పెట్టుబడి పెట్టండి.. ప్రజలు భరిస్తారు! | Rs. 5.050 million to the solar project | Sakshi
Sakshi News home page

పెట్టుబడి పెట్టండి.. ప్రజలు భరిస్తారు!

Published Thu, Jan 21 2016 1:25 AM | Last Updated on Tue, Sep 18 2018 8:38 PM

పెట్టుబడి పెట్టండి.. ప్రజలు భరిస్తారు! - Sakshi

పెట్టుబడి పెట్టండి.. ప్రజలు భరిస్తారు!

సమూల విద్యుత్ సంస్కరణలకు కేంద్రం శ్రీకారం
♦ అందరికీ విద్యుత్ సరఫరా.. పెట్టుబడుల ఆకర్షణ లక్ష్యాలు
♦ విద్యుత్ ఉత్పత్తిపై ప్రభావం చూపే పన్నులు, సుంకాలు నేరుగా వినియోగదారులపైకి బదిలీ చేసేందుకు అవకాశం
♦ ప్లాంట్ల సామర్థ్యం నూరు శాతం విస్తరణకు నిర్ణయం
♦ వ్యర్థాలతో తయారయే విద్యుత్ అంతా రాష్ట్రాలు కొనాల్సిందే
♦ కొత్త విద్యుత్ టారిఫ్ విధానానికి కేంద్ర కేబినెట్ ఆమోదం
 
 న్యూఢిల్లీ: అందరికీ విద్యుత్ అందించటంతో పాటు.. విద్యుత్ రంగంలోకి ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించటం లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం సమూల విద్యుత్ సంస్కరణలకు తెరతీసింది. ఇందులో భాగంగా.. విద్యుత్ ఉత్పత్తి వ్యయంపై ప్రభావితం చూపే పన్నులు, సుంకాలను నేరుగా వినియోగదారులపైకి బదిలీ చేయటానికి అనుమతిస్తూ కొత్త విద్యుత్ టారిఫ్ విధానాన్ని ఆమోదించింది. అందులో.. ప్రస్తుత విద్యుత్ ప్లాంట్లు నూరు శాతం సామర్థ్యాన్ని విస్తరించుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు అనుమతిస్తూ.. అలా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మార్పిడి పద్ధతుల్లో అమ్ముకునే వీలు కల్పించింది.

బొగ్గు కొరత ఉన్న ప్లాంట్లు ఇతర మార్గాల్లో ఇంధనం సమకూర్చుకుని విద్యుత్‌ను ఉత్పత్తి చేసే పక్షంలో.. అందుకయే అదనపు వ్యయాన్నీ నేరుగా వినియోగదారుల మీదకు బదిలీచేసే అవకాశం కల్పించింది. మొత్తంగా.. ‘విద్యుత్ రంగంలో పెట్టుబడులు పెట్టండి.. లాభాలు పొందండి.. అందరికీ విద్యుత్ అందించండి.. పన్నులు, సుంకాలు, వ్యయం వ్యత్యాసాల భారం ప్రజలకు బదిలీ చేయండి...’ అన్న రీతిలో  సంస్కరణలు ఉన్నాయి. ఈ మేరకు బుధవారం ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం.. 2006 నాటి టారిఫ్ విధానాన్ని సవరించటం కోసం విద్యుత్ శాఖ చేసిన సంస్కరణల ప్రతిపాదనను ఆమోదించింది.

అందరికీ విద్యుత్‌ను అందుబాటులోకి తేవటం, వివాదాలను తగ్గించటం, పెట్టుబడులను పునరుద్ధరించటం, పర్యావరణాన్ని పరిరక్షించటం అనే లక్ష్యాలను సాధించటానికి ఈ సంస్కరణలు దోహదపడతాయని విద్యుత్ మంత్రి పీయూష్ గోయల్ కేబినెట్ భేటీ అనంతరం విలేకరులకు తెలిపారు. మంత్రితో పాటు ప్రభుత్వం  ప్రకటనలో తెలిపిన వివరాలివీ..

 సుంకాలు, పన్నులు నేరుగా బదిలీ
 పోటీ బిడ్డింగ్‌తో ఏర్పాటు చేసే విద్యుత్ ప్రాజెక్టుల్లో మార్కెట్ అనిశ్చితులను తొలగించించడానికి  అంతర్గత సుంకాలు, పన్నులు, లెవీలు, సెస్సుల్లో ఎటువంటి మార్పులు జరిగినా వాటి ప్రభావం ఆ ప్రాజెక్టులపై పడకుండా నేరుగా వినియోగదారులపైకి బదిలీ చేయటానికి కొత్త విధానం అనుమతిస్తోంది. బొగ్గు సెస్సు లేదా ఎక్సైజ్ వంటి సుంకాలు ఏవైనా పెరిగినపుడు.. దానిని చట్టంలో మార్పు చేసినట్లుగా పరిగణిస్తారు. టారిఫ్‌తో సంబంధం లేకుండా బదిలీ చేయటానికి అనుమతిస్తారు. ఇది విద్యుత్ అప్పిలేట్ ట్రిబ్యునల్‌లో కేసుల సంఖ్య తగ్గటానికి దోహదపడుతుంది.

అయితే.. ఆయా పన్నులు, సుంకాలు నేరుగా వినియోగదారులపైకి బదిలీ చేయటం వల్ల ప్రజలపై భారం పడుతుందని పరిశీలకులు చెప్తున్నారు. కోల్ ఇండియా సరఫరా చేయాల్సిన బొగ్గు పరిమాణంలో హెచ్చుతగ్గులు ఉన్నపుడు సదరు విద్యుత్ ప్లాంట్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసినపుడు అయే అదనపు వ్యయాన్నీ నేరుగా వినియోగదారులపైకి బదిలీ చేసేందుకు కొత్త టారిఫ్ విధానం వీలు కల్పిస్తోంది.

 జలవిద్యుత్ ప్లాంట్లకు మినహాయింపు
 బొగ్గు సమృద్ధిగా ఉన్న తూర్పు రాష్ట్రాల్లో పెట్టుబడులను ప్రోత్సహించి, ఉపాధి సృష్టించాలని కొత్త విధానంలో నిర్దేశించారు. డిస్కమ్‌లు నియంత్రిత టారిఫ్‌ల కింద 35 శాతం వరకూ విద్యుత్‌ను కొనుగోలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వాలు ప్లాంట్లు నెలకొల్పేందుకు కొత్త విధానం అనుమతిస్తుంది. దీర్ఘ కాలిక పీపీఏల (విద్యుత్ కొనుగోలు ఒప్పందాల) ద్వారా జలవిద్యుత్ ప్రాజెక్టులకు ప్రోత్సాహమివ్వాలని కొత్త విధానం నిర్దేశిస్తోంది. ఇందుకు 2022 ఆగస్టు వరకూ పోటీ బిడ్డింగ్ నుంచీ మినహాయింపునివ్వాలని చెప్తోంది. వినియోగదారులందరికీ 24/7 విద్యుత్ సరఫరా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు, రెగ్యులేటరీ సంస్థలు విద్యుత్ సరఫరా ప్రణాళికను రూపొందిస్తాయి. మారుమూల విద్యుత్ అనుసంధానం లేని గ్రామాలకు సూక్ష్మ గ్రిడ్ల ద్వారా విద్యుత్‌ను అందిస్తారు.

