యూపీఎస్సీపై రిట్‌కు తిరస్కృతి
ఇంగ్లిష్ పరీక్షపై నిర్ణయాన్ని వ్యతిరేకించిన పిటిషనర్
న్యూఢిల్లీ: వచ్చే ఆదివారం నిర్వహించనున్న సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షకు సంబంధించి ఇంగ్లిష్ కాంప్రహెన్సివ్ విభాగంలోని ప్రశ్నలకు అభ్యర్థులు సమాధానం రాయవలసిన అవసరంలేదని యూపీఎస్సీ ఇటీవల తీసుకున్న నిర్ణయంపై దాఖలైన రిట్ పిటిషన్‌ను విచారణకు స్వీకరించేందుకు ఢిల్లీ హైకోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ అంశంపై రిట్‌పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు తగిన వేదిక కాదని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఇంగ్లీష్ ప్రశ్నలు వదిలేయండి
సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షలో మార్పులకు సంబంధించి కేంద్రం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. సీశాట్-2గా పిలిచే ప్రిలిమ్స్ రెండో పేపర్‌లో ఇంగ్లీష్ భాషకు సంబంధించిన కాంప్రహెన్షన్ స్కిల్స్ విభాగంలో అభ్యర్థులకు వచ్చే మార్కులను గ్రేడింగ్‌లో పరిగణించబోమని అందులో స్పష్టం చేసింది. పేపర్-1(సీశాట్-1)లో 200 మార్కులకు గాను సాధించే మార్కులు, పేపర్-2లో ఇంగ్లీష్ విభాగం మార్కులు తీసేయగా వచ్చే మార్కులను కలిపి మెరిట్‌ను నిర్ణయించనున్నట్లు పేర్కొంది. అందువల్ల ఆంగ్ల భాషా నైపుణ్యానికి సంబంధించిన 9 ప్రశ్నలకు(22.5 మార్కులు) సమాధానాలు ఇవ్వాల్సిన అవసరం లేదని, వాటిని వదిలిపెట్టవచ్చని అభ్యర్థులకు సూచించింది. ఈ నెల 24న ప్రిలిమ్స్ పరీక్ష జరగనుంది. సీశాట్-2లో ప్రశ్నల సరళిపై వివాదం రేగిన సంగతి తెలిసిందే.