తీరు మారాలి
జిల్లా వ్యవసాయరంగం పైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం జిల్లాలోని రైతులు వర్షాభావ పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ప్రాజెక్టుల ఆయకట్టు కంటే బోర్ల ఆధారంగా పండించే పంటలే ఎక్కువ. ఈ సమయంలో పంటలను కాపాడాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ముఖ్యంగా విద్యుత్ శాఖ అధికారులపై ఉంది. ఎట్టి పరిస్థితులలో వ్యవసాయానికి ఏడు గంటలపాటు కరెంటు సరఫరా చేసి తీరాల్సిందే. అధికారుల తీరు మారకపోతే చర్యలు తప్పవు.
- వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
జడ్‌పీటీసీ, ఎంపీపీలను అడిగి సరి చూసుకున్నారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ అధికారులను ప్రజాప్రతినిధులు నిలదీశారు. వ్యవసాయానికి ఏడు గంటల కరెంటు ఇవ్వడం లేదని, డీడీలు కట్టి ఏళ్లు గడస్తున్నా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఇవ్వడం లేదని, నెలలు గడిచినా కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్‌లను మరమ్మత్తులు చేసి ఇవ్వడం లేదని ఆరోపించారు. అనం తరం మంత్రి పోచారం మాట్లాడుతూ, జిల్లాలో అత్యధికంగా కరెంట్ బోర్‌వెల్స్ ఉన్నాయని, మూడు లక్షల పంపుసెట్లు ఉన్నాయని పేర్కొన్నారు. 7.50 లక్షల ఎకరాల లో రైతులు పంటలు పండిస్తున్నారన్నారు. వర్షాలు కురవనందున రైతులు బోర్లపై ఆధారపడి పంటలు వేశారని, ఇలాంటి సమయంలో ఏడు గంటలపాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాల్సిందేనని అధికారులను ఆదేశించారు.
ఫోనెత్తరేం
రైతులు తమ సమస్యల పరిష్కారం కోసం అధికారులకు ఫోన్ చేస్తే ఎత్తడం లేదనే ఫిర్యాదులు చాలా వస్తున్నాయని మంత్రి అసహనం వ్యక్తం చేశారు. రైతులు కరెంట్ లేక ఇబ్బందులు పడుతున్నారని, సబ్‌స్టేషన్‌లలో ఆపరేటర్లు కూడా ఉండటంలేదన్నారు. పై నుంచి కరెంట్ వచ్చినా, పోయినా పట్టించుకునేవారు కరువయ్యారని, అందుకే విద్యుత్ సరఫరా అస్తవ్యస్తంగా ఉందన్నారు. భయంతో కాకుండా భక్తితో పని చేయాలని, ఎట్టి పరిస్థితులలోనూ ఫోన్‌లు స్విచ్ ఆఫ్ చేయద్దని సూచించారు. పడిపోయిన స్తంభాలు, వేలాడుతున్న కరెంట్ తీగలను వారం రోజులలో సరిచేయాలని ఆదేశించారు. ‘‘నేను పగలు రాత్రి గ్రామాలలో తిరుగుతూనే ఉంటా అలాంటివి ఎక్కడైనా కనిపిస్తే ఏఈలను బాధ్యులను చేస్తా’ అని హెచ్చరించారు.
డీడీలను జేబులో పెట్టుకుని తిరుగుతున్నారు లో వోల్టేజ్ సమస్య ఉందని, అదనపు ట్రాన్స్‌ఫార్మర్‌ల కోసం రైతులు డీడీలను నెలలు, సంవత్సరాలుగా తమ జేబులలో పెట్టుకుని తిరుగుతున్నారని, కాలిపోయిన వాటికి కూడా సకాలంలో మరమ్మత్తులు చేయకపోవడం సరికాదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పెండింగ్ డీడీల జాబితాను తయారు చేసి వాటిని వెంటనే పరిష్క రించాలని ట్రాన్స్‌కో ఏస్‌ఈ ప్రభాకర్‌రావునును ఆదేశించారు. ఏ ఒక్క రైతూ ఇబ్బంది పడినా ఊరుకోనన్నారు. లో వోల్టేజ్ సమస్యను తీర్చడానికి హెచ్‌వీడీఎస్ పథకం కింద రూ. 20 కోట్లతో కొత్త ట్రాన్స్‌ఫార్మర్‌ల కొనుగోలుకు అనుమతి ఉన్నా, కాంట్రాక్టర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడడం సిగ్గుచేటన్నారు. కాంట్రాక్టర్లపై ఒత్తిడి తెచ్చి, వారికి వెంట వెంటనే పేమెంట్లు చేసి, నవంబర్‌కల్లా అన్ని నియోజకవర్గాలలో ఫీడర్లను పూర్తి చేయాలని ఆదేశించారు. ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మత్తులలో అవకతవకలను ట్రాన్స్‌ఫార్మర్లు, ఆయిల్, కాయిల్స్ చోరీలను నియంత్రించాలన్నారు.
పని చేసే చోటే నివాసముండండి
అధికారులందరూ పనిచేసే మండలాలోనే నివాసముండాలని మంత్రి సూచించారు. సబ్‌స్టేషన్లలో కేటగిరివారీ ఉద్యోగుల వివరాలు అందజేయాలని ఏఈలను ఆదే శించారు. రాజీవ్‌గాంధీ విద్యుదీకరణ పథకం కింద కరెంటు స్తంభాలను వెంటనే ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జడ్‌పీ చైర్మన్ దఫేదార్‌రాజు, వైస్ చైర్ పర్సన్ సుమనారెడ్డి,ఎమ్మెల్సీ అరికెల నర్సారెడ్డి ఎమ్మెల్యేలు హన్మంత్ సింధే, ప్రశాంత్‌రెడ్డి, గంప గోవర్ధన్, బాజిరెడ్డి గోవర్ధన్, ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరరావు, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ప్రభాకర్, జిల్లా పరిషత్ సీఈఓ రాజారాం పాల్గొన్నారు.