Anudeep Durishetty
-
పాతబస్తీ మెట్రో పనులు షురూ
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండో దశ విస్తరణకు క్షేత్రస్థాయిలో పనులు మొదలయ్యాయి. ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు చేపట్టనున్న పాతబస్తీ మెట్రో కారిడార్‌లో భూసేకరణ పనులు చేపట్టారు.ఈ కారిడార్‌లో రోడ్ల విస్తరణ, మెట్రో అలైన్మెంట్ కోసం తొలగించవలసిన నిర్మాణాలను ఇప్పటికే గుర్తించిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా 200 ఆస్తుల డిక్లరేషన్‌కు (100 ఎల్హెచ్ఎస్, 100 ఆర్హెచ్ఎస్) హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి శనివారం ఆమోదం తెలిపారు. ఈ డిక్లరేషన్‌కు అనుగుణంగా అవార్డు డిసెంబర్ నెలాఖరు నాటికి ఆమోదించనున్నట్లు పేర్కొన్నారు. మరోవైపు ఎంజీబీఎస్ నుంచి చాంద్రాయణగుట్ట వరకు నిర్మించనున్న 7.2 కిలోమీటర్ల మెట్రో అలైన్మెంట్లో భాగంగా కూలి్చవేతలను తొలగించేందుకు హైదరాబాద్ మెట్రో రైల్ ఆసక్తి గల సంస్థల నుంచి దరఖాస్తులను ఆహా్వనించింది. ఈ మేరకు తాజాగా టెండర్ నోటిఫికేషన్ వెల్లడించింది. ఇందుకోసం సుమారు రూ.1.3 కోట్లు వెచి్చంచనున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే మెట్రో కోసం ఆస్తులు కోల్పోయిన వారికి జనవరి నుంచి పరిహారం చెల్లించే అవకాశం ఉంది. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు పలు మార్గాల్లో మెట్రో రెండో దశ విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. కేబినెట్ ఆమోదం అనంతరం మెట్రో రెండో దశకు పరిపాలనాపరమైన అనుమతులు కూడా లభించాయి. అలాగే కేంద్రం ఆమోదం కోసం కూడా రెండో దశ ప్రాజెక్టు డీపీఆర్‌ను అందజేశారు. సుమారు రూ.24 వేల కోట్లకు పైగా నిధులతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందజేయనున్న నిధులతో పాటు ప్రైవేట్ సంస్థల భాగస్వామ్యంతో చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. కాగా మెట్రో మొదటి దశలోనే జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఫలక్‌నుమా వరకు నిరి్మంచవలసి ఉండగా వివిధ కారణాల వల్ల వాయిదా పడింది. ఎంజీబీఎస్ వరకే అది పరిమితమైంది. దీంతో ఈ కారిడార్‌ను రెండో దశలో చేర్చి చాంద్రాయణగుట్ట వరకు పొడిగించారు.ఈ మేరకు ఈ ఏడాది మార్చి 7వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఫలక్‌నుమా వద్ద శంకుస్థాపన కూడా చేశారు. -
సీఎం కేసీఆర్‌తో కలిసి అనుదీప్ లంచ్!
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్స్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన తెలంగాణ బిడ్డ దురిశెట్టి అనుదీప్‌ను ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రత్యేకంగా అభినందించారు. సీఎం కేసీఆర్ ఆహ్వానం మేరకు అనుదీప్, ఆయన తల్లిదండ్రులు సోమవారం ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో కలిసి వారు మధ్యాహ్న భోజనం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సివిల్స్ టాపర్‌గా నిలిచిన అనుదీప్ యువతకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. లక్ష్యసాధన కోసం చిత్తశుద్ధితో కృషిచేస్తే తప్పక విజయం సాధిస్తారనడానికి అనుదీప్ నిదర్శమని అన్నారు. ఇటీవల వెలువడిన సివిల్ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సివిల్స్ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్పల్లి. -
సివిల్స్ టాపర్ మార్కులు 55.6 శాతం
న్యూఢిల్లీ: 2017లో సివిల్స్‌కు ఎంపికైన వారి మార్కులను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) ఆదివారం విడుదల చేసింది. అత్యంత కఠినంగా ఉండే సివిల్స్‌లో ఆల్ ఇండియా టాప్ ర్యాంకర్ తెలుగు విద్యార్థి దురిశెట్టి అనుదీప్ 55.60 శాతం మార్కులు సాధించాడు. సివిల్స్ మెయిన్స్ 1,750 మార్కులు, ఇంటర్వ్యూ 275 కలిపి మొత్తం 2,025 మార్కులకు.. అనుదీప్ రాతపరీక్షలో 950, ఇంటర్వ్యూలో 176 మార్కులతో మొత్తం 1,126 మార్కులు సాధించాడు. రెండో ర్యాంకు సాధించిన అను కుమారి 1,124 (రాత పరీక్షలో 937, ఇంటర్వ్యూలో 187) మార్కులతో 55.50%, మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం (946 రాతపరీక్ష, ఇంటర్వ్యూలో 176) మార్కులు సాధించారు. ఈ పరీక్షల్లో 750 మంది పురుష, 240 మహిళా అభ్యర్థులు మొత్తం 990 మంది కేంద్ర ప్రభుత్వ సర్వీసులకు అర్హత సాధించినట్లు యూపీఎస్సీ పేర్కొంది. 990వ ర్యాంకు సాధించిన హిమాంక్షి భరద్వాజ్ 830 మార్కుల (687 రాతపరీక్ష, 143 ఇంటర్వ్యూ)తో 40.98శాతం సాధించాడు. -
సివిల్స్ మార్కులు.. ఫస్ట్ ర్యాంకర్‌కు 55.60 శాతమే!
సాక్షి, న్యూఢిల్లీ : తాజా సివిల్స్ ర్యాంకర్ల మార్కుల వివరాలను యూపీఎస్సీ ఆదివారం విడుదల చేసింది. 2017 సివిల్స్ ఫైనల్ ఫలితాలను గత నెల 27న ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో దూరిశెట్టి అనుదీప్ మొదటి ర్యాంకు సాధించారు. అతని మార్కుల శాతం 55.60. మొత్తం 2025 మార్కులకు అనుదీప్ 1126 మార్కులు సాధించారు. అందులో 950 రాత పరీక్షలో వస్తే, 176 మార్కులు ఇంటర్వ్యూలో వచ్చాయి. రాత పరీక్షకు 1750 మార్కులు కాగా.. ఇంటర్వ్యూకు 275 మార్కులకు ఉంటాయి. రెండో ర్యాంకర్ అను కుమారి 55.50 శాతం మార్కులు సాధించారు. ఆమె మొత్తం 1124 మార్కులు సాధించారు. ఆమెకు మొదటి ర్యాంకర్ అనుదీప్‌కు కేవలం రెండు మార్కులే తేడా. మూడో ర్యాంకర్ సచిన్ గుప్తా 55.40 శాతం మార్కులు సాధించారు. ఇతరుల మార్కులు, శాతాల కోసం యూపీఎస్సీ వెబ్సైట్లో చూడోచ్చు upsconline.nic.in. -
సివిల్ టాపర్‌కి సీఎం కేసీఆర్ ఆహ్వానం
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించిన దురిశెట్టి అనుదీప్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నుంచి పిలుపు అందింది. అనుదీప్, ఆయన తల్లిదండ్రులను సోమవారం ప్రగతి భవన్‌కు రావాలని సీఎం కేసీఆర్ ఆహ్వానించారు. వారితో కలిసి సీఎం భోజనం చేయనున్నారు. ఇటీవల వెలువడిన సివిల్ 2017 ఫలితాల్లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల సీఎం కేసీఆర్ హర్షం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. సివిల్స్ సాధించిన విద్యార్థులకు ఆయన అభినందనలు తెలిపారు. సివిల్స్ మొదటి ర్యాంకు సాధించిన అనుదీప్‌ది జగిత్యాల జిల్లా మెట్పల్లి. -
ఇదే దురిశెట్టి అనుదీప్ గెలుపుబాట
యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ అంటేనే ఒక మారథాన్. ఈ పరుగులో ఒక్క అడుగు తడబడ్డా.. విజయం ఎండమావే! తొలి ప్రయత్నంలో విఫలమైనా.. అది నేర్పిన పాఠాలతో ముందడుగు వేసి రెండో యత్నంలో ఐఆర్‌ఎస్‌ను చేజిక్కించుకున్నాడు. అయితే తొలి నుంచి మనసంతా ఐఏఎస్‌పైనే ఉండటంతో.. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా అయిదుసార్లు పరీక్షకు హాజరై.. తన కలను సాకారం చేసుకున్నాడు. అఖిల భారత స్థాయిలో మొదటి ర్యాంకుతో సత్తా చాటాడు. దేశ యువతకు స్ఫూర్తిదాయకంగా నిలిచిన ఆ యువకుడే దురిశెట్టి అనుదీప్. రెండో అటెంప్ట్‌లోనే ఐఆర్ఎస్కు ఎంపికైన అనుదీప్.. తర్వాతి ప్రయత్నాల్లో నిరాశకు గురవడానికి కారణాలు.. తనలోని లోటుపాట్లు.. వాటిని సరిదిద్దుకున్న మార్గాలు.. చివరకు అనుకున్న లక్ష్యం.. ఐఏఎస్‌ను చేరుకునేందుకు అనుసరించిన విధానాలు.. సివిల్స్ ఔత్సాహిక అభ్యర్థులకు ఉండాల్సిన లక్షణాలు.. ఇలా వివిధ అంశాల సమాహారాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకున్నప్పుడు అది మనలోని పరిజ్ఞానానికి సరితూగుతుందా? అని ప్రశ్నించుకోవాలి. దీనికి సానుకూల సమాధానం లభిస్తే.. మన మనసే విజయానికి అవసరమైన మార్గనిర్దేశం చేస్తుంది. లక్ష్యం దిశగా కదిలేందుకు తోడ్పాటునందిస్తుంది. నా విషయంలో ప్రస్తుత విజయంలో ఇదే కీలక అంశం. సాఫ్ట్వేర్ కొలువు చేస్తున్నా.. ప్రజలకు సేవ చేయాలనే తపనతో సివిల్స్‌పై దృష్టిసారించాను. అందులోనూ అత్యున్నత సర్వీసు ఐఏఎస్‌ను లక్ష్యంగా ఎంపిక చేసుకున్నాను. ఈ క్రమంలో తొలి ప్రయత్నంలో విజయం చేజారింది. రెండో ప్రయత్నంలో మాత్రం ఐఆర్ఎస్ లభించింది. అప్పటికైతే సర్వీసులో చేరాను. కానీ, మనసంతా ఐఏఎస్‌పైనే! స్వీయ విశ్లేషణ 2012లో తొలి ప్రయత్నంలోనే సివిల్స్ తొలి దశ ప్రిలిమ్స్‌లో విజయం సాధించాను. మెయిన్ ఎగ్జామినేషన్‌లో వైఫల్యం ఎదురుకావడంతో కొద్దిగా నిరాశ చెందాను. ఆ వైఫల్యానికి కారణాలు ఏంటనే దానిపై స్వీయ విశ్లేషణ చేశాను. ‘రాత’లో వెనకబడటం ప్రధాన కారణమని గుర్తించా! సివిల్ సర్వీసెస్‌కు ప్రిపరేషన్ అనేది మెగా మారథాన్ అయితే.. పరీక్ష గదిలో చూపే ప్రదర్శన మినీ మారథాన్. ఒక ప్రశ్నకు సమాధానం ఇవ్వడంలో పద పరిమితి, అందుబాటులో ఉన్న సమయం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటూ ఆన్సర్ షీట్‌పై పెన్ను కదిలించాలి. అలాంటి సమయంలో ఒక్క నిమిషం బ్రేక్ పడినా.. విజయావకాశాలకూ బ్రేక్ పడినట్లే. ఈ విషయంలోనే నాలో పొరపాటు ఉందని గుర్తించాను. తప్పులను సరిదిద్దుకుంటూ.. వేగంగా సమాధానాలు రాయలేకపోవడమే నాలో ప్రధాన లోపమని గుర్తించడంతో.. రెండో అటెంప్ట్‌కు ప్రిపరేషన్ సయమంలో రైటింగ్ ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇచ్చాను. ఇది పరీక్ష హాల్లో సానుకూల ప్రదర్శనకు అవకాశం కల్పించింది. కానీ, అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయడంలో కొద్దిగా తడబడ్డాను. అయినా 790వ ర్యాంకుతో ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐఆర్ఎస్) లభించింది. దీంతో ఆత్మవిశ్వాసం పెరిగింది. లక్ష్యం.. ఐఏఎస్ 2013లో విజయంతో ఐఆర్ఎస్కు ఎంపికై సర్వీసులో చేరినప్పటికీ.. మనసంతా ఐఏఎస్ సాధించాలనే దానిపైనే ఉంది. అందుకే ఒకవైపు ఐఆర్ఎస్ ప్రొబేషనరీ ట్రైనింగ్ తీసుకుంటూనే ఐఏఎస్ కలను సాకారం చేసుకునేందుకు ప్రయత్నించాను. ప్రిపరేషన్‌కు మరింత పదునుపెడుతూ అటెంప్టులు ఇచ్చాను. కానీ, వరుసగా రెండేళ్లు (2014, 2015) నిరాశే ఎదురైంది. పరీక్ష శైలి, ప్రశ్నలు వస్తున్న తీరులో మార్పు, మూడు గంటల సమయంలో 20 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిన పరిస్థితికి అనుగుణంగా వేగాన్ని అందుకోలేకపోవడం వంటివన్నీ ప్రతికూల ఫలితాలకు కారణమయ్యాయి. ఒకవైపు ఐఆర్ఎస్ శిక్షణ, మరోవైపు స్వీయ ప్రిపరేషన్‌తో అధిక శాతం రీడింగ్‌పైనే దృష్టి పెట్టడంతో రైటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించకపోయాను. దీనివల్ల వల్ల కూడా 2014, 15లో మెయిన్స్‌లో విజయం సాధించలేకపోయాను. 2016లో పరీక్షకు దూరంగా.. వరుసగా రెండుసార్లు ఓటమి ఎదురు కావడంతో మానసికంగా ఒత్తిడికి గురయ్యాను. ఎంత శ్రమించినా.. లక్ష్యాన్ని చేరుకోలేకపోయాననే బాధ వెంటాడింది. అప్పటికే బ్రెయిన్ ఎగ్జాస్ట్ అయింది. దీంతో 2016లో అటెంప్ట్ కూడా ఇవ్వలేదు. ఇంత జరిగినా మనసు నుంచి ‘ఐఏఎస్’ దూరం కాలేదు. ‘‘సాధించాలి.. సాధించాలి..’’ అనే మాటలు మారుమోగుతూనే ఉన్నాయి. దీంతో నిరాశకు ఫుల్స్టాప్ పెట్టాను. 2017 నోటిఫికేషన్లో అటెంప్ట్ ఇచ్చాను. వాస్తవానికి ఇది చివరి అవకాశం. ఐఏఎస్ లక్ష్యం దిశగా ‘డూ’ ఆర్ ‘డై’ అనే స్థితి అని చెప్పొచ్చు. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఐఏఎస్ సాధించాలి అని బలంగా నిశ్చయించుకున్నాను. అప్పటికే సబ్జెక్టు పరిజ్ఞానం పరంగా పట్టు లభించడంతో పూర్తిస్థాయిలో రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇస్తూ ప్రిపరేషన్ సాగించాను. పరీక్ష రాశాక ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. కానీ, ఏకంగా ఊహించని విధంగా ఆలిండియా స్థాయిలో టాప్–1 ర్యాంకు సాధించడం.. దాంతో కలిగిన ఆనందాన్ని మాటల్లో వర్ణించలేను. అందరూ చదివేది ఆ పుస్తకాలే.. ఇక సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ సిలబస్, మెటీరియల్ కోణంలో ఆలోచిస్తే.. పేపర్లకు సంబంధించి అభ్యర్థుల్లో అధిక శాతం మంది చదివే పుస్తకాలు ఒకే విధంగా ఉంటాయి. ఉదాహరణకు ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ మెటీరియల్, ఎకనామిక్స్‌కు మిశ్రా అండ్ పూరి.. ఇలా ప్రతి సబ్జెక్టుకు మార్కెట్లో మెటీరియల్ పరంగా ట్రేడ్ మార్క్ పుస్తకాలు ఉంటాయి. అభ్యర్థులందరూ దాదాపు అవే పుస్తకాలు ఉపయోగించుకుంటారు. కానీ, విజయం లభించేది కొందరికే. కారణం.. మెటీరియల్ చదివేటప్పుడు అనుసరించే ధోరణి, దృక్పథం. అంతేకాకుండా.. పరీక్షలో వచ్చేందుకు అవకాశమున్న ప్రశ్నలను గుర్తించగలిగే విలక్షణ నైపుణ్యం. దీనికోసం చేయాల్సిందల్లా గత మూడు, నాలుగేళ్ల ప్రశ్నపత్రాలను