సాక్షి, న్యూఢిల్లీ: కొవ్వాడలో ఆరు అణు విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకోసం వెస్టింగ్‌హౌస్ కంపెనీ (అమెరికా)తో చర్చలు జరుపుతున్నట్లు ప్రధానమంత్రి కార్యాలయ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. వెస్టింగ్ హౌస్ కంపెనీతో చర్చలు ముగిసిన అనంతరం అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటుకయ్యే ఖర్చు, నిర్మాణానికి పట్టే సమయం వంటి వివరాలతో ప్రాజెక్టు ప్రతిపాదనలు ఖరారవుతాయని వివరించారు.
ప్రస్తుతానికి భూసేకరణ, ప్రాజెక్టు ఏర్పాటుకు అవసరమైన అనుమతులు పొందడం, ప్రాజెక్టు స్థలంలో భూమి స్వరూప స్వభావాలపై అధ్యయనం వంటి పనులు జరుగుతున్నాయని, అణు విద్యుత్ ప్రాజెక్టు కోసం 2,079 ఎకరాల భూమి అవసరం కాగా.. ఇప్పటికే 2,061 ఎకరాల భూసేకరణ పూర్తయిందని, దీనిని న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ పేరిట బదలాయించడం కూడా పూర్తయిందని ఆయన తెలిపారు. నిర్మాణ దశలో 8వేల మందికి, నిర్మాణం పూర్తిచేసుకుని విద్యుదుత్పత్తి ప్రారంభించిన అనంతరం ప్రతి యూనిట్లో 2 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని అంచనా వేస్తున్నట్లు వివరించారు.
564 మంది విద్యార్థులకు కేవీపీవై ఫెలోషిప్‌లు..
కిషోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన (కేవీపీవై) పథకం కింద గడచిన ఐదేళ్లలో ఆంధ్రప్రదేశ్‌లో 564 మంది విద్యార్థులకు ఫెలోషిప్ అందించినట్లు కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి జితేంద్రసింగ్ వెల్లడించారు. విజయ సాయి రెడ్డి అడిగిన మరో ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. కేవీపీవైకి ప్రత్యేకించి నిధులు కేటాయింపు ఏదీ ఉండదని, ఇన్‌స్పైర్, ఇన్‌స్పైర్–షీ బడ్జెట్ కింద కేటాయించిన నిధులతోనే కేవీపీవై ప్రోగ్రాం అమలుచేస్తారని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్‌తో పాటు దేశవ్యాప్తంగా పరిశోధన రంగంలో ప్రతిభ, యోగ్యత కలిగిన విద్యార్థులను అధిక సంఖ్యలో గుర్తించేందుకు కేవీపీవై ప్రోగ్రాంను (ఎస్‌హెచ్‌ఈ) స్కాలర్‌షిప్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్‌తో అనుసంధానించినట్లు తెలిపారు. దీని ద్వారా ఔత్సాహికులు ప్రాథమిక, నేచురల్ సైన్స్‌లో అండర్ గ్రాడ్యుయేట్, పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చేసేందుకు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం లభిస్తుందని అన్నారు. అలాగే, ఇన్‌స్పైర్–మానక్ కింద ఏటా దేశవ్యాప్తంగా 10 లక్షల ఐడియాల నుంచి లక్ష ఐడియాలను ఎంపికచేసి వాటిని ప్రతిపాదించిన ఒక్కో విద్యార్థి బ్యాంకు అకౌంట్‌లో నేరుగా రూ.10 వేలు జమచేస్తున్నట్లు తెలిపారు.
ఏపీ హైకోర్టులో ఐదు న్యాయమూర్తుల ఖాళీలు
ఏపీహైకోర్టులో మొత్తం 37 మంది న్యాయమూర్తులకు గాను గత నెల 30 వరకు 32 మంది న్యాయమూర్తులు పనిచేస్తున్నారని కేంద్ర న్యాయశాఖ తెలిపింది. ప్రస్తుతం ఇక్కడ ఐదు న్యాయమూర్తుల పదవులు ఖాళీగా ఉండగా, ఒక ఖాళీ ప్రతిపాదన ప్రస్తుతం సుప్రీంకోర్టు కొలీ జియం వద్ద పెండింగ్‌లో ఉందని కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు ఓ ప్రశ్నకు జవాబిచ్చారు.
కొవ్వాడ అణువిద్యుత్‌పై వెస్టింగ్ హౌస్‌తో చర్చలు
Published Fri, Feb 3 2023 5:33 AM | Last Updated on Fri, Feb 3 2023 6:47 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment