ఇదే దురిశెట్టి అనుదీప్‌ గెలుపుబాట | Durishetty Anudeep Success Story With Sakshi | Sakshi
Sakshi News home page

నా నెం.1 మార్గమిదే.. దురిశెట్టి అనుదీప్‌ గెలుపుబాట

Published Mon, Apr 30 2018 8:09 AM | Last Updated on Sat, Sep 22 2018 7:37 PM

Durishetty Anudeep Success Story With Sakshi

యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ అంటేనే ఒక మారథాన్‌. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్‌ఎస్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్‌పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే దురిశెట్టి అనుదీప్‌. రెండో అటెంప్ట్‌లోనే ఐఆర్‌ఎస్‌కు ఎంపికైన అనుదీప్‌.. తర్వాతి ప్రయత్నాల్లో నిరాశకు గురవడానికి కారణాలు.. తనలోని లోటుపాట్లు.. వాటిని సరిదిద్దుకున్న మార్గాలు.. చివరకు అనుకున్న లక్ష్యం.. ఐఏఎస్‌ను చేరుకునేందుకు అనుసరించిన విధానాలు.. సివిల్స్‌ ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.. ఇలా వివిధ అంశాల సమాహారాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది మనలోని పరిజ్ఞానానికి సరితూగుతుందా? అని ప్రశ్నించుకోవాలి. దీనికి సానుకూల సమాధానం లభిస్తే.. మన మనసే విజయానికి అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది. లక్ష్యం దిశగా కదిలేందుకు తోడ్పాటునందిస్తుంది. నా విషయంలో ప్రస్తుత విజయంలో ఇదే కీలక అంశం. సాఫ్ట్‌వేర్‌ కొలువు చేస్తున్నా.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో సివిల్స్‌పై దృష్టిసారించాను. అందులోనూ అత్యున్నత  సర్వీసు ఐఏఎస్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలో విజయం చేజారింది. రెండో ప్రయత్నంలో మాత్రం ఐఆర్‌ఎస్‌ లభించింది. అప్పటికైతే సర్వీసులో చేరాను. కానీ, మనసంతా ఐఏఎస్‌పైనే!

స్వీయ విశ్లేషణ
2012లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్‌ తొలి దశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాను. మెయిన్‌ ఎగ్జామినేషన్‌లో వైఫల్యం ఎదురుకావడంతో కొద్దిగా నిరాశ చెందాను. ఆ వైఫల్యానికి కారణాలు ఏంటనే దానిపై స్వీయ విశ్లేషణ చేశాను. ‘రాత’లో వెనకబడటం ప్రధాన కారణమని గుర్తించా! సివిల్‌ సర్వీసెస్‌కు ప్రిపరేషన్‌ అనేది మెగా మారథాన్‌ అయితే.. పరీక్ష గదిలో చూపే ప్రదర్శన మినీ మారథాన్‌. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో పద పరిమితి, అందుబాటులో ఉన్న సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆన్సర్‌ షీట్‌పై పెన్‌ను కదిలించాలి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం బ్రేక్‌ పడినా.. విజయావకాశాలకూ బ్రేక్‌ పడినట్లే. ఈ విషయంలోనే నాలో పొరపాటు ఉందని గుర్తించాను.

తప్పులను సరిదిద్దుకుంటూ..
వేగంగా సమాధానాలు రాయలేకపోవడమే నాలో ప్రధాన లోపమని గుర్తించడంతో.. రెండో అటెంప్ట్‌కు ప్రిపరేషన్‌ సయమంలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఇది పరీక్ష హాల్లో సానుకూల ప్రదర్శనకు అవకాశం కల్పించింది. కానీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొద్దిగా తడబడ్డాను. అయినా 790వ ర్యాంకుతో ఇండియన్‌ రెవెన్యూ సర్వీస్‌ (ఐఆర్‌ఎస్‌) లభించింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది.  

లక్ష్యం.. ఐఏఎస్‌
2013లో విజయంతో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్‌ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్‌ఎస్‌ ప్రొబేషనరీ ట్రైనింగ్‌ తీసుకుంటూనే ఐఏఎస్‌ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్‌కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. పరీక్ష శైలి, ప్రశ్నలు వస్తున్న తీరులో మార్పు, మూడు గంటల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన పరిస్థితికి అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోవడం వంటివన్నీ ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. ఒకవైపు ఐఆర్‌ఎస్‌ శిక్షణ, మరోవైపు స్వీయ ప్రిపరేషన్‌తో అధిక శాతం రీడింగ్‌పైనే దృష్టి పెట్టడంతో రైటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించకపోయాను. దీనివల్ల వల్ల కూడా 2014, 15లో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయాను.