విశ్లేషించడం. దినపత్రికలు, ఇంటర్నెట్ను సమర్థంగా ఉపయోగించుకోవాలి. చదువుతున్నప్పుడే రైటింగ్ ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ప్రిలిమ్స్‌కు ముందు ప్రిపరేషన్ నుంచే డిస్క్రిప్టివ్ అప్రోచ్‌ను అలవరచుకోవాలి. అప్పుడే పరీక్ష హాల్లో ఎలాంటి ప్రశ్నలు ఎదురైనా సరైన సమాధానాలు రాయగలిగే సామర్థ్యం, సమయ పాలన అలవడతాయి. ఇవే విజేతలకు, పరాజితులకు మధ్య ప్రధాన వ్యత్యాసాలు లేదా కారణాలు. అంతేగానీ విజేతలు హైపర్ యాక్టివ్ అనే ఆలోచనను వదులుకోవాలి. సివిల్ సర్వీసెస్‌లో విజయం అంటే ఏళ్లతరబడి చదివితేగానీ సాధ్యం కాదు’ అనేది కేవలం అపోహ మాత్రమే. అయితే ఒక శాస్త్రీయ పద్ధతిలో కష్టపడి చదివితే తొలి ప్రయత్నంలోనే విజయం సాధించొచ్చు. స్మితా సబర్వాల్ వంటి వారు ఇందుకు ఉదాహరణ. మాధ్యమం సమస్య.. ఓ అపోహ చాలా మంది సివిల్స్ ఔత్సాహికుల్లో ఉండే మరో ప్రధాన అపోహ.. పరీక్ష రాసే మాధ్యమం. ఇంగ్లిష్, హిందీ మీడియంలలో పరీక్ష రాస్తే విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయని.. ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్ల అవి కొంత తగ్గుతాయని అనుకుంటారు. కానీ, నా అభిప్రాయంలో ఇది కేవలం అపోహ మాత్రమే. మనం ఏ మాధ్యమంలో అటెంప్ట్ ఇచ్చినా.. రాసిన సమాధానంలో ఫ్లేవర్ ఉంటే ఫలితం మనకు ఫేవర్‌గా ఉంటుంది. సమాధాన పత్రాల మూల్యాంకనం పరంగా రేషనలైజేషన్ విషయంలో యూపీఎస్సీ పకడ్బందీగా వ్యవహరిస్తుంది. అందువల్ల మాధ్యమం విషయంలో ఆందోళన అనవసరం. ప్రాంతీయ మాధ్యమంలో పరీక్ష రాస్తున్న అభ్యర్థులకు ఎదురవుతున్న సమస్య.. మెటీరియల్. ఇది ఎక్కువగా ఇంగ్లిష్ మీడియంలోనే అందుబాటులో ఉంటోంది. దీంతో దీన్ని అర్థం చేసుకుని తెలుగులోకి అనువదించుకోవడం కొంత సమస్యగా మారింది. అంతేకాకుండా సమయ పాలన సమస్య కూడా కనిపిస్తోంది. అయితే కచ్చితంగా ప్రాంతీయ మాధ్యమంలోనే అటెంప్ట్ ఇవ్వాలనుకున్న అభ్యర్థులు తొలి అటెంప్ట్‌కు ఏడాది ముందుగానే మెటీరియల్ సేకరించుకుని సదరు మాధ్యమంలోకి అనువదించుకుని ప్రిపరేషన్ సాగించాలి. దీనివల్ల తొలి అటెంప్ట్ సమయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఇలా అనువదించుకునే క్రమంలో సబ్జెక్టు నిపుణులు లేదా సీనియర్ల సలహాలు తీసుకోవడం మేలు చేస్తుంది. ఒకవేళ తొలి అటెంప్ట్‌లో నిరాశాజనక ఫలితం ఎదురైనా ఆందోళన చెందకుండా అదే మాధ్యమంలో ప్రిపరేషన్ సాగించాలి. కచ్చితంగా విజయం లభిస్తుంది. అలా కాకుండా ప్రాంతీయ మాధ్యమంలో రాయడం వల్లే ఓటమి ఎదురైందనే భావనతో ఇంగ్లిష్ మీడియంకు మారితే.. కొత్త సమస్యలు ఎదురవుతాయి. సివిల్ సర్వీసెస్ ఫలితాల పరంగా ఇటీవల కాలంలో మరో అపోహ.. ‘సివిల్స్‌లో విజయం సాధించిన వారిలో బీటెక్, ఎంబీఏ, లేదా ప్రొఫెషనల్ కోర్సుల అభ్యర్థులే అధికంగా ఉంటున్నారు. పరీక్ష శైలి వారికి ఉపయోగపడే విధంగా ఉంటోంది’ అనేది. ఇది పూర్తిగా అవాస్తవం. ఎందుకంటే ప్రస్తుత పరీక్ష విధానంలో ఆప్షనల్స్‌కు ప్రాధాన్యం తగ్గింది. జనరల్ స్టడీస్‌కు ప్రాధాన్యం పెరిగింది. దీంతో బీఏ పట్టభద్రులైనా, ఎంబీఏ పట్టభద్రులైనా.. అందరికీ ఒకే విధమైన అంశాలు ఉంటాయి. అయితే సమాధానాలు ఇచ్చే సమయంలో ఇంజనీరింగ్, ప్రొఫెషనల్ అభ్యర్థులకు కలిసొస్తున్న అంశం.. ఒక అంశాన్ని అనలిటికల్ అప్రోచ్‌తో సమాధానం ఇవ్వగలగడం. ఇదే వారికి కొంత అడ్వాంటేజ్‌గా మారుతుండొచ్చు. దీనికి కారణంగా అకడెమిక్‌గా బీటెక్, ఎంబీఏ ప్రోగ్రామ్‌లలో అనుసరిస్తున్న కరిక్యులంను పేర్కొనొచ్చు. ఇంటర్వ్యూ.. ఇంటర్ప్రెటర్ చివరి దశ ఇంటర్వ్యూ సమయంలో ఇంటర్ప్రెటర్ (అనువాదకుడు) సదుపాయాన్ని యూపీఎస్సీ కల్పిస్తోంది. ప్రాంతీయ భాషల్లో ఇంటర్వ్యూకు హాజరవ్వాలనుకున్న అభ్యర్థుల కోసం ఇంటర్‌ప్రెటర్స్‌ను కేటాయిస్తోంది. వీరు బోర్డు సభ్యులు, అభ్యర్థుల మధ్య అనుసంధానకర్తలుగా ఉంటారు. కానీ, దీనివల్ల ఎదురయ్యే సమస్య.. కొన్ని సందర్భాల్లో మన వ్యక్తం చేసిన భావం సరిగా బోర్డు సభ్యులకు చేరకపోవడం. ఈ విషయంలో నా సలహా.. ఇంగ్లిష్‌లో బేసిక్ నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీలైనంత మేరకు ఇంటర్ప్రెటర్ అవకాశం లేకుండా నేరుగా సమాధానాలు ఇచ్చేలా సన్నద్ధం కావాలి. అప్పుడే బోర్డు సభ్యులకు, అభ్యర్థులకు మధ్య ‘ఐ’ కాంటాక్ట్, ఇంటరాక్షన్ విషయాల్లో సరైన సమాచార మార్పిడి జరుగుతుంది. దురిశెట్టి అనుదీప్ సివిల్స్ ప్రస్థానం 2012 తొలి ప్రయత్నం – మెయిన్స్‌లో నిరాశ. 2013 రెండో ప్రయత్నం– ఐఆర్ఎస్కు ఎంపిక. 2014, 2015 మూడు, నాలుగు ప్రయత్నాలు – మెయిన్స్‌లో పరాజయం. 2017 అయిదో ప్రయత్నం – ఆలిండియా టాప్ ర్యాంకు. ఇంటర్వ్యూ సాగిందిలా.. ఇంటర్వ్యూ విషయానికొస్తే 2018, ఫిబ్రవరి 12 మధ్యాహ్నం సెషన్లో జరిగింది. అజిత్ భోస్లే నేతృత్వంలోని అయిదుగురు సభ్యుల బోర్డు ఇంటర్వ్యూ చేసింది. దాదాపు అరగంటసేపు సాగిన ఇంటర్వ్యూలో సభ్యులందరూ ప్రశ్నలు సంధించారు. నాకు ఎదురైన కొన్ని ప్రశ్నలు.. చదివింది బీటెక్ కదా.. సివిల్స్‌వైపు ఎందుకు రావాలనుకున్నారు? ప్రజలకు సేవ చేయాలనేదే ప్రధాన ఉద్దేశం. అందుకు సరైన మార్గం సివిల్ సర్వీసెస్ అని నిర్ణయించుకున్నాను. బీటెక్ చదివి ఆంత్రోపాలజీని ఆప్షనల్‌గా ఎంపిక చేసుకోవడానికి కారణం? ఆంత్రోపాలజీ అధ్యయనంతో సమాజంలోని భిన్న సంస్కృతులు, వాటి పూర్వాపరాలు గురించి తెలుసుకునే వీలుంటుంది. ఇది భవిష్యత్తులో సివిల్ సర్వీసెస్ విధుల్లోనూ ఉపయోగపడే వీలుంటుందనే ఉద్దేశంతో ఆంత్రోపాలజీ సబ్జెక్టును ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నాను. ఇప్పటికే ఐఆర్ఎస్లో అసిస్టెంట్ కమిషనర్ హోదాలో పనిచేస్తున్నారు. అయినా మళ్లీ సివిల్స్‌కు హాజరవడానికి కారణం? మొదటి నుంచి నా ప్రధాన లక్ష్యం ఐఏఎస్ సాధించడం. రెండో ప్రయత్నంలో ఐఆర్ఎస్ రావడంతో ఆ సర్వీసులో చేరాను. కానీ, నా లక్ష్యం నేరుగా ప్రజలకు సేవ చేయగలిగే సర్వీసు పొందడం. దీనికి సరైన మార్గం ఐఏఎస్ అని భావిస్తున్నాను. ఐఏఎస్ విధుల పరంగా.. ప్రభుత్వ పథకాలు, ఇతర సేవలను నేరుగా ప్రజలకు చేరువయ్యేలా చేసేందుకు అవకాశం ఉంటుంది. స్వచ్ఛ్ భారత్ పథకంపై మీ ఉద్దేశం? కచ్చితంగా ఇది ప్రజలకు ఎంతో మేలు చేసే పథకం. దీనివల్ల అనారోగ్య, పారిశుద్ధ్య సమస్యలు తొలగుతాయి. అయితే దీనిపై ప్రజల్లో ఇంకా అవగాహన పెరగాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై మీ ఉద్దేశం? ఇవి కచ్చితంగా ప్రజలకు మేలు చేసే పథకాలే. అయితే వీటిని అమలు చేయడంలో నిబద్ధతతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది. అదే విధంగా సంక్షేమ పథకాలతోపాటు దీర్ఘకాలికంగా మేలు చేసే సుస్థిరాభివృద్ధి పథకాలు చేపడితే బాగుంటుందనేది నా అభిప్రాయం. మీ హాబీగా ‘మెడిటేషన్’ను పేర్కొన్నారు? ఇది మీకు ఎలా ఉపయోగపడింది? జీవితంలో నిరాశకు గురైన సందర్భాలు, మానసిక వ్యాకులతకు గురైన పరిస్థితుల్లో వాటి నుంచి బయటపడటానికి మెడిటేషన్ ఎంతో ఉపయోగపడింది. ఇలాంటి సందర్భాల్లో మెడిటేషన్ చేయడం వల్ల చాలా తొందరగా తిరిగి మానసికోల్లాసం లభిస్తుంది. నాకు స్ఫూర్తి కలిగించిన వ్యక్తులు, ప్రస్తుతం నేను చేస్తున్న ఉద్యోగం విధులు ఇలా.. ప్రొఫైల్ ఆధారిత ప్రశ్నలు కూడా అడిగారు. అన్నిటికి సంతృప్తికరంగా సమాధానాలిచ్చాను అనిపించింది. ఇంటర్వ్యూ పూర్తయ్యాక ఐఏఎస్‌కు అవసరమైన ర్యాంకు వస్తుందని అనుకున్నాను. అయితే ఆలిండియా టాపర్‌గా నిలవడం మాటల్లో వర్ణించలేనిది. సివిల్స్ ఔత్సాహికులకు నా సలహా.. మీపై మీరు నమ్మకం పెంచుకోండి. వ్యూహాత్మకంగా అడుగులు వేయండి. ఆప్షనల్ ఎంపికలో ఆసక్తికి ప్రాధాన్యం ఇవ్వండి. చదివిన ప్రతి అంశాన్ని రైటింగ్ ప్రాక్టీస్ చేయడం అలవర్చుకోండి. -
సివిల్స్ ర్యాంకర్లకు సీఎం అభినందనలు