 నూరు శాతం సామర్థ్య విస్తరణ
 ప్రస్తుత విద్యుత్ ప్లాంట్లను నూరు శాతం విస్తరించటానికి అనుమతిస్తారు. వాటికి ముందుగానే పర్యావరణ, అటవీ అనుమతుల వంటివి ఉండటం వల్ల వాటిని విస్తరించటం తేలిక కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు. నష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థలు.. ప్లాంట్ల నుంచి విద్యుత్ మొత్తాన్నీ కొనటం లేదు. దీంతో అవి సామర్థ్యానికంటే తక్కువ విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంటాయి.  మిగిలిన అదనపు సామర్థ్యం ద్వారా ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను.. ఆయా ప్లాంట్లు విద్యుత్ మార్పిడి విధానంలో అమ్మే వీలు కలుగుతుంది. ఈ విద్యుత్  అమ్మకంపై ప్లాంట్ల లాభాన్ని.. ఆ ప్లాంట్లు, రాష్ట్ర డిస్కమ్‌లు పంచుకోవటం జరుగుతుంది.

 వ్యర్థాల విద్యుత్ మొత్తం కొనాల్సిందే
 పునర్వినియోగిత విద్యుత్ బాధ్యతలో భాగంగా.. 2022 మార్చి నాటికి జలవిద్యుత్ మినహా మిగతా విద్యుత్ వినియోగంలో 8 శాతం సౌరవిద్యుత్ ఉండాలని కొత్త టారిఫ్ విధానం నిర్దేశిస్తోంది. డిస్కమ్‌లు పునర్వినియోగిత విద్యుత్ వాటానూ పెంచాల్సి ఉంటుంది. అవి తమ రాష్ట్రాల్లో వ్యర్థాల నుంచి ఉత్పత్తి చేసిన విద్యుత్‌ను మొత్తాన్నీ కొనాల్సి ఉంటుంది. ఇది స్వచ్ఛ భారత్‌కు ప్రోత్సాహాన్నిస్తుంది. అలాగే.. సౌరవిద్యుత్, వాయువిద్యుత్‌లపై అంతర్రాష్ట్ర సరఫరా చార్జీలు, నష్టాలు విధించరాదని కొత్త విధానంలో నిర్దేశించారు. మురుగునీటి శుద్ధి ప్లాంట్లకు 50 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ధర్మల్ విద్యుత్ ప్లాంట్లు.. శుద్ధి చేసిన నీటిని వినియోగించాలి. అది శుభ్రమైన తాగునీటిని నగరాలకు విడుదల చేయటానికి దోహదపడుతుంది.. గంగా వంటి నదులు కాలుష్యం బారిన పడటాన్ని తగ్గిస్తుంది.
 
 పోటీ బిడ్డింగ్‌లో లైన్ల నిర్మాణం
  కొత్త విధానం కింద భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల వంటిచోట్ల కొన్ని విద్యుత్ సరఫరా లైన్లు మినహా.. అన్ని ట్రాన్స్‌మిషన్ లైన్లనూ పోటీ బిడ్డింగ్‌లో వేలం వేస్తారు. లైన్లను తక్కువ వ్యయంతో త్వరగా పూర్తిచేసే వీలుంది.  కొత్త విధానంకింద.. విద్యుత్ వినియోగం రోజులో సమయం(టైమ్ ఆఫ్ డే) లెక్కలు వేయటానికి, చోరీ తగ్గించటానికి, మొత్తాన్నీ లెక్కలోకి తీసుకురావటానికి స్మార్ట్ మీటర్లను అమరుస్తారు.
 
 సౌర ప్రాజెక్టులకు రూ. 5,050 కోట్లు
 నెహ్రూ నేషనల్ సోలార్ మిషన్ కింద 5,000 మెగావాట్ల సామర్థ్యం గల గ్రిడ్ అనుసంధానిత సౌరవిద్యుత్ ప్రాజెక్టుల స్థాపన కోసం రూ. 5,050 కోట్ల వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.  మునిసిపల్ వ్యర్థాలతో చేసిన కంపోస్ట్ అమ్మకంపై టన్నుకు రూ. 1,500 చొప్పున సాయమందించటానికీ పచ్చజెండా ఊపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement