NSF
-
క్రీడా సమాఖ్యలకు సాయంపై సమీక్ష!
న్యూఢిల్లీ: వేర్వేరు క్రీడాంశాలకు సంబంధించిన జాతీయ సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)లకు కేంద్ర ప్రభుత్వం నుంచి లభిస్తున్న ఆర్థిక సహాయంపై సమీక్ష జరపాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2036 ఒలింపిక్స్‌ను నిర్వహించేందుకు భారత్ ఆసక్తి చూపిస్తున్న నేపథ్యంలో... రాబోయే కొన్నేళ్లలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించేలా సమాఖ్య నిబంధనలు ఉండాలని కేంద్రం భావిస్తోంది. ‘మూడేళ్ల క్రితం రూపొందించిన విధానం ప్రకారం జాతీయ క్రీడా సమాఖ్యలకు కేంద్ర ఆర్థిక సహాయం అందిస్తోంది. ఇందులో ఉన్న నిబంధనలను సమీక్షించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందు కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేశాం. వేర్వేరు అంశాలను సమీక్షించి ఈ కమిటీ నివేదిక అందజేస్తుంది’ అని క్రీడా మంత్రిత్వ శాఖ కార్యదర్శి తరుణ్ పరీక్ పేర్కొన్నారు. కొత్తగా ఆరుగురు సభ్యులతో ఈ కమిటీని ఏర్పాటు చేశారు. ఆయా క్రీడల్లో టోర్నీల నిర్వహణ, విదేశాల్లో జరిగే టోర్నీల్లో ఆటగాళ్లు పాల్గొనడం, క్రీడా సామగ్రి కొనుగోలు, కోచింగ్ క్యాంప్‌ల నిర్వహణ వంటి కార్యక్రమాల కోసం ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం అందిస్తోంది. కోచ్‌లు, ఇతర సహాయక సిబ్బంది జీతాలు, గుర్తింపు పొందిన ఆటగాళ్ల కోసం ఇతర అదనపు సౌకర్యాలు, ప్రోత్సాహకాలు కూడా ప్రభుత్వమే చెల్లిస్తుంది. వీటికి తోడు సమాఖ్యలు తమ స్థాయిని బట్టి బయట స్పాన్సర్ల ద్వారా కూడా కొంత ఆర్థిక సహాయాన్ని పొందుతాయి. గత ఏడాది బడ్జెట్లో ఎన్ఎస్ఎఫ్ల కోసం రూ. 340 కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈ సారి దానిని కొంత పెంచి రూ.400 కోట్లు చేసింది. సమాఖ్యల పనితీరులో మరింత పారదర్శకత, జవాబుదారీతనం కోసమే కొత్త కమిటీని ఏర్పాటు చేసి నిబంధనలు మార్పు చేసే విషయంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ముసాయిదా క్రీడా బిల్లును కూడా త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు గ్రాంట్లు అందజేసే విషయంలో ఒక రెగ్యులేటరీ బోర్డును కూడా ఏర్పాటు చేయాలని ఈ బిల్లులో ప్రతిపాదన ఉంది. 2036లో ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం భారత్ ఇప్పటికే తమ ఆసక్తిని చూపిస్తూ ‘లెటర్ ఆఫ్ ఇంటెంట్’ను ఐఓసీకి పంపించింది. -
సైనికులపై హత్య కేసు