2016లో పరీక్షకు దూరంగా..
వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. అప్పటికే బ్రెయిన్‌ ఎగ్జాస్ట్‌ అయింది. దీంతో 2016లో అటెంప్ట్‌ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్‌’ దూరం కాలేదు. 

‘‘సాధించాలి.. సాధించాలి..’’ అనే మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో నిరాశకు ఫుల్‌స్టాప్‌ పెట్టాను. 2017 నోటిఫికేషన్‌లో అటెంప్ట్‌ ఇచ్చాను. వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్‌ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్‌ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్‌ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను. అప్పటికే సబ్జెక్టు పరిజ్ఞానం పరంగా పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్‌ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్‌కు అవసరమైన  ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్‌–1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను.

అందరూ చదివేది ఆ పుస్తకాలే..
ఇక సివిల్‌ సర్వీసెస్‌ ఎగ్జామినేషన్‌ సిలబస్, మెటీరియల్‌ కోణంలో ఆలోచిస్తే.. పేపర్లకు సంబంధించి అభ్యర్థుల్లో అధిక శాతం మంది చదివే పుస్తకాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్‌ పాలిటీకి లక్ష్మీకాంత్‌ మెటీరియల్, ఎకనామిక్స్‌కు మిశ్రా అండ్‌ పూరి.. ఇలా ప్రతి సబ్జెక్టుకు మార్కెట్‌లో మెటీరియల్‌ పరంగా ట్రేడ్‌ మార్క్‌ పుస్తకాలు ఉంటాయి. అభ్యర్థులందరూ దాదాపు అవే పుస్తకాలు ఉపయోగించుకుంటారు. కానీ, విజయం లభించేది కొందరికే. కారణం.. మెటీరియల్‌ చదివేటప్పుడు అనుసరించే ధోరణి, దృక్పథం. అంతేకాకుండా.. పరీక్షలో వచ్చేందుకు అవకాశమున్న ప్రశ్నలను గుర్తించగలిగే విలక్షణ నైపుణ్యం. దీనికోసం చేయాల్సిందల్లా గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషించడం. దినపత్రికలు, ఇంటర్నెట్‌ను సమర్థంగా ఉపయోగించుకోవాలి.  

చదువుతున్నప్పుడే రైటింగ్‌ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌కు ముందు ప్రిపరేషన్‌ నుంచే డిస్క్రిప్టివ్‌ అప్రోచ్‌ను అలవరచుకోవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సరైన సమాధానాలు రాయగలిగే సామర్థ్యం, సమయ పాలన అలవడతాయి. ఇవే విజేతలకు, పరాజితులకు మధ్య ప్రధాన వ్యత్యాసాలు లేదా కారణాలు. అంతేగానీ విజేతలు హైపర్‌ యాక్టివ్‌ అనే ఆలోచనను వదులుకోవాలి. సివిల్‌ సర్వీసెస్‌లో విజయం అంటే ఏళ్లతరబడి చదివితేగానీ సాధ్యం కాదు’ అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే ఒక శాస్త్రీయ పద్ధతిలో కష్టపడి చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. స్మితా సబర్వాల్‌ వంటి వారు ఇందుకు ఉదాహరణ. 

మాధ్యమం సమస్య.. ఓ అపోహ
చాలా మంది సివిల్స్‌ ఔత్సాహికుల్లో ఉండే మరో ప్రధాన అపోహ.. పరీక్ష రాసే మాధ్యమం. ఇంగ్లిష్, హిందీ మీడియంలలో పరీక్ష రాస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్ల అవి కొంత తగ్గుతాయని అనుకుంటారు. కానీ, నా అభిప్రాయంలో ఇది కేవలం అపోహ మాత్రమే. మనం ఏ మాధ్యమంలో అటెంప్ట్‌ ఇచ్చినా.. రాసిన సమాధానంలో ఫ్లేవర్‌ ఉంటే ఫలితం మనకు ఫేవర్‌గా ఉంటుంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పరంగా రేషనలైజేషన్‌ విషయంలో యూపీఎస్సీ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అందువల్ల మాధ్యమం విషయంలో ఆందోళన అనవసరం. 