సాక్షి, హైదరాబాద్: సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017లో తెలంగాణ విద్యార్థులు మంచి ర్యాంకులు సాధించడం పట్ల ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు కేసీఆర్ అభినందనలు తెలిపారు. దేశానికి సేవలందించడానికి సిద్ధమవుతున్న మరో తరంలో తెలంగాణ బిడ్డలు పెద్ద సంఖ్యలో ఉండడం గర్వకారణమని సీఎం అన్నారు. ఆలిండియా నెంబర్ వన్ ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, 6వ ర్యాంకు సాధించిన ఖమ్మం జిల్లా కోయ శ్రీహర్ష, 144వ ర్యాంకు సాధించిన మహబూబ్‌నగర్ జిల్లాకు పెంట్లవెల్లికి చెందిన గడ్డం మాధురి, 393వ ర్యాంకు సాధించిన కామారెడ్డికి చెందిన సురభి ఆదర్శ్, 624వ ర్యాంకు సాధించిన ఎడవెల్లి అక్షయ్ కుమార్, 721వ ర్యాంకు సాధించిన పెద్దపల్లికి చెందిన బల్ల అలేఖ్య, 724వ ర్యాంకు సాధించిన నిజామాబాద్ జిల్లా సాలూర గ్రామానికి చెందిన ఇల్తెపు శేషులను ముఖ్యమంత్రి అభినందించారు. 9 ర్యాంకు సాధించిన దివ్యాంగురాలు సౌమ్యశర్మతో పాటు ఆలిండియా ర్యాంకులు సాధించిన మిగతా విద్యార్థులకు కూడా సీఎం అభినందనలు తెలిపారు. ఇటీవల కాలంలో దేశ వ్యాప్తంగా ఏ పోటీ పరీక్షలు పెట్టినా తెలంగాణ విద్యార్థులు విజయదుందుభి మోగిస్తున్నారని కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. సివిల్ సర్వీస్‌తో పాటు ఇతర పోటీ పరీక్షలకు తెలంగాణ విద్యార్థులను సిద్ధం చేయడానికి ప్రభుత్వ పరంగా స్టడీ సర్కిళ్లు ఏర్పాటుతో పాటు ఇతర ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ప్రైవేటు రంగంలో కూడా అత్యుత్తమ శిక్షణ ఇచ్చే సంస్థలను తెలంగాణలోని హైదరాబాద్, ఇతర నగరాల్లో స్థాపించాలని సీఎం పిలుపునిచ్చారు. -
నాన్న మాటలే స్ఫూర్తి..
తెలంగాణ బిడ్డ ‘దురిశెట్టి అనుదీప్’ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అఖిల భారత స్థాయిలో మొదటిర్యాంకు సాధించాడు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన అనుదీప్... ఇంజనీరింగ్ అనంతరంక్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో జాబ్ వచ్చినా సివిల్స్‌నే లక్ష్యంగా చేసుకుని శ్రమించాడు. ఆ శ్రమ ఏ స్థాయిలోఅంటే... ఒకసారి కాదు!! ఏకంగా ఐదు సార్లు సివిల్స్ రాశాడు. రెండు సార్లు మెయిన్స్ కూడాదాటలేకపోయాడు. అయితేనేం!! పట్టు వదలకుండా శ్రమించాడు. చివరకు ఐఆర్ఎస్ సాధించాడు.అయినా అంతటితో సంతృప్తి చెందలేదు. కస్టమ్స్ విభాగంలో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేస్తూనే...మళ్లీ సివిల్స్ రాశాడు. ఐదో ప్రయత్నంలో... ఏకంగా ఆలిండియా నెంబర్–1 ర్యాంకును సొంతంచేసుకున్నాడు. ఈ విజయాన్ని ‘సాక్షి’తో పంచుకుంటూ అనుదీప్ ఏమన్నాడంటే... సాక్షి, హెదరాబాద్ : సివిల్ సర్వీసెస్ పరీక్ష 2017 ఫైనల్ ఫలితాలను యూపీఎస్సీ శుక్రవారం సాయంత్రం విడుదల చేసింది. సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్ సత్తాచాటారు. దేశవ్యాప్తంగా లక్షల మంది ప్రతిభావంతులు పోటీ పడే ప్రతిష్టాత్మక సివిల్ సర్వీసెస్ పరీక్షలో ఆల్ ఇండియా టాపర్‌గా నిలిచారు. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలను అక్టోబర్–నవంబర్ 2017ల్లో నిర్వహించింది. మెయిన్స్‌లో అర్హత సాధించిన అభ్యర్థులకు ఫిబ్రవరి–ఏప్రిల్ 2018లో ఇంటర్వ్యూలు జరిగాయి. మొత్తం 990 పేర్లను ప్రతిష్టాత్మక ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ ఫారిన్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్‌తోపాటు ఇతర కేంద్ర సర్వీసులైన గ్రూప్ ఏ,గ్రూప్ బీలకు అభ్యర్థులను సిఫార్సు చేసింది. 