సముద్ర మథనానికి.. ఓషనోగ్రఫీ
అప్‌కమింగ్ కెరీర్: ఒక దేశానికి విలువైన ఆస్తి.. చుట్టూ ఉన్న సువిశాలమైన మహా సముద్రం. ప్రాచీన కాలంలో సముద్రాల ద్వారానే ఖండాంతర వ్యాపారం జరిగింది. ఒక దేశం నుంచి మరో దేశానికి వలసలు కొనసాగాయి. నాగరికత విస్తరించింది. దేశాభివృద్ధిలో సముద్రాల పాత్ర ఎంతో కీలకం. సముద్ర తీరం లక్షలాది మందికి జీవనాధారం. భూగోళంపై జీవం పుట్టుక నుంచి ఇప్పటి దాకా ప్రతిదశలో మానవుడి జీవితంపై ప్రభావం చూపుతున్న సముద్రాల అధ్యయన శాస్త్రమే.. ఓషనోగ్రఫీ.
భూగోళంపై నివాస యోగ్యమైన భూమికంటే సముద్రాలే ఎక్కువ శాతం విస్తరించి ఉన్నాయి. సముద్రాలను అధ్యయనం చేసేవారిని ఓషనోగ్రఫర్లు అంటారు. ఓషనోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకున్న వారికి మంచి అవకాశాలు, అధిక వేతనాలతో కూడిన ఉద్యోగాలు లభిస్తుండడంతో నేటి యువత దృష్టి ఈ రంగంపై పడింది. ఓషనోగ్రఫీ కోర్సులకు డిమాండ్ పెరిగింది. ఓషనోగ్రఫర్ల విధులు భిన్నంగా ఉంటాయి. క్షేత్రస్థాయిలో, కార్యాలయాల్లోనూ పనిచేయాల్సి ఉంటుంది. సముద్ర తరంగాలు, అలలు, సముద్ర సంబంధిత భౌతిక, రసాయన ప్రక్రియలను అధ్యయనం చేయాలి. ఈ డేటాను విశ్లేషించి, వాతావరణ పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలి. ఓషనోగ్రఫర్లకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో అవకాశాలు లభిస్తున్నాయి.
జాతీయ లేబొరేటరీల్లో పరిశోధకులుగా సేవలందించొచ్చు. యూనివర్సిటీల్లో ఫ్యాకల్టీగానూ పనిచేయొచ్చు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ, సెంటర్ ఫర్ ఎర్త్ సైన్స్ స్టడీస్, నావల్ ఫిజికల్ అండ్ ఓషనోగ్రఫిక్ లేబొరేటరీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆ్‌ఫ్ ఓషన్ టెక్నాలజీ తదితర జాతీయస్థాయి సంస్థల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయి. ఈ రంగంలో సవాళ్లు కూడా ఉంటాయి. అవసరాన్ని బట్టి సముద్రాలపై ఎక్కువ రోజులు పనిచేయాల్సి వస్తుంది. అందుకు తగ్గట్లుగా ఓషనోగ్రఫర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి. పరిశీలనా శక్తిని, తార్కిక ఆలోచనా విధానాన్ని, బేసిక్ సెన్సైస్‌పై పట్టును పెంచుకుంటే కెరీర్లో ఉన్నతంగా రాణించేందుకు వీలుంటుంది.
అర్హతలు
సైన్స్ సబ్జెక్టులతో ఇంటర్మీడియెట్ పూర్తిచేసిన తర్వాత ఓషనోగ్రఫీలో బ్యాచిలర్స్ డిగ్రీ చదవాలి. అనంతరం మాస్టర్ డిగ్రీ పూర్తిచేయాలి. సీఎస్ఐఆర్ - నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు లేదా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్(గేట్)లో ఉత్తీర్ణత సాధించి, పీహెచ్డీ పూర్తిచేస్తే మెరుగైన అవకాశాలను అందుకోవచ్చు.
వేతనాలు
పీజీ/పీహెచ్డీ పూర్తిచేసిన ఓషనోగ్రఫీ సైంటిస్ట్లకు ప్రారంభంలో నెలకు రూ.30 వేల దాకా వేతనం లభిస్తుంది. సీనియారిటీ పెరిగితే నెలకు రూ.లక్షన్నర దాకా అందుతుంది. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో చేరితే అధిక వేతనాలతో పాటు ఇతర ప్రయోజనాలు దక్కుతాయి.
ఓషనోగ్రఫీ కోర్సులను ఆఫర్ చేస్తున్న సంస్థలు
ఆంధ్రా యూనివర్సిటీ
వెబ్సైట్: http://www.andhrauniversity.edu.in/
నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ-గోవా
వెబ్సైట్: http://www.nio.org/
కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
వెబ్సైట్: http://www.cusat.ac.in/
అన్నామలై యూనివర్సిటీ-తమిళనాడు
వెబ్సైట్: http://annamalaiuniversity.ac.in/
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-ఖరగ్‌పూర్
వెబ్సైట్: http://www.iitkgp.ac.in/
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ-మద్రాస్
వెబ్సైట్: http://www.iitm.ac.in/
సముద్రమంత అవకాశాలు
‘‘ఇటీవలి కాలంలో సముద్ర విభాగాల పరిశోధనలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం పెరిగింది. మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సెన్సైస్‌ను ప్రారంభించాక పరిశోధనలు మరింత ఊపందుకున్నాయి. సముద్ర అంతర్భాగంలో చోటుచేసుకునే మార్పులు, వనరుల అన్వేషణకు శాటిలైట్ ప్రయోగాలు పెరిగాయి. దీంతో అక్కడ నుంచి వస్తున్న డేటాను విశ్లేషించేందుకు నిపుణులు అందుబాటులో లేరు.
దీంతో ఓషనోగ్రఫీ కోర్సులను దేశంలోని మరికొన్ని ఐఐటీలు, విశ్వవిద్యాలయాల్లో ప్రవేశ పెట్టాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఓషనోగ్రఫీని కెరీర్‌గా ఎంచుకొని రీసెర్చ్ ఓరియెంటెడ్‌గా పనిచేసే వారికి ఎన్నో అవకాశాలున్నాయి. ఎంఎస్సీ పూర్తయితే చాలు.. ప్రైవేట్ కన్సల్టెన్సీలు నెలకు రూ.లక్ష వరకు వేతనం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయి. ప్రభుత్వ రంగంలో ప్రారంభంలో తక్కువ వేతనం వచ్చినా మున్ముందు కెరీర్లో ఉన్నతంగా ఎదిగే అవకాశం ఉంది. సుదీర్ఘమైన సముద్రతీరం ఉన్న ఆంధ్రప్రదేశ్‌తోపాటు దేశ, విదేశాల్లోనూ ఓషనోగ్రఫర్లకు మంచి డిమాండ్ ఉంది’’
- ప్రొఫెసర్ కె.వి.ఎస్.ఆర్.ప్రసాద్,
హెడ్ ఆఫ్ ది డిపార్టుమెంట్, ఓషనోగ్రఫీ, ఆంధ్రా యూనివర్సిటీ