ప్రాంతీయ మాధ్యమంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్య.. మెటీరియల్‌. ఇది ఎక్కువగా ఇంగ్లిష్‌ మీడియంలోనే అందుబాటులో ఉంటోంది. దీంతో దీన్ని అర్థం చేసుకుని తెలుగులోకి అనువదించుకోవడం కొంత సమస్యగా మారింది. అంతేకాకుండా సమయ పాలన సమస్య కూడా కనిపిస్తోంది. అయితే కచ్చితంగా ప్రాంతీయ మాధ్యమంలోనే అటెంప్ట్‌ ఇవ్వాలనుకున్న అభ్యర్థులు తొలి అటెంప్ట్‌కు ఏడాది ముందుగానే మెటీరియల్‌ సేకరించుకుని సదరు మాధ్యమంలోకి అనువదించుకుని ప్రిపరేషన్‌ సాగించాలి. దీనివల్ల తొలి అటెంప్ట్‌ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అనువదించుకునే క్రమంలో సబ్జెక్టు నిపుణులు లేదా సీనియర్ల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఒకవేళ తొలి అటెంప్ట్‌లో నిరాశాజనక ఫలితం ఎదురైనా ఆందోళన చెందకుండా అదే మాధ్యమంలో ప్రిపరేషన్‌ సాగించాలి. కచ్చితంగా విజయం లభిస్తుంది. అలా కాకుండా ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్లే ఓటమి ఎదురైందనే భావనతో ఇంగ్లిష్‌ మీడియంకు మారితే.. కొత్త సమస్యలు ఎదురవుతాయి.

సివిల్‌ సర్వీసెస్‌ ఫలితాల పరంగా ఇటీవల కాలంలో మరో అపోహ.. ‘సివిల్స్‌లో విజయం సాధించిన వారిలో బీటెక్, ఎంబీఏ, లేదా ప్రొఫెషనల్‌ కోర్సుల అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. పరీక్ష శైలి వారికి ఉపయోగపడే విధంగా ఉంటోంది’ అనేది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ప్రస్తుత పరీక్ష విధానంలో ఆప్షనల్స్‌కు ప్రాధాన్యం తగ్గింది. జనరల్‌ స్టడీస్‌కు ప్రాధాన్యం పెరిగింది. దీంతో బీఏ పట్టభద్రులైనా, ఎంబీఏ పట్టభద్రులైనా.. అందరికీ ఒకే విధమైన అంశాలు ఉంటాయి. అయితే సమాధానాలు ఇచ్చే సమయంలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్‌ అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. ఒక అంశాన్ని అనలిటికల్‌ అప్రోచ్‌తో సమాధానం ఇవ్వగలగడం. ఇదే వారికి కొంత అడ్వాంటేజ్‌గా మారుతుండొచ్చు. దీనికి కారణంగా అకడెమిక్‌గా బీటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో అనుసరిస్తున్న కరిక్యులంను పేర్కొనొచ్చు.

ఇంటర్వ్యూ.. ఇంటర్‌ప్రెటర్‌
చివరి దశ ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్‌ప్రెటర్‌ (అనువాదకుడు) సదుపాయాన్ని యూపీఎస్సీ కల్పిస్తోంది. ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఇంటర్‌ప్రెటర్స్‌ను కేటాయిస్తోంది. వీరు బోర్డు సభ్యులు, అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారు. కానీ, దీనివల్ల ఎదురయ్యే సమస్య.. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తం చేసిన భావం సరిగా బోర్డు సభ్యులకు చేరకపోవడం. ఈ విషయంలో నా సలహా.. ఇంగ్లిష్‌లో బేసిక్‌ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీలైనంత మేరకు ఇంటర్‌ప్రెటర్‌ అవకాశం లేకుండా నేరుగా సమాధానాలు ఇచ్చేలా సన్నద్ధం కావాలి. అప్పుడే బోర్డు సభ్యులకు, అభ్యర్థులకు మధ్య ‘ఐ’ కాంటాక్ట్, ఇంటరాక్షన్‌ విషయాల్లో సరైన సమాచార మార్పిడి జరుగుతుంది.

