఉల్లంఘిస్తే మాత్రం రోజుకి రూ.100 చొప్పున పరిహారం చెల్లించాలి.
► సరిగ్గా పనిచేయని మీటర్లపై ఫిర్యాదులను పట్టణ ప్రాంతాల్లో 7 రోజుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 15 రోజుల్లో పరిష్కరించాలి. లేదంటే రోజుకు రూ.200 చొప్పున పరిహారం చెల్లించాలి.
► విద్యుత్‌కు అంతరాయం కలిగించాల్సి ఉంటే 24 గంటల ముందే వినియోగదారులకు తెలియజేయాలి. రోజుకు 12 గంటలకు మించి కోత ఉండొద్దు. సాయంత్రం 6 గంటల్లోపు సరఫరాను పునరుద్ధరించాలి. దీన్ని ఉల్లంఘిస్తే బాధిత వినియోగదారుడు ఒక్కడే అయితే రూ.400లు, ఎక్కువ మంది ఉంటే ఒక్కొక్కరికి రూ.200 పరిహారం చెల్లించాలి.