న్యూఢిల్లీ: రేషన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, కొత్త నీటి కనెక్షన్ వంటి పౌర సేవల్ని ప్రజలకు వారి ఇంటివద్దే అందజేస్తామని ఢిల్లీ ప్రభుత్వం తెలిపింది. తొలిదశలో భాగంగా మరో 3–4 నెలల్లో దాదాపు 40 పౌర సేవలను రాష్ట్ర ప్రజలకు అందజేస్తామని వెల్లడించింది. గురువారం నాడిక్కడ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అధ్యక్షతన సమావేశమైన రాష్ట్ర కేబినెట్ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఈ విషయమై ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా మీడియాతో మాట్లాడుతూ.. ‘దేశంలోనే తొలిసారిగా పౌర సేవలను ఇంటింటికి చేరవేయబోతున్నాం.
ఈ సేవల అమలు కోసం ఓ ప్రైవేట్ ఏజెన్సీతో ఒప్పందం చేసుకుంటాం. ఇకపై పౌర సేవల కోసం భారీ లైన్లలో నిల్చునే బాధ ఢిల్లీ వాసులకు తప్పుతుంది’ అని తెలిపారు. ఇందులో భాగంగా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, కొత్త నల్లా కనెక్షన్, డ్రైవింగ్ లైసెన్స్, వివాహ రిజిస్ట్రేషన్, వికలాంగుల పెన్షన్ పథకాలు, నివాస ధ్రువీకరణ, రేషన్ కార్డుల జారీ, అందులో మార్పుల కోసం సహాయక్ వద్ద దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ సేవలకు కనీస మొత్తాలను మాత్రమే వసూలు చేయనున్నారు.
ఢిల్లీ కాలుష్యం తట్టుకోలేక..
రాజధాని ఢిల్లీలో కాలుష్యం దెబ్బకు అనారోగ్యం పాలైన కోస్టారికా రాయబారి బెంగళూరుకు మకాం మార్చారు. బాధితురాలు మారియెలా క్రూజ్ అల్వారెజ్ భారత్‌లో కోస్టారికా రాయబారిగా విధులు నిర్వర్తిస్తున్నారు. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోందని ఆమె తన బ్లాగ్‌లో పేర్కొన్నారు. ‘ఢిల్లీలో కాలుష్య స్థాయిలు ఊహించని విధంగా పెరిగాయి. నా ఆరోగ్యం దెబ్బతిని, బెంగళూరు వెళ్లే వరకు ఆ గాలి పీల్చడం వల్ల కలిగిన దుష్ప్రభావాన్ని గ్రహించలేకపోయా. కాలుష్యం కారణంగా భూమి రోదిస్తోంది. భూ మాత గోడును అందరూ పట్టించుకోవాలి’ అని ఆమె ఎంతో భావోద్వేగంతో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment