సాక్షి, అమరావతి: కుల, మత, ప్రాంతాలకు అతీతంగా అర్హులైన పౌరులందరికీ నవరత్నాలు ద్వారా అనేక సంక్షేమ పథకాలను అందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం మరో నూతన పథకాన్ని ప్రకటించింది. సివిల్ సర్వీసెస్ అభ్యర్థులకు ఆర్థిక భరోసా కల్పిస్తూ ‘జగనన్న సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహం’ అనే కొత్త పథకాన్ని మంజూరు చేసింది. ఇందుకు సంబంధించిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి గురువారం జారీ చేశారు. ప్రతి సంవత్సరం యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (సీఎస్‌ఈ)లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దాదాపు 40 మంది ఎంపికవుతున్నట్టు ప్రభుత్వం గుర్తించింది.
రాష్ట్రం నుంచి మరింత ఎక్కువ మంది ఎంపికయ్యేలా ప్రోత్సాహం అందించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రకటించింది. దీనిద్వారా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాల అభ్యర్థులకు ప్రభుత్వం ఆర్థిక తోడ్పాటు అందించనుంది. ప్రిలిమినరీ, మెయిన్స్‌లో అర్హత సాధించిన వారికి నగదు ప్రోత్సాహకం అందిస్తుంది.
యూపీఎస్‌సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీలో క్వాలిఫై అయిన అభ్యర్థులకు రూ.లక్ష, మెయిన్స్‌లో క్వాలిఫై అయిన వారికి రూ.50 వేలు చొప్పున డీబీటీ పద్ధతిలో నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తుంది. యూపీఎస్‌సీ అనుమతించే ఎన్ని పర్యాయాలు అయినా ఆ అభ్యర్థులకు ప్రభుత్వం ఈ ప్రోత్సాహకం అందిస్తుంది. ఈ ప్రోత్సాహకంతో అభ్యర్థుల సంఖ్య పెరిగేలా చర్యలు తీసుకోవాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల సంక్షేమ శాఖలు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.
ఇదీ ఉపయోగం
ఈ పథకం ద్వారా దరఖాస్తుదారులకు ప్రభుత్వం రెండు దశల్లో ప్రయోజనాన్ని అందిస్తుంది. మొదటిది సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.లక్ష, నగదు ప్రోత్సాహకాన్ని అందిస్తుంది. అభ్యర్థులు మెయిన్స్ పరీక్షకు సన్నద్ధం కావడానికి ఈ నగదు ఉపయోగపడుతుంది. రెండోది సివిల్ సర్వీసెస్ మెయిన్స్ పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రూ.50వేలు ప్రోత్సాహకం అందిస్తుంది. ఇది వ్యక్తిత్వ పరీక్షకు సన్నద్ధమవడానికి ఉపయోగపడుతుంది. ఈ నగదు అభ్యర్థుల కోచింగ్, స్టడీ మెటీరియల్, ఇంటర్వ్యూ గైడెన్స్, ప్రిపరేషన్, ఇతర ఖర్చులకు భరోసా ఇస్తుంది.
అర్హత ప్రమాణాలు ఇవి..
♦ దరఖాస్తుదారు తప్పనిసరిగా సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా బలహీనమైన, వెనుకబడిన వర్గాలకు చెందిన వారు అయ్యుండాలి.
♦ ఆంధ్రప్రదేశ్‌లో శాశ్వత నివాసి(స్థానికుడు) అయ్యుండాలి.
♦ తప్పనిసరిగా యూపీఎస్‌సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షకు అర్హత సాధించి ఉండాలి. ఈమేరకు రుజువు పత్రాలు సమర్పించాలి. యూపీఎస్‌సీ అనుమతించిన ఎన్ని ప్రయత్నాల్లోనైనా ఈ పథకం కింద నగదు ప్రోత్సాహకాన్ని అభ్యర్థి పొందవచ్చు.
♦ దరఖాస్తుదారు కుటుంబ వార్షిక ఆదాయం సంవత్సరానికి రూ.8 లక్షలకు మించకూడదు. ఈమేరకు కుటుంబ ఆదాయ స్వీయ ధృవపత్రం, ఇంటిలోని ఉద్యోగి జీతం ధృవపత్రం, తాజా పన్ను వంటి ధృవపత్రం అందించాలి. కుటుంబ వార్షిక ఆదాయాన్ని తాహశీల్దార్ ద్వారా ధృవీకరిస్తారు.
♦ కుటుంబానికి పది ఎకరాల మాగాణి లేదా 25 ఎకరాల మెట్ట భూమి గానీ, మొత్తం 25 ఎకరాల మాగాణి, మెట్ట భూమి ఉండొచ్చు.
♦ఇలా పలు అర్హతలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థులు అన్ని అవసరమైన ధృవపత్రాలతో సాంఘిక సంక్షేమ శాఖ పోర్టల్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment