సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలోని రిషికొండలో తలపెట్టిన నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ (ఎన్‌ఐవో) ల్యాబొరేటరీ నిర్మాణంలో అసాధారణ జాప్యం జరుగుతున్న విషయం వాస్తవమేనని కేంద్ర సైన్స్, టెక్నాలజీశాఖ సహాయమంత్రి డాక్టర్ జితేంద్రసింగ్ అంగీకరించారు. రాజ్యసభలో గురువారం వైఎస్సార్‌సీపీ ఎంపీ వి.విజయసాయిరెడ్డి ప్రశ్నకు మంత్రి జవాబిచ్చారు. జాప్యానికి కారణాలను వివరించారు.
ఎన్‌ఐవో ల్యాబొరేటరీ నిర్మాణానికి కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనుమతి సాధించడంలో జాప్యం జరిగిందని చెప్పారు. అలాగే స్కీమ్‌లకు తుదిరూపం ఇవ్వడంలో, ఇతర పాలనాపరమైన అనుమతులు పొందడంలో జాప్యం జరిగినట్లు తెలిపారు. ల్యాబొరేటరీ భవనాల ఆకృతులను రూపొందించేందుకు భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్) సంస్థను ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్ (పీఎంసీ)గా ఎంపికచేసి 2009లో పని అప్పగించినట్లు చెప్పారు.
పీఎంసీ రూ.30 కోట్ల ప్రాథమిక అంచనా వ్యయంతో ల్యాబొరేటరీ భవనాల డ్రాయింగ్‌లను సమర్పించిందన్నారు. కాంట్రాక్ట్ బాధ్యతల ప్రకారం ఎన్‌ఐవో క్యాంపస్‌కు సంబంధించి ప్లానింగ్, డిజైనింగ్, ఎగ్జిక్యూషన్ పనులను పీఎంసీనే చేపట్టాలన్నారు. కానీ ఒప్పందంలోని బాధ్యతలను అది నేరవేర్చనందున ఎన్‌ఐవో క్యాంపస్ నిర్మాణంలో తీవ్ర జాప్యం జరిగిందని చెప్పారు. అందువల్ల బీఎస్‌ఎన్‌ఎల్‌కు అప్పగించిన పీఎంసీ కాంట్రాక్టును రద్దుచేయడానికి ఉభయుల మధ్య అంగీకారం కుదిరిందని తెలిపారు. ఈ ఒప్పందం రద్దయిన వెంటనే ప్రభుత్వం కొత్త పీఎంసీ కోసం టెండరు పిలుస్తుందన్నారు. కొత్త పీఎంసీకి పనులు అప్పగించిన తర్వాత ఆరునెలల్లో పాలనాపరమైన, ఆర్థిక అనుమతులు పొందగలమని భావిస్తున్నట్లు చెప్పారు. క్యాంపస్, భవనాల నిర్మాణం ప్రారంభమైన తర్వాత 18 నెలల్లో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment