
సాక్షి, అమరావతి: విద్యుత్ రంగంలో దేశీయ ఉపకరణాల వినియోగానికే అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని కేంద్ర ఇంధన శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు ఏపీతో పాటు అన్ని రాష్ట్రాలకూ మార్గదర్శకాలు జారీ చేసింది. ‘మేక్ ఇన్ ఇండియా’ ఉత్పత్తులను ప్రోత్సహించే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. దీనివల్ల రాష్ట్రాల్లోనూ కొత్త కంపెనీలు రావడానికి అవకాశం ఉంటుందన్న ఆశాభావం వ్యక్తం చేసింది. విద్యుత్ పంపిణీ విభాగంలో ఉపయోగించే ట్రాన్స్‌ఫార్మర్లు, రియాక్టర్లు, స్విచ్ గేర్లు, సబ్‌స్టేషన్ల నిర్మాణ సామగ్రి, జల విద్యుత్ ఉత్పత్తిలో ఉపయోగించే హైడ్రో టర్బైన్స్, జనరేటర్స్ వంటి భాగాలన్నీ స్థానికంగా తయారైనవే వాడాలని సూచించింది.
ఇవీ మార్గదర్శకాలు
► థర్మల్ విభాగంలో ఇప్పటివరకూ విదేశీ పరికరాలను ఉపయోగిస్తున్నారు. వీటి స్థానంలో స్వదేశంలో తయారైన ఉత్పత్తుల వినియోగానికే ప్రాధాన్యత ఇవ్వాలి. బాయిలర్స్‌లో వాడే మిల్స్, ఎయిర్ ప్రీ హీటర్స్, టర్బైన్స్లో వినియోగించే ముఖ్యమైన విడి భాగాల విషయంలోనూ దేశీయంగా తయారైన వాటికే అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
► చివరకు బొగ్గు నిర్వహణలో ప్రధాన పాత్ర పోషించే కన్వేయర్లు, ఇతర భాగాలు భారత్‌లో తయారైనవే ఉండాలి.
► బొగ్గును మండించడం ద్వారా వచ్చే బూడిదను నిల్వ చేసే విషయంలోనూ ఇదే సూత్రాన్ని పాటించాలి.
కేటగిరీలుగా విభజన..
► దేశీయ, విదేశీ ఉపకరణాలు వాడే కాంట్రాక్ట్ సంస్థలను కేటగిరీలుగా విభజించాలి.
► దేశీయ పరికరాలు వాడే వారికి కాంట్రాక్ట్ విధానంలో సడలింపులు ఇవ్వాలి.
► విదేశీ, దేశీయ ఉపకరణాలు వాడాల్సిన పరిస్థితుల్లో భారత్‌లో లభించే వస్తువులను దిగుమతి చేసుకునే సంస్థలను ముందుగా గుర్తించి.. విదేశీ దిగుమతి అవకాశం కల్పించాలి. అవసరమైతే విదేశీ వస్తువుల దిగుమతికి వీలుగా దేశీయ కంపెనీలు ఇతరులతో ఒప్పందం చేసుకునే వెసులుబాటు కల్పించాలి.
► ఈ ముసాయిదాను గతంలోనే విడుదల చేసిన కేంద్రం తాజాగా కొన్ని మార్పులతో రాష్ట్రాలకు పంపింది. దీనిపై స్పష్టమైన వైఖరి తెలియజేయాలని కోరింది.
Comments
Please login to add a commentAdd a comment