దురిశెట్టి అనుదీప్‌ సివిల్స్‌ ప్రస్థానం

  • 2012   తొలి ప్రయత్నం – మెయిన్స్‌లో నిరాశ.
  • 2013   రెండో ప్రయత్నం– ఐఆర్‌ఎస్‌కు ఎంపిక.
  • 2014, 2015   మూడు, నాలుగు ప్రయత్నాలు – మెయిన్స్‌లో పరాజయం.
  • 2017   అయిదో ప్రయత్నం – ఆలిండియా టాప్‌ ర్యాంకు.

ఇంటర్వ్యూ సాగిందిలా..
ఇంటర్వ్యూ విషయానికొస్తే 2018, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం సెషన్‌లో జరిగింది. అజిత్‌ భోస్లే నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు అరగంటసేపు సాగిన ఇంటర్వ్యూలో సభ్యులందరూ ప్రశ్నలు సంధించారు. నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు..

చదివింది బీటెక్‌ కదా.. సివిల్స్‌వైపు ఎందుకు రావాలనుకున్నారు?
ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. అందుకు సరైన మార్గం సివిల్‌ సర్వీసెస్‌ అని నిర్ణయించుకున్నాను.

బీటెక్‌ చదివి ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడానికి కారణం?
ఆంత్రోపాలజీ అధ్యయనంతో సమాజంలోని భిన్న సంస్కృతులు, వాటి పూర్వాపరాలు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది భవిష్యత్తులో సివిల్‌ సర్వీసెస్‌ విధుల్లోనూ ఉపయోగపడే వీలుంటుందనే ఉద్దేశంతో ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను.
     
ఇప్పటికే ఐఆర్‌ఎస్‌లో అసిస్టెంట్‌ కమిషనర్‌ హోదాలో పనిచేస్తున్నారు. అయినా మళ్లీ సివిల్స్‌కు హాజరవడానికి కారణం?
మొదటి నుంచి నా ప్రధాన లక్ష్యం ఐఏఎస్‌ సాధించడం. రెండో ప్రయత్నంలో ఐఆర్‌ఎస్‌ రావడంతో ఆ సర్వీసులో చేరాను. కానీ, నా లక్ష్యం నేరుగా ప్రజలకు సేవ చేయగలిగే సర్వీసు పొందడం. దీనికి సరైన మార్గం ఐఏఎస్‌ అని భావిస్తున్నాను. ఐఏఎస్‌ విధుల పరంగా.. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను నేరుగా ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు అవకాశం ఉంటుంది.

స్వచ్ఛ్‌ భారత్‌ పథకంపై మీ ఉద్దేశం?
కచ్చితంగా ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. దీనివల్ల అనారోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయి. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ ఉద్దేశం?
ఇవి కచ్చితంగా ప్రజలకు మేలు చేసే పథకాలే. అయితే వీటిని అమలు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతోపాటు దీర్ఘకాలికంగా మేలు చేసే సుస్థిరాభివృద్ధి పథకాలు చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం.

మీ హాబీగా ‘మెడిటేషన్‌’ను పేర్కొన్నారు? ఇది మీకు ఎలా ఉపయోగపడింది?
జీవితంలో నిరాశకు గురైన సందర్భాలు, మానసిక వ్యాకులతకు గురైన పరిస్థితుల్లో వాటి నుంచి బయటపడటానికి మెడిటేషన్‌ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి సందర్భాల్లో మెడిటేషన్‌ చేయడం వల్ల చాలా తొందరగా తిరిగి మానసికోల్లాసం లభిస్తుంది.

నాకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తులు, ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం విధులు ఇలా.. ప్రొఫైల్‌ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. అన్నిటికి సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను అనిపించింది. 
ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. అయితే ఆలిండియా టాపర్‌గా నిలవడం మాటల్లో వర్ణించలేనిది. 

సివిల్స్‌ ఔత్సాహికులకు నా సలహా..

  • మీపై మీరు నమ్మకం పెంచుకోండి.
  • వ్యూహాత్మకంగా అడుగులు వేయండి.
  • ఆప్షనల్‌ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వండి.
  • చదివిన ప్రతి అంశాన్ని రైటింగ్‌ ప్రాక్టీస్‌ చేయడం అలవర్చుకోండి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement