ముందుగా వచ్చిన మంత్రి.. అధికారులు లేట్!
సాధారణంగా ఏవైనా కార్యక్రమాలకు మంత్రులు, ఇతర వీవీఐపీలను పిలిస్తే వాళ్లు కార్యక్రమం ప్రారంభ సమయం తర్వాత ఓ అరగంటకో, గంటకో వస్తుంటారు. వాళ్లకోసం వేచి చూసి.. చూసి కళ్లు కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఢిల్లీ విజ్ఞాన భవన్‌లో జరిగిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పిలిచారు. ఆయన ఉదయం 9.40 గంటలకే వచ్చేశారు. కానీ 9.57 గంటల వరకు కార్యక్రమం మొదలు కాలేదు. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది.
తాను ముందుగానే వచ్చినా కార్యక్రమాన్ని సమయానికి ఎందుకు ప్రారంభించలేదని అక్కడున్న అధికారుల మీద మండిపడ్డారు. మీ నిబద్ధత స్థాయి ఏమైనా పడిపోయిందేమో మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. ఇవి చాలా ముఖ్యమైన కార్యక్రమాలని, ఇలాంటి వాటిని గౌరవనీయమైన పద్ధతిలో్ నిర్వహించాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా రెండు రోజుల కార్యక్రమాన్ని రాజ్‌నాథ్ ప్రారంభించారు. వివిధ జిల్లాలలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసిన అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలోనే శుక్రవారం నాడు అవార్డులు అందజేస్తారు.