యూపీఎస్సీ వివాదంపై అఖిలపక్షం!
విపక్షాల ఒత్తిడికి తలొగ్గిన కేంద్రం
ప్రిలిమ్స్ పరీక్ష వాయిదాకు నో
న్యూఢిల్లీ: సివిల్ సర్వీసెస్ పరీక్ష విధానంపై అఖిలపక్ష భేటీ నిర్వహించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది. అయితే, ఈ నెల 24న జరగనున్న సివిల్స్ ప్రిలిమినరీ పరీక్షను వాయిదా వేసేందుకు మాత్రం సుముఖత చూపలేదు. గత వారం రోజులుగా సభా కార్యకలాపాలను అడ్డుకుంటున్న యూపీఎస్సీ వివాదంపై మంగళవారం రాజ్యసభ అట్టుడికింది. ఈ అంశంపై సత్వరమే ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ప్రశ్నోత్తరాల సమయం పూర్తయిన వెంటనే విపక్షాలు ఈ అంశాన్ని లేవనెత్తాయి. మెరిట్ నిర్ధారణలో ఇంగ్లిష్ మార్కులను పరిగణనలోకి తీసుకోబోమంటూ సోమవారం సిబ్బంది, శిక్షణ శాఖ సహాయమంత్రి జితేంద్రసింగ్ చేసిన ప్రకటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఆ ప్రకటన సమస్యను మరింత సంక్లిష్టం చేసిందని విమర్శించాయి. ప్రజా సమస్యలు, ప్రభుత్వంలో నెలకొన్న అంతర్గత పోరు నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే ప్రభుత్వం ఈ అంశాన్ని సాగదీస్తోందని కాంగ్రెస్ సభ్యుడు ప్రమోద్‌తివారీ ఆరోపించారు. మరిం త చర్చ జరగాల్సి ఉన్నందున ఈ సమస్యపై ఆగస్టు 24లోగా పరిష్కారం సాధ్యం కాదని టీఎంసీ సభ్యుడు డెరిక్‌ఒబ్రీన్ వ్యాఖ్యానించారు.
స్టీల్ ప్లాంట్ అంటే లోహే కా పేఢ్..
సివిల్స్ ప్రశ్నపత్రంలోని అనువాద లోపాలను ఎస్పీ సభ్యుడు రాంగోపాల్ యాదవ్ ఎత్తి చూపారు. ‘నార్త్ పోల్’ను హిందీలో ‘ఉత్తరీ ఖంభా’ అని, ‘స్టీల్ ప్లాంట్’ను ‘లోహే కా పేఢ్’ అని అనువదించారన్నారు. ఈ అంశంపై అఖిలపక్ష భేటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ సూచనకు పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ప్రకాశ్ జవదేకర్ ‘తప్పకుండా అఖిలపక్ష భేటీ ఉంటుంది. అవసరమైతే అలాంటి సమావేశాలను మరికొన్నింటిని నిర్వహిస్తాం’ అని స్పష్టం చేశారు. ‘ఇది సున్నితమైన అంశం. పరీక్షావిధానంలో భారీ మార్పులు అవసరమా అన్న విషయాన్ని నిర్ధారించేందుకు చర్చ జరగాల్సిన అవసరం ఉంది’ అన్నారు. ‘ఈ అంశంపై అన్ని పార్టీలు ఇప్పటికే తమ అభిప్రాయాలను తెలిపాయి. వాటి ఆధారంగా నిర్ణయం తీసుకోకుండా మళ్లీ అఖిలపక్ష భేటీ ఏంటీ?’ అని సీపీఎం సభ్యుడు సీతారాం యేచూరి ప్రశ్నించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఎస్పీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. కాగా, సివిల్స్ ప్రశ్నాపత్రంలో ఆంగ్లం నుంచి హిందీకి చేసిన అనువాదంలో తప్పులేం లేవని ప్రభుత్వం ప్రకటించింది.