
‘సివిల్స్’లో మార్పులు?
దేశంలో అత్యంత క్రేజ్ ఉన్న పరీక్ష.. సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్. గ్రామీణ ప్రాంత అభ్యర్థులు మొదలు ప్రతిష్టాత్మక ఐఐటీల్లో చదివిన వారు సైతం పోటీపడుతున్న పరీక్ష. ఇంతటి ప్రాధాన్యమున్న పరీక్షలో చేయాల్సిన మార్పులకు సంబంధించి బి.ఎస్.బస్వాన్ కమిటీ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది. దీంతో సివిల్ సర్వీసెస్ పరీక్షలో మార్పులు జరగనున్నాయనే ఊహగానాలు వినిపిస్తున్నాయి. నివేదికలోని అంశాలు బహిర్గతం కానప్పటికీ, కనీస వయోపరిమితి మొదలు పరీక్ష పేపర్ల వరకు వివిధ అంశాలపై కమిటీ సిఫార్సులు చేసినట్లు తెలుస్తోంది.
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియలో మార్పులకు కేంద్ర ప్రభుత్వం.. 2015, ఆగస్టులో మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి బి.ఎస్.బస్వాన్ నేతృత్వంలో ఏడుగురు సభ్యుల కమిటీని నియమించింది. మాజీ ఐఏఎస్ అధికారి బి.ఎన్.నవ్లావాలా, మాజీ యూజీసీ సభ్యులు హరిప్రతాప్ గౌతమ్, ఏఐసీటీఈ చైర్మన్ ప్రొఫెసర్ అనిల్ సహస్ర బుద్ధే, ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ పీటర్ రొనాల్డ్ డిసౌజా, మేనేజ్‌మెంట్ ప్రొఫెసర్ బి.మహదేవన్, యూపీఎస్సీ సభ్య కార్యదర్శి ఎం.పి.తంగిరాల సభ్యులుగా ఉన్న కమిటీ వాస్తవానికి 2016 ఫిబ్రవరిలోనే నివేదిక అందించాల్సి ఉంది. కానీ, ఆర్నెల్ల గడువు పొడిగింపుతో ఆగస్టు 9న నివేదిక అందజేసింది. ఈ నివేదికను బహిరంగపరచలేమని.. అయితే అర్హతలు, అటెంప్ట్‌లు నుంచి ఇంటర్వూ్య విధానం వరకు మార్పులు సూచించిన మాట వాస్తవమేనంటూ సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు సిబ్బంది వ్యవహారాలు, శిక్షణ శాఖ (డీఓపీటీ) సమాధానం ఇచ్చింది.
వయోపరిమితి తగ్గింపు
బస్వాన్ కమిటీ సిఫార్సుల్లో కీలకమైంది, అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్న అంశం వయోపరిమితి తగ్గింపు. ప్రస్తుతం జనరల్ కేటగిరీలో 32 ఏళ్లుగా ఉన్న గరిష్ట వయోపరిమితిని 26 ఏళ్లకు కుదించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు సమాచారం. ప్రస్తుతం జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా ఆరుసార్లు పరీక్షకు హాజరయ్యే అవకాశముంది. దీన్ని నాలుగుకు తగ్గిస్తూ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
అర్హతల్లో నిబంధనలు
ప్రస్తుతం బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులెవరైనా సివిల్స్‌కు హాజరుకావొచ్చు. అయితే ఈ పరీక్ష ద్వారా భర్తీచేసే సర్వీసులను దృష్టిలో పెట్టుకుని ఆయా సర్వీసులకు అవసరమైన అంశాల్లో అకడమిక్ నేపథ్యం ఉండే విధంగా అర్హత నిబంధనలు రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఉదాహరణకు ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్‌ను పరిగణనలోకి తీసుకుంటే.. ఆ సర్వీస్ ఔత్సాహికులు తప్పనిసరిగా లా ఉత్తీర్ణులై ఉండాలనే నిబంధన. అంతేకాకుండా కనీస విద్యార్హత బ్యాచిలర్ డిగ్రీలోనూ తప్పనిసరిగా 50 శాతం మార్కులు పొందాలని సిఫార్సు చేసినట్లు సమాచారం.
సర్వీస్‌ను బట్టి అదనపు పేపర్లు
íసివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ ద్వారా 24 సర్వీసుల్లో పోస్టుల భర్తీ జరుగుతోంది. ఇప్పటివరకు అన్ని సర్వీసుల ఔత్సాహికులు ఒకే రకమైన పేపర్లు రాయాల్సిన విధానం అమలవుతోంది. అయితే బస్వాన్ కమిటీ ఈ అంశంలో కీలక మార్పులు సూచించినట్లు తెలుస్తోంది. అవి.. సర్వీస్‌కు అనుగుణంగా ఒకటి లేదా రెండు ప్రత్యేక పేపర్లలో పరీక్ష నిర్వహించడం. (ఉదాహరణకు ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ పోస్టుల భర్తీ క్రమంలో అకౌంటెన్సీ నైపుణ్యాలను పరీక్షించేలా çసంబంధిత సబ్జెక్టులతో ప్రత్యేక పేపర్లలో పరీక్ష నిర్వహించడం వంటివి). అదే విధంగా ఆప్షనల్ సబ్జెక్టులను పూర్తిగా తొలగించడం.
ఇంటర్వూ్యలో మార్పులు
సివిల్స్ ఎంపిక ప్రక్రియలోని తుది దశ ఇంటర్వూ్యపైనా బస్వాన్ కమిటీ కొన్ని కీలక సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వీటి ప్రకారం.. ప్యానెల్ ఇంటర్వూ్యకు ముందు గ్రూప్ డిస్కషన్స్ నిర్వహించాలి. త్రివిధ దళాల్లో పోస్టుల భర్తీకి సర్వీస్ సెలక్షన్ బోర్డ్ నిర్వహిస్తున్న మాదిరిగా రెండు, మూడు రోజుల పాటు సుదీర్ఘంగా ఇంటర్వూ్య ప్రక్రియను కొనసాగించి అభ్యర్థుల్లోని మానసిక ద్రుఢత్వాన్ని, ఆప్టిట్యూడ్‌ను పరీక్షించే విధంగా చూడాలి. పరీక్షలో ముఖ్యంగా ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్‌లో ఆన్‌లైన్ విధానాన్ని అనుసరించాలని.. ఫలితంగా ఎంపిక ప్రక్రియ వ్యవధిని తగ్గించేందుకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని కమిటీ పేర్కొన్నట్లు తెలుస్తోంది.
మెరుగైన సర్వీస్ కోరుకుంటే?
ప్రస్తుతం ఐఆర్‌ఎస్, ఇతర గ్రూప్–ఎ సర్వీస్‌లకు ఎంపికైన అభ్యర్థులు ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ వంటి సర్వీసులు సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో వయోపరిమితి అనుమతించిన మేరకు పరీక్షకు హాజరవుతున్నారు. అయితే అభ్యర్థులు తమకు లభించిన సర్వీస్‌కు రాజీనామా చేసి మెరుగైన సర్వీస్‌కు సన్నద్ధమయ్యేలా నిబంధనలు రూపొందించాలని కమిటీ సిఫార్సు చేసినట్లు తెలిసింది. ఇటీవల కాలంలో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ సర్వీసుల విజేతల్లో రిపీటర్స్ సంఖ్య 20–30 శాతం ఉంటోంది. వీరు అప్పటికే ఉన్న సర్వీసుల్లో ఖాళీ ఏర్పడటం, వాటి కోసం తర్వాతి సంవత్సరంలో చేపట్టే నియామక ప్రక్రియ వరకు క్యారీ ఫార్వర్డ్ చేయడం జరుగుతోంది. ఇది ఆయా విభాగాల్లో పనితీరుపై ప్రభావం చూపుతుందనే అభిప్రాయంతో ఈ సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది.
ఐదేళ్లకోసారి సమీక్ష
సివిల్ సర్వీసెస్ ఎంపిక ప్రక్రియను ఐదేళ్లకోసారి సమీక్షించి.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా మార్పులు, చేర్పులు చేయాలని కమిటీ సూచించినట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మాజీ మంత్రి శశిథరూర్ నేతృత్వంలోని పార్లమెంట్ సబ్ కమిటీ సైతం సివిల్స్‌లో ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఔత్సాహికులకు అంతర్జాతీయ సంబంధాలపై లోతైన అవగాహనను పరీక్షించేలా అదనపు పేపర్‌ను ప్రవేశపెట్టాలని సిఫార్సు చేసింది.
lఆందోళన అనవసరం
బస్వాన్ కమిటీ సిఫార్సులు, వాటి అమలుపై సివిల్స్–2017 ఔత్సాహికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కమిటీ నివేదిక ఇంకా పరిశీలనలోనే ఉంది. మరోవైపు సివిల్స్–2017 షెడ్యూల్ కూడా కొంత ముందుకు జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుంటే బస్వాన్ కమిటీ సిఫార్సులు 2017 సివిల్స్‌లో అమలయ్యే అవకాశాలు తక్కువ. అంతేకాకుండా ఏవైనా మార్పులు చేసేటప్పుడు యూపీఎస్సీ కచ్చితంగా కనీసం ఏడాది ముందే వాటిని ప్రకటిస్తుంది.
– వి.గోపాలకృష్ణ, డైరెక్టర్, బ్రెయిన్ ట్రీ అకాడమీ
lఅభ్యర్థులకు తగిన సమయం ఇవ్వాలి
సివిల్స్ ఔత్సాహికుల గరిష్ట వయోపరిమితి తగ్గింపు మంచిదే. కానీ, దాన్ని 26 ఏళ్లుగా నిర్ణయిస్తే కొన్ని వర్గాలకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇందులో మంచిని పరిశీలిస్తే.. ప్రస్తుతమున్న 32 ఏళ్ల గరిష్ట వయోపరిమితి ఫలితంగా వేల మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి సివిల్స్‌పైనే దృష్టి పెట్టి తమ కెరీర్‌లో ఇతర లక్ష్యాలపై దృష్టిసారించలేకపోతున్నారు. పర్యవసానంగా చివర్లో నిరాశాజనక పరిస్థితులు ఏర్పడినప్పుడు వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా మారుతోంది. వయోపరిమితి తగ్గింపు వల్ల సివిల్స్‌కు నాలుగైదేళ్లకే పరిమితమై తర్వాత తమ కోర్ కెరీర్ వైపు దృష్టి సారించే అవకాశం లభిస్తుంది. అయితే ప్రస్తుతం వార్తల్లో వినిపిస్తున్న సిఫార్సులన్నీ కూడా అనధికారికమే. వీటిని వీలైనంత త్వరగా వెల్లడించి అభ్యర్థులకు కొంత సమయం ఇచ్చే విధంగా వ్యవహరించాలి.
– డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్,
మాజీ ఐఏఎస్ అధికారి.