
'సగం హామీలు నెరవేర్చినా ఫర్వాలేదు'
ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో సగం నెరవేర్చినా ఫర్వాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు.
న్యూఢిల్లీ: ఎన్నికల్లో తాము ఇచ్చిన హామీల్లో సగం నెరవేర్చినా ఫర్వాలేదని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. సుపరిపాలన అందిస్తామని పునరుద్ఘాటించారు. 'సివిల్ సర్వీసెస్ డే' సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ప్రజలు తమ పాలనపై ఎంతో నమ్మకం పెట్టుకున్నారని చెప్పారు.
ఇప్పుడు ప్రశంసిస్తున్న ప్రజలు వచ్చే ఐదేళ్లలో హామీలు నెరవేర్చకుంటే చెప్పులు విసురుతారని పేర్కొన్నారు. వంద శాతం హామీలు అమలు చేయలేకపోయినా కనీసం 50 శాతమైనా చేస్తే ఫరవ్వాలేదన్నారు. పారదర్శక పాలన అందించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. అధికారుల్లో జవాబుదారీతనం పెంచుతామన్నారు. అధికారుల పనితీరును మెరుగు పరిచేందుకు పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తామన్నారు.