సాక్షితో పంచుకుంటూ ..దురిశెట్టి అనుదీప్
తెలంగాణ బిడ్డ ‘దురిశెట్టి అనుదీప్’ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్... ఇంజనీరింగ్ అనంతరంక్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ వచ్చినా సివిల్స్‌నే లక్ష్యంగా చేసుకుని శ్రమించాడు. ఆ శ్రమ ఏ స్థాయిలోఅంటే... ఒకసారి కాదు!! ఏకంగా ఐదు సార్లు సివిల్స్ రాశాడు. రెండు సార్లు మెయిన్స్ కూడాదాటలేకపోయాడు. అయితేనేం!! పట్టు వదలకుండా శ్రమించాడు. చివరకు ఐఆర్‌ఎస్ సాధించాడు.అయినా అంతటితో సంతృప్తి చెందలేదు. కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తూనే...మళ్లీ సివిల్స్ రాశాడు. ఐదో ప్రయత్నంలో... ఏకంగా ఆలిండియా నెంబర్–1 ర్యాంకును సొంతంచేసుకున్నాడు. ఈ విజయాన్ని ‘సాక్షి’తో పంచుకుంటూ అనుదీప్ ఏమన్నాడంటే...
సాక్షి, హెదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017 ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్–నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి.
మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్‌కు 180 మందిని, ఐఎఫ్‌ఎస్‌కు 42 మందిని, ఐపీఎస్‌కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్–ఏకు 565 మందిని, గ్రూప్–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు.
మాది జగిత్యాల జిల్లా మెట్‌పల్లి. నాన్న దురిశెట్టి మనోహర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్‌లో అసిస్టెంట్ ఇంజనీర్, అమ్మ జ్యోతి గృహిణి. నేను పదో తరగతి వరకు మెట్‌పల్లిలోనే చదివా. ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఎంట్రన్స్‌లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో బిట్స్‌పిలానీలో చేరి ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కానీ అందులో చేరలేదు. నాన్న లక్ష్యం మేరకు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం పెట్టుకుని దానికోసమే శ్రమించాను.
ఫైనల్ ఇయర్‌లోనే
నా ఇంజనీరింగ్ 2011లో పూర్తయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్‌లోనే సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఒరాకిల్‌లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఢిల్లీ వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ రాలేదు. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్‌లో చేరా.
జాబ్ చేస్తూనే
ఒకవైపు గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. వారాంతాల్లో, సాయంత్రం సమయంలో ఎప్పుడు వీలు చిక్కినా చదివేవాడిని. రెండో ప్రయత్నంలో 2013లో 790వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్‌ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీఎస్‌టీ, కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా.
ఆప్షనల్ ఆంత్రోపాలజీ
మనుషులు, వాళ్ల ప్రవర్తన, సమాజం తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. ఆంత్రోపాలజీ. మన గురించి మనం చదువుకోవడం ఎప్పుడూ ఆసక్తే. అందుకే ‘ఆంత్రోపాలజీ’ని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. దీన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయటం కలిసొచ్చింది.
ఐఏఎస్ లక్ష్యం.. వరస వైఫల్యాలు
ఐఆర్‌ఎస్‌కు ఎంపికైనా ఐఏఎస్ సాధించాలనే కసి ఉండేది. ఐఆర్‌ఎస్ బాధ్యతలు చూస్తూనే సివిల్స్‌కు సీరియస్‌గా చదివా. కానీ వరసగా మూడు, నాలుగో ప్రయత్నాల్లో వైఫల్యాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మెయిన్స్ దాటలేకపోయాను. ఈసారి అయిదో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణం.
అంతా సొంత ప్రిపరేషనే...
మొదట ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. తర్వాత సొంతంగా ప్రిపేరయ్యాను. మార్కెట్‌లో దొరికే ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న మెటీరియల్‌నే పునశ్చరణ చేశాను. ప్రస్తుత పోటీ నేపథ్యంలో మొదట్నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి ఫలితం వస్తుంది. సివిల్స్ ఔత్సాహికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి.
ఇంటర్వ్యూలు
ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు నా ప్రొఫైల్ నుంచే వచ్చాయి. మీరు సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలే వేశారు. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా, ప్రస్తుత పోటీలో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టం. మొదట్నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా చదివాను. చివరకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగిస్తోంది.
విద్య, ఆరోగ్యం:
యువ రాష్ట్రమైన, ఎంతో అభివృద్ధికి అవకాశమున్న తెలంగాణకు ఐఏఎస్‌గా సేవచేసే అవకాశం వస్తే నిజంగా అదృష్టమే. సివిల్స్ ఫస్ట్ ర్యాంకు నాకు పెద్ద బాధ్యతను తీసుకొచ్చింది. నా శాయశక్తులా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తా. ఎక్కడైనా పనిచేయడానికి రెడీనే. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం..నాప్రాధమ్యాలు.
ప్రొఫైల్
పదో తరగతి మార్కులు: 86 శాతం
ఇంటర్ మార్కులు: 97 శాతం
ఇంజనీరింగ్ మార్కులు: 76 శాతం
తెలుగు తేజాలు
1 దురిశెట్టి అనుదీప్
43 శీలం సాయి తేజ
100 నారపు రెడ్డి మౌర్య
144 జి/.మాధురి
196 సాయి ప్రణీత్
206 నాగవెంకట మణికంఠ
245 వాసి చందీష్
374 రిషికేశ్‌రెడి
512 ప్రవీణ్‌చంద్
513 ప్రసన్నకుమారి
607 కృష్ణకాంత్ పటేల్
624 వై.అక్షయ్ కుమార్
816 భార్గవ్ శేఖర్
884 వంశీ దిలీప్
సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017కు ఫిబ్రవరి 22, 2017న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్‌తో పాటు మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జూన్18, 2017న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది.
సివిల్స్ టాపర్లను అభినందించిన వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన ఉభయ రాష్ట్రాల తెలుగు అభ్యర్థులందరినీ అభినందిçస్తూ... వారి కృషికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు.
Comments
Please login to add a commentAdd a comment