990 మందిలో 476 జనరల్, 275 ఓబీసీ, 165 ఎస్సీ, 74 ఎస్టీలు ఉన్నారు. వీరిలో 750 మంది పురుషులు, 240 మంది మహిళలు ఉన్నారు. ఎంపికైన వారిలో ఐఏఎస్‌కు 180 మందిని, ఐఎఫ్ఎస్కు 42 మందిని, ఐపీఎస్‌కు 150 మందిని, కేంద్ర సర్వీసులోని గ్రూప్–ఏకు 565 మందిని, గ్రూప్–బీ సర్వీసులో 121 మందిని నియమించనున్నట్టు యూపీఎస్సీ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లోని ఖాళీలకు అనుగుణంగా ఈ నియామకాలు చేపట్టనున్నట్టు తెలిపింది. వీరిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు సత్తాచాటారు. మాది జగిత్యాల జిల్లా మెట్పల్లి. నాన్న దురిశెట్టి మనోహర్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ ఇంజనీర్, అమ్మ జ్యోతి గృహిణి. నేను పదో తరగతి వరకు మెట్పల్లిలోనే చదివా. ఇంటర్ పూర్తయ్యాక ఎంసెట్ ఎంట్రన్స్‌లో రాష్ట్రస్థాయిలో 40వ ర్యాంకు వచ్చింది. ఆ తర్వాత రాజస్థాన్‌లో బిట్స్పిలానీలో చేరి ఇంజినీరింగ్ పూర్తి చేశా. ఇంజనీరింగ్ చివరి సంవత్సరంలోనే క్యాంపస్ సెలక్షన్స్‌లో ఒరాకిల్ కంపెనీలో ఉద్యోగానికి ఎంపికయ్యా. కానీ అందులో చేరలేదు. నాన్న లక్ష్యం మేరకు సివిల్స్ సాధించాలన్న లక్ష్యం పెట్టుకుని దానికోసమే శ్రమించాను. ఫైనల్ ఇయర్లోనే నా ఇంజనీరింగ్ 2011లో పూర్తయింది. ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్లోనే సివిల్స్‌కు సన్నద్ధమవ్వాలని నిర్ణయించుకున్నాను. కాబట్టే క్యాంపస్ ప్లేస్‌మెంట్స్‌లో ఒరాకిల్‌లో ఆఫర్ వచ్చినా వద్దనుకుని ఢిల్లీ వెళ్లా. మొదటి ప్రయత్నంలోనే ర్యాంకు వస్తుందనుకున్నా. కానీ రాలేదు. దీంతో ఉద్యోగం చేయాలని గూగుల్‌లో చేరా. జాబ్ చేస్తూనే ఒకవైపు గూగుల్‌లో ఉద్యోగం చేస్తూ సివిల్స్ ప్రిపరేషన్ కొనసాగించా. వారాంతాల్లో, సాయంత్రం సమయంలో ఎప్పుడు వీలు చిక్కినా చదివేవాడిని. రెండో ప్రయత్నంలో 2013లో 790వ ర్యాంకు వచ్చింది. దీంతో ఐఆర్ఎస్ (ఇండియన్ రెవెన్యూ సర్వీస్) వచ్చింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జీఎస్టీ, కస్టమ్స్‌లో అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నా. ఆప్షనల్ ఆంత్రోపాలజీ మనుషులు, వాళ్ల ప్రవర్తన, సమాజం తదితరాల గురించి అధ్యయనం చేసే శాస్త్రం.. ఆంత్రోపాలజీ. మన గురించి మనం చదువుకోవడం ఎప్పుడూ ఆసక్తే. అందుకే ‘ఆంత్రోపాలజీ’ని ఆప్షనల్‌గా ఎంచుకున్నా. దీన్ని ఎంతో ఆసక్తిగా అధ్యయనం చేయటం కలిసొచ్చింది. ఐఏఎస్ లక్ష్యం.. వరస వైఫల్యాలు ఐఆర్ఎస్కు ఎంపికైనా ఐఏఎస్ సాధించాలనే కసి ఉండేది. ఐఆర్ఎస్ బాధ్యతలు చూస్తూనే సివిల్స్‌కు సీరియస్‌గా చదివా. కానీ వరసగా మూడు, నాలుగో ప్రయత్నాల్లో వైఫల్యాలే ఎదురయ్యాయి. రెండుసార్లు మెయిన్స్ దాటలేకపోయాను. ఈసారి అయిదో ప్రయత్నంలో మొదటి ర్యాంకు సాధించడం చాలా ఆనందంగా ఉంది. నాన్న ఇచ్చిన స్ఫూర్తి ఈ విజయానికి ప్రధాన కారణం. అంతా సొంత ప్రిపరేషనే... మొదట ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నా. తర్వాత సొంతంగా ప్రిపేరయ్యాను. మార్కెట్లో దొరికే ప్రామాణిక పుస్తకాలనే చదివాను. ఢిల్లీలో కోచింగ్ తీసుకున్న మెటీరియల్‌నే పునశ్చరణ చేశాను. ప్రస్తుత పోటీ నేపథ్యంలో మొదట్నుంచి ఒక ప్రణాళిక ప్రకారం చదివితేనే మంచి ఫలితం వస్తుంది. సివిల్స్ ఔత్సాహికులు దీన్ని దృష్టిలో ఉంచుకోవాలి. ఇంటర్వ్యూలు ఇంటర్వ్యూలో అధిక శాతం ప్రశ్నలు నా ప్రొఫైల్ నుంచే వచ్చాయి. మీరు సివిల్స్ వైపు ఎందుకు రావాలనుకుంటున్నారు? వంటి ప్రశ్నలే వేశారు. ఇంటర్వ్యూ ఎంత బాగా చేసినా, ప్రస్తుత పోటీలో ఫలితాన్ని ముందే ఊహించడం కష్టం. మొదట్నుంచి ఫలితం గురించి ఆలోచించకుండా చదివాను. చివరకు ఏకంగా మొదటి ర్యాంకు రావడం ఎంతో ఆనందం కలిగిస్తోంది. విద్య, ఆరోగ్యం: యువ రాష్ట్రమైన, ఎంతో అభివృద్ధికి అవకాశమున్న తెలంగాణకు ఐఏఎస్‌గా సేవచేసే అవకాశం వస్తే నిజంగా అదృష్టమే. సివిల్స్ ఫస్ట్ ర్యాంకు నాకు పెద్ద బాధ్యతను తీసుకొచ్చింది. నా శాయశక్తులా సమాజ శ్రేయస్సు కోసం పనిచేస్తా. ఎక్కడైనా పనిచేయడానికి రెడీనే. ప్రస్తుతం విద్య, ఆరోగ్యం..నాప్రాధమ్యాలు. ప్రొఫైల్ పదో తరగతి మార్కులు: 86 శాతం ఇంటర్ మార్కులు: 97 శాతం ఇంజనీరింగ్ మార్కులు: 76 శాతం తెలుగు తేజాలు 1 దురిశెట్టి అనుదీప్ 43 శీలం సాయి తేజ 100 నారపు రెడ్డి మౌర్య 144 జి/.