
కొత్త కమిటీని నియమించిన ప్రభుత్వం
న్యూఢిల్లీ: వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించిన జాతీయ సమాఖ్య (ఎన్‌ఎస్‌ఎఫ్)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయంపై సమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో... రాబోయే కొన్నేళ్లలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమాఖ్య నిబంధనలు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ‘మూడేళ్ల క్రితం రూపొందించిన విధానం ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తోంది.
ఇందులో ఉన్న నిబంధనలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేశాం. వేర్వేరు అంశాలను సమీక్షించి ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ పరీక్ పేర్కొన్నారు. కొత్తగా ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా క్రీడల్లో టోర్నీల నిర్వహణ, విదేశాల్లో జరిగే టోర్నీల్లో ఆటగాళ్లు పాల్గొనడం, క్రీడా సామగ్రి కొనుగోలు, కోచింగ్ క్యాంప్‌ల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది.
కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది జీతాలు, గుర్తింపు పొందిన ఆటగాళ్ల కోసం ఇతర అదనపు సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటికి తోడు సమాఖ్యలు తమ స్థాయిని బట్టి బయట స్పాన్సర్ల ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతాయి. గత ఏడాది బడ్జెట్‌లో ఎన్‌ఎస్‌ఎఫ్‌ల కోసం రూ. 340 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సారి దానిని కొంత పెంచి రూ.400 కోట్లు చేసింది. సమాఖ్యల పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలు మార్పు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం.
మరోవైపు ముసాయిదా క్రీడా బిల్లును కూడా త్వరలో పార్లమెంట్‌లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు గ్రాంట్‌లు అందజేసే విషయంలో ఒక రెగ్యులేటరీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. 2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం భారత్ ఇప్పటికే తమ ఆసక్తిని చూపిస్తూ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను ఐఓసీకి పంపించింది.
Comments
Please login to add a commentAdd a comment