కోహిమా/న్యూఢిల్లీ: నాగాలాండ్‌లో సైనిక దళాల కాల్పుల్లో 14 మంది కూలీలు మరణించిన ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఈ దారుణానికి బాధ్యులుగా గుర్తిస్తూ 21వ పారా స్పెషల్ ఫోర్స్ జవాన్లపై సోమవారం సుమోటోగా హత్య కేసు నమోదు చేశారు. ఈ మేరకు మోన్ జిల్లాలోని తిజిత్ పోలీసు స్టేషన్లో ఐపీసీ సెక్షన్ 302, 307, 34 కింద కేసు పెట్టారు. హత్యా, హత్యాయత్నం, నేరపూరిత చర్య అభియోగాల కింద ఈ కేసు నమోదయ్యింది. పరిస్థితి ఉద్రిక్తంగానే ఉండడంతో మోన్ పట్టణంలో 144 సెక్షన్ విధించారు. నాగాలాండ్ బంద్ ప్రశాంతం జవాన్ల కాల్పుల్లో 14 మంది అమాయక కూలీల మృతికి నిరసనగా పలు గిరిజన సంఘాలు, పౌర హక్కుల సంఘాలు, విద్యార్థి సంఘాలు సోమవారం నాగాలాండ్ రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చాయి. రాష్ట్రవ్యాప్తంగా బంద్ ప్రశాంతంగా ముగిసింది. అక్కడక్కడా భద్రతా దళాలు, విద్యార్థుల మధ్య స్వల్పంగా ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఐదు రోజులపాటు సంతాప దినాలుగా పాటిస్తామని నాగా స్టూడెంట్స్ ఫెడరేషన్(ఎన్ఎస్ఎఫ్) ప్రకటించింది. వివాదాస్పద సైనిక దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని రద్దు చేయడమే కూలీల త్యాగానికి అసలైన నివాళి అవుతుందని ఎన్ఎస్ఎఫ్ నేతలు ఉద్ఘాటించారు. శనివారం, ఆదివారం జరిగిన కాల్పుల ఘటనల్లో మొత్తం 28 మంది గాయపడ్డారని అధికారులు చెప్పారు. హార్న్‌బిల్ ఫెస్టివల్ ఒక్కరోజు నిలిపివేత సందర్శకులతో సందడిగా కనిపించే నాగా సంప్రదాయ గ్రామం కిసామా సోమవారం ఎవరూ లేక బోసిపోయింది. ఇక్కడ జరుగుతున్న హార్న్‌బిల్ ఫెస్టివల్‌ను ప్రభుత్వం నిలిపివేయడమే ఇందుకు కారణం. కూలీల మరణానికి సంతాప సూచకంగా నాగాలాండ్ ప్రభుత్వం ఈ ఫెస్టివల్‌ను ఒక్కరోజు నిలిపివేసింది. దేశవిదేశీ పర్యాటకులను ఆకర్శించడమే లక్ష్యంగా ఈ వేడుకను ప్రతిఏటా 10 రోజులపాటు రాజధాని కోహిమా సమీపంలోని కిసామా గ్రామంలో వైభవంగా నిర్వహిస్తుంటారు. హార్న్‌బిల్ ఫెస్టివల్లో పాల్గొనబోమంటూ పలు గిరిజన సంఘాలు ఇప్పటికే ప్రకటించాయి. మృతిచెందిన 14 మంది కూలీల కుటుంబాలకు నాగాలాండ్ ప్రభుత్వం రూ.5 లక్షల చొప్పున పరిహారం చెల్లించింది. రాష్ట్ర రవాణా మంత్రి పైవాంగ్ కోన్యాక్ విలేజ్ కౌన్సిల్ చైర్మన్‌కు ఈ పరిహారం మొత్తాన్ని అందజేశారు. గాయపడిన వారికి రూ.50,000 చొప్పున పరిహారం ఇస్తామన్నారు. చనిపోయిన పౌరుల కుటుంబాలకు రూ.11 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ.లక్ష చొప్పున పరిహారం చెల్లిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చిందని రాష్ట్ర సీఎం నీఫియూ రియో చెప్పారు. జవాన్ల కాల్పుల్లో మరణించిన 14 మంది కూలీల అంత్యక్రియలను సోమవారం మోన్ జిల్లా కేంద్రంలోని హెలిప్యాడ్ గ్రౌండ్ వద్ద నిర్వహించారు. బలగాల కాల్పులపై మోన్‌లో స్థానికుల ఆందోళన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) సోమవారం కేంద్రం, నాగాలాండ్ ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది. సైనికుల కాల్పులు, అమాయక కూలీల మృతిపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఈ సంఘటనపై మీడియాలో వచ్చిన వార్తలను ఎన్హెచ్ఆర్సీ సుమోటోగా విచారణకు స్వీకరించింది. ఆరు వారాల్లోగా నివేదిక అందజేయాలని ఆదేశిస్తూ రక్షణ శాఖ కార్యదర్శి, కేంద్రం హోంశాఖ కార్యదర్శి, నాగాలాండ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీకి నోటీసులు జారీ చేసింది. నాగాలాండ్‌లో సైన్యం కాల్పుల అనంతరం జనం ఎదురుదాడిలో మృతిచెందిన జవాను ఉత్తరాఖండ్ రాష్ట్రం తెహ్రా జిల్లా నౌలీ గ్రామానికి చెందిన గౌతమ్‌లాల్ అని అధికారులు వెల్లడించారు. అతడు ‘21 బెటాలియన్ ఆఫ్ పారాచూట్ రెజిమెంట్’లో పారాట్రూపర్‌గా పని చేస్తున్నాడని చెప్పారు. -
హోలీ వేడుకలకు మానవ కవచంగా ఎన్ఎస్ఎఫ్
పాకిస్థాన్‌లో హోలీ వేడుకలకు ఎలాంటి అవరోధం ఏర్పడకుండా అక్కడి విద్యార్థి ఫెడరేషన్ సంఘాలు మానవ కవచంగా నిలిచాయి. కరాచీలోని స్వామి నారాయణ్ ఆలయంలో హోలీ వేడుకలకు భారీ సంఖ్యలో హిందువులతోపాటు చాలామంది హాజరు కానుండటంతో వారికి రక్షణగా ది నేషనల్ స్టూడెంట్ ఫెడరేషన్ (ఎన్ఎస్ఎఫ్) మానవ కవచంగా ఏర్పడి ఆలయ ప్రాంగణాన్ని రక్షిస్తూ వేడుకలకు వచ్చేందుకు స్వాగతం పలుకుతోంది. ఈ సంస్థ గతంలో షియాలకు మద్దతుదారులుగా ఉండగా ప్రస్తుతం హిందువులకు కూడా సానుభూతి సంస్థగా మారి వారికి అవసరమైన సేవలను అందిస్తోంది. సామాజిక సంబంధాల వెబ్సైట్ల ద్వారా హోలీ వేడుకలకు ఆహ్వానం పలుకుతోంది. -
దళితుడినే ముఖ్యమంత్రి చేయాలి
కాగజ్‌నగర్ రూరల్, న్యూస్‌లైన్ : తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనంతరం దళితుడినే ముఖ్యమంత్రి చేయాలని నేతకాని విద్యార్థి సంఘం(ఎన్ఎస్ఎఫ్) రాష్ట్ర నాయకుడు అనపర్తి యువరాజ్ డిమాండ్ చేశారు. ఆదివారం పట్టణంలోని అంబేద్కర్ భవన్లో నిర్వహించిన నేతకాని విద్యార్థి సంఘం జిల్లా మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ప్రస్తుత శీతాకాల పార్లమెంటు సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ప్రభుత్వ ఆధీనంలోనే కేజీ నుంచి పీజీ వరకు నాణ్యమైన విద్య అందిచాలని అన్నారు. వసతి గృహాలకు పక్కా భవనాలు నిర్మించడంతోపాటు మెస్ చార్జీలు పెంచాలని పేర్కొన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి విద్యాభ్యాసం చేసే వారి కోసం స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టళ్లను ఏర్పాటు చేయాలని కోరరు. నిరుద్యోగులకు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ కింద రుణాలు అందజేయాలని, భృతి చెల్లించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం హాస్టల్ విద్యార్థులకు వెంటనే దుప్పట్లు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జుమిడి గోపాల్, ప్రధాన కార్యదర్శి దుర్గం గణపతి, బీఎస్పీ జిల్లా ఉపాధ్యక్షుడు వీవీ ప్రసాద్, ఎస్సీ, ఎస్టీ ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర నాయకులు మేడి చరణ్‌దాస్, గంధం శంకర్ తదితరులు పాల్గొన్నారు.