మాధురి 196 సాయి ప్రణీత్ 206 నాగవెంకట మణికంఠ 245 వాసి చందీష్ 374 రిషికేశ్రెడి 512 ప్రవీణ్‌చంద్ 513 ప్రసన్నకుమారి 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై.అక్షయ్ కుమార్ 816 భార్గవ్ శేఖర్ 884 వంశీ దిలీప్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ 2017కు ఫిబ్రవరి 22, 2017న యూపీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్తో పాటు మొత్తం 24 కేంద్ర సర్వీసుల్లో నియామకాలకు మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ చేపట్టింది. జూన్18, 2017న ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించింది. సివిల్స్ టాపర్లను అభినందించిన వైఎస్ జగన్ సాక్షి, అమరావతి: అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. ప్రతిష్టాత్మకమైన సివిల్ సర్వీస్ పరీక్షల్లో ర్యాంకులు పొందిన ఉభయ రాష్ట్రాల తెలుగు అభ్యర్థులందరినీ అభినందిçస్తూ... వారి కృషికి ఫలితం దక్కిందని ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. -
2017 సివిల్స్ ఫలితాలు విడుదల
-
సివిల్స్ ఫలితాలలో తెలుగు విద్యార్థికి మొదటి ర్యాంక్
-
సివిల్ టాపర్స్‌కు వైఎస్ జగన్ అభినందనలు
సాక్షి, గన్నవరం : అఖిల భారత సివిల్ సర్వీస్ పరీక్షల్లో టాపర్‌గా నిలిచిన దురిశెట్టి అనుదీప్‌కు వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. శుక్రవారం సివిల్స్- 2017 ఫైనల్ ఫలితాలు విడుదల అయిన విషయం తెలిసిందే. ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటాడం ఇరు రాష్ట్రాల ప్రజలందరికీ గర్వకారణం అని వైఎస్ జగన్ పేర్కొన్నారు. తెలుగు రాష్ట్రాల సివిల్ టాపర్స్ కూడా వైఎస్ జగన్ అభినందించారు. వారి కృషికి ఫలితం దక్కిందని ఆయన ప్రశంసించారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. గత సంవత్సరం జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అందులో ఉత్తీర్ణులైన వారికి యూపీఎస్సీ అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 వరకు సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహించింది. యూపీఎస్సీ మూడు స్టేజిల్లో సర్వీసెస్ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది. టాపర్లు (తెలుగు రాష్ట్రాలు) ర్యాంకు దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి) 1 శీలం సాయితేజ 43 నారపురెడ్డి శౌర్య 100 మాధురి 144 వివేక్ జాన్సన్ 195 కృష్ణకాంత్ పటేల్ 607 వై అక్షయ్ కుమార్ 624 భార్గవ శేఖర్ 816 -
తెలుగు విద్యార్థికి సివిల్స్‌లో మొదటి ర్యాంక్
-
సివిల్స్ టాపర్ తెలుగు విద్యార్థి
సాక్షి, న్యూఢిల్లీ : సివిల్ సర్వీసెస్- 2017 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. దేశంలోనే నెంబర్‌వన్ ర్యాంకును దురిశెట్టి అనుదీప్ సొంతం చేసుకున్నారు. సివిల్స్-2017 మెయిన్స్ తుది ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. ఈ మేరకు యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్ (యూపీఎస్సీ) ఈ ఫలితాలను తన అధికారిక వెబ్సైట్ www.upsc.gov.in లో పొందుపరిచింది. గతేడాది జూన్ 18న ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. పాసైన వారికి అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3 మధ్యలో సివిల్స్ మెయిన్స్ ఎగ్జామ్ యూపీఎస్సీ నిర్వహించింది. మూడు స్టేజీల్లో సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్‌ను యూపీఎస్సీ నిర్వహిస్తోంది. ఒకటి ప్రిలిమినరీ, రెండు మెయిన్స్, మూడు ఇంటర్వ్యూ. మెయిన్స్ పరీక్షల్లో పాసైన వారికి ఈ ఫిబ్రవరిలో ఇంటర్వ్యూలు నిర్వహించిన యూపీఎస్సీ తాజాగా తుది ఫలితాలు విడుదల చేసింది. ర్యాంకు టాపర్లు (తెలుగు రాష్ట్రాలు) 1 దురిశెట్టి అనుదీప్ (జగిత్యాల జిల్లా మెట్పల్లి) 43 శీలం సాయితేజ 100 నారపురెడ్డి శౌర్య 144 మాధురి 195 వివేక్ జాన్సన్ 607 కృష్ణకాంత్ పటేల్ 624 వై అక్షయ్ కుమార్ 816 భార్గవ శేఖర్