సాక్షి, హైదరాబాద్: విద్యుత్ రంగంలో సమూల సంస్కరణలకు కేంద్రం శ్రీకారం చుట్టింది. రాజ్యాంగంలోని ఉమ్మడి జాబితాలో విద్యుత్ ఉన్నప్పటికీ, ఇప్పటివరకు విద్యుత్ సరఫరా బాధ్యతలతోపాటు కీలక అధికారాలన్నీ రాష్ట్రాలకే ఉన్నాయి. భవిష్యత్తులో రాష్ట్రాలు కేవలం బాధ్యతలకు మాత్రమే పరిమితం కాబోతున్నాయి. కీలక అధికారాలను రాష్ట్రాల నుంచి కేంద్రం తన చేతుల్లోకి తీసుకుంటోంది.
అలాగే విద్యుత్ పంపిణీ రంగంలో ప్రైవేటు ఫ్రాంచైజీలు, సబ్ లైసెన్సీలకు అనుమతించాలని నిర్ణయించింది. దశల వారీగా విద్యుత్ సరఫరా ప్రైవేటీకరణకు ఈ నిర్ణయం దారి తీయనుంది. వినియోగదారులకు అందించే విద్యుత్ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం పాడాలని మరో నిర్ణయం తీసుకుంది. ఇలాంటి ఎన్నో కీలకమైన సంస్కరణల అమలు కోసం కేంద్ర విద్యుత్ చట్టం– 2003కు పలు సవరణలను ప్రతిపాదిస్తూ రూపొందించిన ముసాయిదా బిల్లు 2020ను ఇటీవల కేంద్ర విద్యుత్ శాఖ ప్రకటించింది. దీనిపై జూన్ 5లోగా సలహాలు, సూచనలు, అభిప్రాయాలు తెలియజేయాలని కోరింది.
(చదవండి: ఆర్మీలో ‘టెంపరరీ’ జాబ్స్!)
రాష్ట్రాల అధికారాలకు కత్తెర
ఈఆర్సీ చైర్మన్, సభ్యుల నియామకం విషయంలో రాష్ట్రాల అధికారాలకు కేంద్రం కత్తెర వేయబోతోంది. కేంద్ర విద్యుత్ నియంత్రణ మండలి (సీఈఆర్సీ), అప్పిలేట్ ట్రిబ్యునల్, ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అథారిటీ, రాష్ట్రాల విద్యుత్ నియంత్రణ మండలి (ఎస్‌ఈఆర్సీ)ల చైర్మన్, సభ్యులను.. కేంద్రం నియమించే కమిటీ ఎంపిక చేయనుంది. ఈ ఎంపిక కమిటీలో సభ్యులుగా సుప్రీం కోర్టు జడ్జి, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి, ఏవైనా రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, కేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి ఉంటారు. ప్రస్తుతం రాష్ట్రాల ఈఆర్సీ చైర్మన్, సభ్యులను సంబంధిత రాష్ట్ర ప్రభుత్వమే నియమిస్తోంది.
విద్యుత్ చట్టం సవరణలు అమల్లోకి వస్తే ఆ అధికారాన్ని రాష్ట్రాలు కోల్పోనున్నాయి. ప్రస్తుత విధానంలో రాష్ట్రాలు నియమించుకుంటున్న ఈఆర్సీ చైర్మన్, సభ్యులు స్వతంత్రంగా వ్యవహరించకుండా, రాష్ట్ర ప్రభుత్వాలకు కీలు బొమ్మల్లాగా పనిచేస్తున్నాయని, దీంతో విద్యుత్ సంస్థలు ఆర్థికంగా నష్టపోతున్నాయన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. గవర్నర్లను నియమించి రాష్ట్రాలకు పంపినట్లు ఎస్‌ఈఆర్సీ చైర్మన్, సభ్యులను ఇకపై కేంద్రం నియమించనుందని, దీంతో వీరి నిర్ణయాలు సైతం కేంద్ర ప్రభుత్వ విధానాలు, ఆలోచనలకు అనుగుణంగా ఉంటాయన్న చర్చ జరుగుతోంది.
ప్రైవేటీకరణకు రాచబాట!
విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)లు తమ పరిధిలోని ఏదైనా ఒక ప్రాంతంలో విద్యుత్ సరఫరా చేసే బాధ్యతలను డిస్ట్రిబ్యూషన్ సబ్ లైసెన్సీలు, ఫ్రాంచైజీల పేరుతో ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు ఈ సవరణలు వీలు కల్పించనున్నాయి. ఏదైనా ప్రాంతంలో డిస్కంలు తమ తరఫున విద్యుత్ సరఫరా చేసేందుకు ఎవరినైనా డిస్ట్రిబ్యూషన్ సబ్‌లైసెన్సీలుగా నియమించుకోవచ్చు. అయితే సంబంధిత రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) అనుమతి పొందాల్సి ఉంటుంది.
అయితే, ఫ్రాంచైజీల విషయంలో ఈఆర్సీ నుంచి లైసెన్స్ కానీ, అనుమతి కానీ అవసరం ఉండదు. ఫ్రాంచైజీగా నియామకమైన వ్యక్తి/సంస్థతో డిస్కంలు ఒప్పందం కుదుర్చుకుని ఈఆర్సీకి సమాచారం ఇస్తే సరిపోతుంది. అయితే, ఫ్రాంచైజీలకు అప్పగించిన ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు డిస్కంలే బాధ్యులు కానున్నాయి. ప్రధానంగా నష్టాలు బాగా వస్తున్న ప్రాంతాలను డిస్కంలు ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు మార్గం సుగమం కానుందని విద్యుత్ రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పునరుత్పాదక విద్యుత్ కొనకపోతే జరిమానా
ఈఆర్సీ నిర్దేశించిన మొత్తంలో ఏటా డిస్కంలు పునరుత్పాదక విద్యుత్‌ను కొనుగోలు చేయాల్సిందే. నిర్దేశించిన పరిమాణం కన్నా తక్కువగా కొనుగోలు చేసిన విద్యుత్‌కు సంబంధించిన ప్రతి యూనిట్‌కు 50 పైసలు చొప్పున డిస్కంలు జరిమానాలు చెల్లించాల్సి ఉంటుందని కేంద్రం ప్రతిపాదించింది. ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలకు ఈ నిబంధన పెను భారంగా మారే ప్రమాదముంది.
ఏటేటా బిల్లుల వాత..
విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న మొత్తం ఖర్చులను రాబట్టుకునేలా విద్యుత్ టారిఫ్ ఉండాల్సిందేనని విద్యుత్ చట్ట సవరణ బిల్లులో కేంద్రం పేర్కొంది. డిస్కంల నష్టాలను పూడ్చుకోవడానికి అవసరమైన మేరకు విద్యుత్ చార్జీలు పెంచకుండా, ఆ నష్టాలను వచ్చే ఏడాదికి సర్‌పాజ్ చేసుకుంటూ పోతున్న ప్రస్తుత విధానానికి ఫుల్‌స్టాప్ పెట్టాలని కోరింది. ఈ నిబంధలను అమలు చేస్తే ఏటా విద్యుత్ బిల్లులు భారీగా పెరిగే అవకాశాలున్నాయి.
సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలకు మంగళం..
ప్రస్తుతం అవలంభిస్తున్న విద్యుత్ సబ్సిడీ, క్రాస్ సబ్సిడీల విధానానికి మంగళం పాడాలని కేంద్రం కోరుతోంది. ప్రస్తుతం రాష్ట్రంలో నివాస గృహాలు, సూక్ష్మ, చిన్న పరిశ్రమలు, హెయిర్ కటింగ్ సెలూన్స్ తదితర కేటగిరీల వినియోగదారులకు సబ్సిడీ విద్యుత్ సరఫరా చేస్తున్నారు. వీరికి సంబంధించిన కొంత సబ్సిడీలను రాష్ట్ర ప్రభుత్వం డిస్కంలకు చెల్లిస్తుండగా, మిగిలిన భారాన్ని క్రాస్ సబ్సిడీల రూపంలో పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారులు భరిస్తున్నారు.
ప్రభుత్వ సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీల కారణంగానే గృహాలు, ఇతర కేటగిరీల వినియోగదారులపై బిల్లుల భారం తక్కువగా ఉంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వదలుచుకున్న సబ్సిడీలను నేరుగా నగదు బదిలీ (డీబీటీ) విధానంలో వినియోగదారులకు నేరుగా ఇవ్వాలని, పరిశ్రమలు, వాణిజ్య కేటగిరీల వినియోగదారుల నుంచి క్రాస్ సబ్సిడీల వసూళ్ల నుంచి విరమించుకోవాలని కేంద్రం కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొంది. దీంతో వినియోగదారులు సబ్సిడీ లేకుండానే విద్యుత్ బిల్లులు చెల్లించాల్సి రానుంది. దీంతో విద్యుత్ బిల్లులు భారీగా పెరగనున్నాయి.
