State Museum
-
‘బంగారం’లాంటి మ్యూజియం.. భద్రత శూన్యం
సాక్షి, హైదరాబాద్: అదో మ్యూజియం.. నిజాం హయాంలో నిర్మితమైన విశాల భవనం.. చుట్టూ సోలార్ ఫెన్సింగ్.. 18 సీసీ కెమెరాలతో నిఘా.. రాత్రింబవళ్లు పహారాలో సిబ్బంది.. పైకి చూస్తే ఎంతో భద్రమైన వ్యవస్థ అనిపిస్తుంది. కానీ అంతా అలంకార ప్రాయమే. సోలార్ ఫెన్సింగ్ పనిచేయదు, దానికి సౌర విద్యుత్ సరఫరా చేసే వ్యవస్థ లేదు, సీసీ కెమెరాలన్నీ ఎప్పుడో పాడైపోయాయి. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించే గదిలో రెండు పెద్ద టీవీలున్నాయి. వాటి ముందు సిబ్బంది కూర్చుని ఉంటారు. కానీ ఆ టీవీలు కూడా పనిచేయవు. ఎంతో అద్భుత పురాతన సంపద ఉన్న హైదరాబాద్ స్టేట్ మ్యూజియం దుస్థితి ఇది. ఎంతో విలువైన పురాతన సంపద పబ్లిక్ గార్డెన్స్‌లోని మ్యూజియంలో ఎంతో చారిత్రక ప్రాధాన్యమున్న సంపద ఉంది. మౌర్యుల కంటే ముందు నుంచి అసఫ్‌జాహీల వరకు చెందిన మూడు లక్షల పురాతన నాణేలున్నాయి. అందులో 23వేలకుపైగా బంగారు నాణేలు, లక్ష వరకు వెండి నాణేలు ఉండడం గమనార్హం. ప్రపంచవ్యాప్తంగా ఒక్క బ్రిటిష్ మ్యూజియంలో తప్ప ఎక్కడా ఇంతపెద్ద సంఖ్యలో పురాతన నాణేలు లేవు. కొన్ని నాణేల విలువ అంతర్జాతీయ మార్కెట్లో రూ.కోట్లలో పలుకుతుంది కూడా. సరైన భద్రత లేకపోవడంతో ఆ నాణేలను స్టోర్‌రూమ్‌కే పరిమితం చేశారు. సందర్శకులకు అందుబాటులో ఉంచలేదు. ఇక గద్వాలలో జరిపిన తవ్వకాల్లో లభించిన పురాతన బంగారు, వెండి ఆభరణాలు.. మొఘల్ చక్రవర్తులు వినియోగించిన వందకుపైగా భోజన పాత్రలు ఇక్కడ ఉన్నాయి. మొఘల్ పాలకులు వీటిని అప్పట్లోనే చైనాలో ప్రత్యేకంగా తయారు చేయించి, తెప్పించారు. ఇక శాతవాహనులు, పద్మనాయకులు, చాళుక్యులు, కాకతీయుల కాలం నాటి బంగారు, వెండి విగ్రహాలు, ఇతర వస్తువులు కూడా స్టేట్ మ్యూజియంలో ఉన్నాయి. పోర్సలిన్ పాత్రలు, పింగాణి గిన్నెలు, ఇనుప పాత్రలపై రంగులద్ది రూపొందించిన వస్తువులు, టిప్పు సుల్తాన్ తుపాకీ ఇలా మూడు వేల వరకు పురాతన వస్తువులు.. అజంతా, ఎల్లోరాల్లో లభించినవాటితో సహా ప్రాచీన కాలం నాటి పెయింటింగులు ఉన్నాయి. ఇంత విలువైన పురాతన సంపద ఉన్నా.. తగిన భద్రత లేకపోవడం ఆందోళనకరంగా మారింది. ఇలాగైతే ఎలా? స్టేట్ మ్యూజియంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు 18 మంది పురావస్తు శాఖ సిబ్బంది ఉంటారు. రాత్రివేళ ఐదుగురు ప్రైవేటు సెక్యూరిటీ సిబ్బంది గస్తీ కాస్తారు. వీరి వద్ద కూడా కర్రలు తప్ప ఇతర ఆయుధాలేమీ ఉండవు. విద్యుత్ ఫెన్సింగ్, సీసీ కెమెరాలు పనిచేయవు. ఇలాంటి పరిస్థితిలో ఎవరైనా దుండగులు ప్రవేశించి.. పురాతన సంపదను దోచుకుంటే పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఎందుకీ పరిస్థితి ? ఐదేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం మ్యూజియం భద్రత కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించింది. వాటితో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వెంటనే ఓ ప్రైవేటు సంస్థకు బాధ్యత అప్పగించింది. దాదాపు రూ.కోటి వరకు ఖర్చు చేసి 18 సీసీ కెమెరాలు, భవనం చుట్టూ సోలార్ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించేందుకు రెండు టీవీలను ఓ గదిలో ఏర్పాటు చేశారు. ఈ ఏర్పాట్లను ఆ సంస్థే ఒక సంవత్సరం పాటు పర్యవేక్షించి.. ఒప్పందం గడువు పూర్తికావటంతో తప్పుకుంది. ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిర్వహణ నిధులు రాకపోవటంతో సీసీ కెమెరాలు, సోలార్ ఫెన్సింగ్ వ్యవస్థ దెబ్బతిన్నది. అధికారులు నిధులు లేవంటూ వాటికి మరమ్మతులు చేయించకుండా వదిలేశారు. -
‘మమ్మీ’కి ప్రాణం..!
- జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీషోకేస్ కొనుగోలు - విదేశీ సంస్థతో ఒప్పందం.. మరో నెలలో ఏర్పాటు - షోకేస్‌లోకి గాలిచొరబడకుండా నైట్రోజన్ జనరేటర్ - ఇప్పటికీ మమ్మీ సురక్షితమేనని స్కానింగ్, ఎక్స్‌రే ద్వారా నిర్ధారణ సాక్షి, హైదరాబాద్: మనిషికి ప్రాణవాయువు గాలి.. అది అందకుంటే ఉక్కిరిబిక్కిరవుతాడు.. కానీ అదే ఆక్సిజన్ ‘ఆమె’ను అవసానదశకు చేర్చింది.. ఇప్పుడు ఆమెను రక్షించేం దుకు ఆక్సిజన్ అందకుండా చేయబోతున్నా రు. ఇందుకోసం జర్మనీ నుంచి ప్రత్యేక పరికరాన్ని తెప్పిస్తున్నారు. ఇదంతా డాక్టర్ వైఎస్సా ర్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ‘మమ్మీ’ కథ. స్టేట్ మ్యూజియంలో ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యమైంది ఈజిప్షియన్ మమ్మీ. సందర్శకులు దీన్ని ఆసక్తిగా తిలకిస్తుంటారు. అందుకే మ్యూజియం హాలులో ప్రాధాన్యం కల్పించి దీన్ని ఏర్పాటు చేశారు. కానీ దానికి శాస్త్రీయ సురక్షిత కవచం లేకపోవటంతో వాతావరణ పరిస్థితులు, వాయు, శబ్ద కాలుష్యం బారిన పడి దెబ్బతింది. ఇప్పుడు దీన్ని ‘రక్షించేం దుకు’ పురావస్తు శాఖ ఏర్పాట్లు చేసింది. ఇందుకోసం రూ.58 లక్షలు వెచ్చించి ఆక్సిజన్ జొరబడని ఎయిర్ ఫ్రీ గ్లాస్ షోకేసును కొంటోంది. ఈ మేరకు జర్మనీకి చెందిన ఓ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మరో నెల రోజుల్లో ఈ షోకేసు నగరానికి చేరనుంది. ఎందుకీ పరిస్థితి.. దేశంలోని ఆరు ప్రాంతాల్లో ఈజిప్షియన్ మమ్మీలు ఉన్నాయి. ఇందులో దక్షిణాదిలో ఏకైక మమ్మీ మన స్టేట్ మ్యూజియంలో కొలువుదీరింది. 2353 ఏళ్ల క్రితం చనిపోయిన యువతి శవాన్ని ఈజిప్షియన్ పద్ధతుల్లో మమ్మీగా మార్చారు. దాన్ని ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ అల్లుడు వేయి పౌండ్లు వెచ్చించి భాగ్యనగరానికి తెప్పించారు. ఆ తర్వాత ఇది ఏడో నిజాం మీర్ఉస్మాన్ అలీఖాన్‌కు బహుమతిగా రావటంతో 1930లో దాన్ని ఆయన స్టేట్ మ్యూజియంకు బహూకరించారు. అప్పటి నుంచి అది మ్యూజి యంలో ప్రధాన ఆకర్షణగా ఉంది. 4 వైపులా అద్దాలున్న చెక్క షోకేసులో ఈ మమ్మీని ఉంచారు. దీంతో లోనికి సులభంగా ఆక్సిజన్ జొరబడి బ్యాక్టీరియా ఉత్పన్నమై మమ్మీ క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. బాగా దెబ్బతిన్నాకగానీ పురావస్తు శాఖ అధికారులు దీనిని గుర్తించలేదు. దీంతో మమ్మీని ఎలా కాపాడాలో తెలియక ఇరాన్‌కు చెందిన నిపుణులకు కబురుపెట్టారు. వారు వచ్చి వెంటనే ఆక్సిజన్ ఫ్రీ షోకేస్ ఏర్పాటు చేయాలని చెప్పటంతో ఇప్పుడు దాన్ని తెప్పించే ఏర్పాట్లు చేశారు. ఇటీవల ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ప్రకటన ఇవ్వటంతో జర్మనీకి చెందిన గ్లాస్బా అనే సంస్థ రూ.58 లక్షలకు కొటేషన్ వేసి ఎంపికైంది. ఇప్పుడు ఆ సంస్థతో పురావసు ్తశాఖ ఒప్పందం కుదుర్చుకుంది. మూడేళ్ల వారంటీ తో మరో నెల రోజుల్లో అది ఆక్సిజన్ ఫ్రీ షోకేస్‌ను సమకూర్చనుంది. దీనికి నైట్రోజన్ సరఫరా చేసే జనరేటర్ కూడా ఉంటుంది. ఇది బ్యాక్టీరియాను నియంత్రిస్తుంది. ఆ మమ్మీ 16 ఏళ్ల యువతిది కాదట.. మ్యూజియంలో ఉన్న మమ్మీ ఈజిప్టు రాజకుటుంబానికి చెందిన 16 ఏళ్ల యువతిదిగా భావిస్తూ వచ్చారు. కానీ.. ఇటీవల స్కానింగ్, ఎక్స్‌రేలు తీసి పరిశీలించగా, అది 25 ఏళ్ల యువతిదని తేల్చారు. ఇప్పటికీ మెదడులోని కొంతభాగం చెక్కుచెదర లేదని, ఇతర ప్రధాన శరీర భాగాలు కూడా బాగానే ఉన్నాయని తేలింది. ఇది తదుపరి పరిశోధనలకూ ఉపయోగపడుతుందని గుర్తించారు.