
ఐఏఎస్ ఎవరైనా కావొచ్చు
లక్ష్యం బలంగా ఉండాలి.. అందుకు అనుగుణంగా కష్టపడాలి.. కార్పొరేట్ స్థాయి శిక్షణ లేకపోయినా ప్రణాళికబద్ధంగా చదివితే ఎవరైనా ఐఏఎస్ కావచ్చంటున్నారు సివిల్స్ 101వ ర్యాంకర్ వాసన విద్యాసాగర్‌నాయుడు. తన మాతృభూమి నరసాపురం పట్టణానికి బుధవారం ఆయన విచ్చేశారు. ఐఏఎస్ కావాలన్న అమ్మ కోరికను 24 ఏళ్ల వయసులో నెరవేర్చానన్నారు. తన విద్యాభ్యాసం, సివిల్స్ ప్రిపరేషన్ విశేషాలను ఇలా పంచుకున్నారు.
ప్రశ్న :మీ కుటుంబ నేపథ్యం
జవాబు : నాన్న త్యాగరాజు హైదరాబాద్‌లో రైల్వే సీనియర్ వర్క్‌స్టడీ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్నారు. అమ్మ దుర్గాదేవి గృహిణి. నాన్న వాళ్లది భీమవరం, అమ్మ సొంతూరు నరసాపురం. దీంతో నాకు నరసాపురంతో అనుబంధం ఎక్కువ.
ప్రశ్న : ఐఏఎస్ అయ్యేందుకు ప్రేరణ
జవాబు :మా అమ్మ, తాత గారు పోతుల నర్సింహరావు (అమ్మనాన్న). తాతగారు కష్టపడి పైకొచ్చారు. చిన్నస్థాయి వ్యాపారం నుంచి అంచెలంచెలుగా ఎదిగారు. ఆయన గురించి అమ్మ ఎప్పుడూ చెబుతుండేది. కష్టపడి చదవాలని, ఉన్నత స్థానంలో నిలవాలని ప్రేరణ కలిగించేది. దీంతో చిన్నప్పుడే ఐఏఎస్ కావాలని లక్ష్యంగా చేసుకున్నా.
ప్రశ్న : మీ విద్యార్హతలు
జవాబు : నరసాపురం క్రిస్టియన్ ఆసుపత్రి (మిసమ్మ ఆసుపత్రి)లో 1992 మార్చి 25న జన్మిం చాను. ఎల్‌కేజీ నుంచి 7వ తరగతి వరకు తెలంగాణ లోని డోర్నకల్‌లో చదివా. 8వ తరగతి నుంచి బీటెక్ వరకు హైదరాబాద్‌లో చదివా. 2013లో బీటెక్ పూర్తయింది.
ప్రశ్న : సివిల్స్‌కు ఎలా సిద్ధమయ్యారు
జవాబు: సొంతంగానే. ఉన్నత స్థాయిలో శిక్షణ ఏమీ తీసుకోలేదు. హైదరాబాద్‌లో మూడు నెలలు, ఢిల్లీలో ఓ నెలపాటు సాధారణ శిక్షణ తీసుకున్నా. సొంతంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడంతో పాటు లైబ్రరీలో పుస్తకాలు ఎక్కువగా చదివేవాడిని. సబ్జెక్ట్‌ల పరంగా ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్లాను.
ప్రశ్న : ఉన్నత స్థాయి శిక్షణ లేకుండానే ఐఏఎస్ సాధించవచ్చా
జవాబు : తప్పకుండా సాధించవచ్చు. ఇందుకు నాతో పాటు చాలా మంది ఉదాహరణగా నిలుస్తున్నారు. మా బ్యాచ్‌లో రిక్షావాలా కుమారుడు ఐఏఎస్‌కు సెలెక్ట్ అయ్యారు. ఓ ఎమ్మెల్యే మనుమడూ ఎంపికయ్యారు. సివిల్స్ సాధించడం కష్టం, ప్రతిభపై ఆధారపడి ఉంటుంది. 2014లో తొలిసారి సివిల్స్ రాసా 2015లో రెండో ప్రయత్నంలో 101వ ర్యాంక్ వచ్చింది. నా ఆప్షన్ సబ్జెక్ట్ హిస్టరీ.
ప్రశ్న : మీరు సైన్స్ విద్యార్థి కదా మరి చరిత్ర ఎలా
జవాబు : అదే తప్పు. ఐఏఎస్‌కు ప్రిపేర్ కావాలంటే ఆర్ట్స్ సబ్జెక్ట్‌లు చదవాలనే అపోహ చాలా మందిలో ఉంది. దీనిని తల్లిదండ్రులు గుర్తించాలి. పిల్లలకు ఇష్టమైన సబ్జెక్టుల్లో డిగ్రీ చదివించాలి. ఐఏఎస్‌కు కావాల్సింది ఏదైనా డిగ్రీ మాత్రమే. అది సైన్స్, ఆర్ట్స్, కామర్స్ ఏదైనా కావొచ్చు.
ప్రశ్న : మీరు ఐఏఎస్ కాకుంటే..
జవాబు : 2013లో బీటెక్ పూర్తయ్యింది. ఐఏఎస్ లక్ష్యంగా కృషిచేశా. ఒకవేళ ఐఏఎస్ కాకుంటే సాఫ్ట్‌వేర్ ఉద్యోగాన్ని ఆప్షన్‌గా పెట్టుకున్నాను.
ప్రశ్న : యువతకు మీరిచ్చే సందేశం
జవాబు : 2035 నాటికి ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా మన దేశంలో యువత సంఖ్య ఎక్కువ గా ఉంటుంది. ఇది మన దేశానికి ఉన్న బలం. ప్రస్తుతం యువత ఆలోచనా ధోరణి మారింది. ఏదో సాధించాలనే తపన బాగా పెరిగింది. ఇది మంచి పరిణామం. యువత పుస్తకాలు ఎక్కువ చదవాలి. నా చిన్నప్పుడు నాన్నగారు గిఫ్టులుగా బొమ్మలు కాకుండా పుస్తకాలు ఇచ్చేవారు. బహుశా ఇదే నన్ను ఐఏఎస్‌ను చేసిందేమో.
ప్రశ్న : పోస్టింగ్ విషయంలో మీ ఆప్షన్
జవాబు : ముందు ఆంధ్రప్రదేశ్ తర్వాత తెలంగాణ. మొత్తానికి తెలుగు రాష్ట్రాలే.