ప్రస్తుతం క్రాస్ సబ్సిడీల భారం మోస్తున్న పరిశ్రమలు, వాణిజ్య, రైల్వే కేటగిరీల వినియోగదారులకు ఈ విధానంతో భారీ ఊరట లభించనుంది. మరోవైపు క్రాస్ సబ్సిడీల ఆదాయానికి గండిపడటంతో ఆ మేరకు చార్జీల భారం సైతం సబ్సిడీ వినియోగదారులైన గృహాలు, ఇతర వినియోగదారులపైనే పడనుంది. వ్యవసాయ కనెక్షన్లకు సైతం మీటర్లు పెట్టి బిల్లులు జారీ చేయక తప్పని పరిస్థితి ఏర్పడనుంది. కేంద్రం తీసుకొస్తున్న జాతీయ టారిఫ్ పాలసీ వస్తేనే విద్యుత్ సబ్సిడీల విషయంపై పూర్తి స్థాయి స్పష్టత రానుంది.
ప్రస్తుతం ఇలా.. భవిష్యత్తులో ఎలా..
ఇప్పుడు గృహ వినియోగదారులకు యూనిట్‌కు రూ.1.45 పైసల నుంచి రూ.9.50 వరకు వినియోగం ఆధారంగా సబ్సిడీతో బిల్లులు వేస్తున్నారు. నెలకు 50 యూనిట్లు మాత్రమే వాడితే యూనిట్‌కు రూ.1.45 చొప్పున, 100 యూనిట్ల లోపు వినియోగిస్తే 51–100 యూనిట్లకు రూ.2.45 చొప్పున బిల్లులు వసూలు చేస్తున్నారు. 100 యూనిట్లు దాటితే తొలి 100 యూనిట్లకు రూ.3.30 చొప్పున, 101–200 యూనిట్లకు రూ.4.30 చొప్పున టారిఫ్ ఉంది. వినియోగం 300 యూనిట్లు దాటితే రూ.7.20, 400 యూనిట్లకు చేరితే రూ.8.50, 400–800 యూనిట్ల వినియోగానికి రూ.9, 800 యూనిట్లు దాటితే రూ.9.50 చొప్పున ధరతో టారిఫ్ వసూలు చేస్తున్నారు.
(చదవండి: 9 రాష్ట్రాలు, యూటీల్లో జీరో కేసులు)
తక్కువ విద్యుత్ వినియోగించే పేదలకు తక్కువ ధరకు విద్యుత్ సరఫరా చేస్తున్నారని ఈ లెక్కలు పేర్కొంటున్నాయి. కేంద్రం తీసుకొచ్చిన విద్యుత్ బిల్లు అమల్లోకి వస్తే విద్యుత్ బిల్లుల్లో సబ్సిడీల అమలును నిలిపేయాల్సి వస్తుంది. విద్యుత్ సరఫరాకు డిస్కంలు చేస్తున్న వ్యయం (కాస్ట్ ఆఫ్ సర్వీస్) ఆధారంగా ఆయా కేటగిరీల వినియోగదారులకు టారిఫ్‌ను నిర్ణయించాలని ఈ బిల్లులో కేంద్రం సూచించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సగటున యూనిట్ విద్యుత్ సరఫరాకు సగటున రూ.7.02 వరకు వ్యయం అవుతోంది.
గృహ, వాణిజ్య, పరిశ్రమలు, వ్యవసాయ, తదితర కేటగిరీలకు ఈ వ్యయంలో స్వల్ప తేడాలుంటాయి. ఆయా కేటగిరీల వినియోగదారులకు విద్యుత్ సరఫరా చేసేందుకు అయ్యే వ్యయాన్ని సబ్సిడీలు, క్రాస్ సబ్సిడీలు లేకుండా పూర్తి స్థాయిలో తిరిగి రాబట్టుకోవాలని కొత్త బిల్లు చెబుతోంది. అంటే, యూనిట్‌కు రూ.7, ఆపై చొప్పున టారిఫ్‌ను వినియోగదారులందరూ చెల్లించాల్సి రానుంది. దీంతో ప్రస్తుతం నెలకు వందల్లో బిల్లులు చెల్లిస్తున్న గృహ, ఇతర కేటగిరీల బిల్లులు ఒక్కసారిగా రూ.వేలకు పెరగనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment