‘బంగారం’లాంటి మ్యూజియం.. భద్రత శూన్యం | There is no protection of the Hyderabad State Museum | Sakshi
Sakshi News home page

‘బంగారం’లాంటి మ్యూజియం.. భద్రత శూన్యం

Jan 2 2018 3:21 AM | Updated on Sep 18 2018 8:38 PM

There is no protection of the Hyderabad State Museum - Sakshi

స్టేట్‌ మ్యూజియం

సాక్షి, హైదరాబాద్‌: అదో మ్యూజియం.. నిజాం హయాంలో నిర్మితమైన విశాల భవనం.. చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌.. 18 సీసీ కెమెరాలతో నిఘా.. రాత్రింబవళ్లు పహారాలో సిబ్బంది.. పైకి చూస్తే ఎంతో భద్రమైన వ్యవస్థ అనిపిస్తుంది. కానీ అంతా అలంకార ప్రాయమే. సోలార్‌ ఫెన్సింగ్‌ పనిచేయదు, దానికి సౌర విద్యుత్‌ సరఫరా చేసే వ్యవస్థ లేదు, సీసీ కెమెరాలన్నీ ఎప్పుడో పాడైపోయాయి. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించే గదిలో రెండు పెద్ద టీవీలున్నాయి. వాటి ముందు సిబ్బంది కూర్చుని ఉంటారు. కానీ ఆ టీవీలు కూడా పనిచేయవు. ఎంతో అద్భుత పురాతన సంపద ఉన్న హైదరాబాద్‌ స్టేట్‌ మ్యూజియం దుస్థితి ఇది. 

ఎంతో విలువైన పురాతన సంపద 
పబ్లిక్‌ గార్డెన్స్‌లోని మ్యూజియంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న సంపద ఉంది. మౌర్యుల కంటే ముందు నుంచి అసఫ్‌జాహీల వరకు చెందిన మూడు లక్షల పురాతన నాణేలున్నాయి. అందులో 23వేలకుపైగా బంగారు నాణేలు, లక్ష వరకు వెండి నాణేలు ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఒక్క బ్రిటిష్‌ మ్యూజియంలో తప్ప ఎక్కడా ఇంతపెద్ద సంఖ్యలో పురాతన నాణేలు లేవు. కొన్ని నాణేల విలువ అంతర్జాతీయ మార్కెట్‌లో రూ.కోట్లలో పలుకుతుంది కూడా. సరైన భద్రత లేకపోవడంతో ఆ నాణేలను స్టోర్‌రూమ్‌కే పరిమితం చేశారు. సందర్శకులకు అందుబాటులో ఉంచలేదు.

ఇక గద్వాలలో జరిపిన తవ్వకాల్లో లభించిన పురాతన బంగారు, వెండి ఆభరణాలు.. మొఘల్‌ చక్రవర్తులు వినియోగించిన వందకుపైగా భోజన పాత్రలు ఇక్కడ ఉన్నాయి. మొఘల్‌ పాలకులు వీటిని అప్పట్లోనే చైనాలో ప్రత్యేకంగా తయారు చేయించి, తెప్పించారు. ఇక శాతవాహనులు, పద్మనాయకులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి బంగారు, వెండి విగ్రహాలు, ఇతర వస్తువులు కూడా స్టేట్‌ మ్యూజియంలో ఉన్నాయి. పోర్సలిన్‌ పాత్రలు, పింగాణి గిన్నెలు, ఇనుప పాత్రలపై రంగులద్ది రూపొందించిన వస్తువులు, టిప్పు సుల్తాన్‌ తుపాకీ ఇలా మూడు వేల వరకు పురాతన వస్తువులు.. అజంతా, ఎల్లోరాల్లో లభించినవాటితో సహా ప్రాచీన కాలం నాటి పెయింటింగులు ఉన్నాయి. ఇంత విలువైన పురాతన సంపద ఉన్నా.. తగిన భద్రత లేకపోవడం ఆందోళనకరంగా మారింది. 

ఇలాగైతే ఎలా? 
స్టేట్‌ మ్యూజియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 18 మంది పురావస్తు శాఖ సిబ్బంది ఉంటారు. రాత్రివేళ ఐదుగురు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది గస్తీ కాస్తారు. వీరి వద్ద కూడా కర్రలు తప్ప ఇతర ఆయుధాలేమీ ఉండవు. విద్యుత్‌ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు పనిచేయవు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా దుండగులు ప్రవేశించి.. పురాతన సంపదను దోచుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. 

ఎందుకీ పరిస్థితి ?
ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మ్యూజియం భద్రత కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వాటితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించింది. దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేసి 18 సీసీ కెమెరాలు, భవనం చుట్టూ సోలార్‌ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు రెండు టీవీలను ఓ గదిలో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఆ సంస్థే ఒక సంవత్సరం పాటు పర్యవేక్షించి.. ఒప్పందం గడువు పూర్తికావటంతో తప్పుకుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు రాకపోవటంతో సీసీ కెమెరాలు, సోలార్‌ ఫెన్సింగ్‌ వ్యవస్థ దెబ్బతిన్నది. అధికారులు నిధులు లేవంటూ వాటికి మరమ్మతులు చేయించకుండా వదిలేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement