punctuality
-
రైల్వేల చరిత్రలోనే తొలిసారి ఇలా!
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వేల చరిత్రలోనే తొలిసారిగా ఈనెల 1న అన్ని రైళ్లు నూరు శాతం సరైన సమయపాలన పాటించాయని భారతీయ రైల్వేలు వెల్లడించాయి. ఈరోజున దేశవ్యాప్తంగా నడిచిన 201 రైళ్లలో ఏ ఒక్కటీ ఆలస్యంగా నడవలేదని రైల్వేలు స్పష్టం చేశాయి. భారత రైల్వేలు నూరుశాతం సమయపాలన పాటిస్తూ చరిత్ర సృష్టించాయని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. లాక్డౌన్ నేపథ్యంలో సాధారణ ప్రయాణీకుల రైళ్లను రద్దు చేసిన రైల్వేలు పరిమిత స్ధాయిలో రైళ్లను నడుపుతున్నాయి. వివిధ రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వలస కూలీలు,ఇతరులను తరలించేందుకు రైల్వేలు ప్రత్యేక రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. నిర్ధిష్ట రూట్లలోనే ఈ రైళ్లు నడుస్తున్నాయి. గతంలో జూన్ 23న 99.54 శాతంతో రైళ్లలో సమయపాలన మెరుగ్గా ఉందని ప్రకటించగా తాజాగా జులై 1న మొత్తం 201 రైళ్లు సకాలంలో రాకపోకలు సాగించడంతో నూరు శాతం సమయపాలన సాధించినట్టు రైల్వేలు వెల్లడించాయి. కాగా 109 రూట్లలో 151 ఆధునిక రైళ్లతో పాసింజర్ రైళ్లను ప్రైవేట్ రంగంలో అనుమతించే ప్రక్రియను రైల్వేలు బుధవారం లాంచనంగా ప్రారంభించాయి. ఈ ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లేందుకు ప్రైవేట్ ఆపరేటర్ల నుంచి రిక్వెస్ట్ ఫర్ క్వాలిఫికేషన్స్ (ఆర్ఎఫ్క్యూ)ను రైల్వేలు ఆహ్వానించాయి. ఈ ప్రాజెక్టు ద్వారా రైల్వేల్లో 30,000 కోట్ల రూపాయల ప్రైవేట్ పెట్టుబడులు రానున్నాయి. చదవండి : అత్యవసరమైతే తప్ప ప్రయాణాలొద్దు! -
టైమ్‌కు రాని టీచర్లు; 10 మందిపై వేటు
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విధుల్లో సమయపాలన పాటించడం లేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పది మంది ఉపాధ్యాయులపై వేటు వేశారు. శనివారం ఉదయం 9.15 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్డు బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 16 మంది ఉపాధ్యాయులకు గానూ ముగ్గురు సెలవులో ఉండగా ప్రార్థన సమయానికి కేవలం నలుగురు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు. పిల్లలతో ప్రార్థనలో పాల్గొన్న కలెక్టర్ పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రార్థన అయిపోయాక కూడా మిగతా ఉపాధ్యాయులు రాకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెళ్లిపోయారు. కాగా, ఆయన పదిమందిపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఈఓ నాంపల్లి రాజేశ్‌ను వివరణ కోరగా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందిన విషయం వాస్తవమేనన్నారు. -
ముందుగా వచ్చిన మంత్రి.. అధికారులు లేట్!
సాధారణంగా ఏవైనా కార్యక్రమాలకు మంత్రులు, ఇతర వీవీఐపీలను పిలిస్తే వాళ్లు కార్యక్రమం ప్రారంభ సమయం తర్వాత ఓ అరగంటకో, గంటకో వస్తుంటారు. వాళ్లకోసం వేచి చూసి.. చూసి కళ్లు కాయలు కాస్తాయి. కానీ ఇక్కడ సీన్ రివర్సయింది. ఢిల్లీ విజ్ఞాన భవన్లో జరిగిన సివిల్ సర్వీసెస్ డే కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను పిలిచారు. ఆయన ఉదయం 9.40 గంటలకే వచ్చేశారు. కానీ 9.57 గంటల వరకు కార్యక్రమం మొదలు కాలేదు. దాంతో ఆయనకు ఎక్కడలేని కోపం వచ్చింది. తాను ముందుగానే వచ్చినా కార్యక్రమాన్ని సమయానికి ఎందుకు ప్రారంభించలేదని అక్కడున్న అధికారుల మీద మండిపడ్డారు. మీ నిబద్ధత స్థాయి ఏమైనా పడిపోయిందేమో మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పారు. ఇవి చాలా ముఖ్యమైన కార్యక్రమాలని, ఇలాంటి వాటిని గౌరవనీయమైన పద్ధతిలో్ నిర్వహించాలని సూచించారు. సివిల్ సర్వీసెస్ డే సందర్భంగా రెండు రోజుల కార్యక్రమాన్ని రాజ్‌నాథ్ ప్రారంభించారు. వివిధ జిల్లాలలో ప్రభుత్వ కార్యక్రమాల అమలులో బాగా పనిచేసిన అధికారులకు ప్రధాని నరేంద్రమోదీ ఈ కార్యక్రమంలోనే శుక్రవారం నాడు అవార్డులు అందజేస్తారు. -
మొక్కుబడి విధులు!
• మిడ్జిల్ మండలంలో సర్కార్ చదువుకు సుస్తీ • తేటతెల్లం చేసిన వల్లభ్‌రావుపల్లి పాఠశాల ఘటన.. • సమయపాలన పాటించని ఉపాధ్యాయులు • నిరుపేద పిల్లల దృష్టి ప్రైవేట్ పాఠశాలల వైపు • అధికారులు నిఘా పెట్టాలంటున్న తల్లిదండ్రులు ఐదవ తరగతి అంటే ఆ విద్యార్థి స్పష్టంగా ఇంగ్లిష్‌తోపాటు తెలుగులో రాయరావాలి. అనర్ఘళంగా చదవాలి. కానీ మిడ్జిల్ మండలం వల్లభ్‌రావుపల్లి ప్రాథమిక పాఠశాలలో కనీసం పేరు రాయరాకపోవడం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. జిల్లా కలెక్టర్‌కే ఈ ఘటన ఎదురవడం గమనార్హం. దీనికి ఎవరు బాధ్యులనేది పక్కనపెడితే.. సర్కారు పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందో చెప్పడానికి ఇదో ఉదాహరణ అని విద్యావేత్తలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మిడ్జిల్ : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలని ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయితే మండలంలో పలు పాఠశాలల్లో ఉపాధ్యాయులు మొక్కుబడి విధులు నిర్వహిస్తున్నారన్న విమర్శలు చాలారోజులుగా ఉన్నాయి. మిడ్జిల్ మండలంలో 22 ప్రాథమిక, 7 ప్రాథమికోన్నత, 4 ఉన్నత పాఠశాలలు, ఒక కస్తూర్భా విద్యాలయం ఉంది. ఇందులో రెండు సక్సెస్ పాఠశాలలు ఉన్నాయి. మొత్తంగా 2,592మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. 1114 మంది బాలురు, 1478 మంది బాలికలు ఉన్నారు. మండలంలోని మొత్తం 34 పాఠశాలల్లో ఇంతమంది ఉంటే.. మండల కేంద్రంలోని మూడు ప్రైవేట్ పాఠశాలల్లో దాదాపు 2600 మంది విద్యార్థులు ఉన్నారు. వీరే కాక ప్రతిరోజూ జడ్చర్ల, మహబూబ్‌నగర్‌కు వందలాది మంది విద్యార్థులు వెళ్తున్నారు. తగ్గుతున్న విద్యార్థుల సంఖ్య మిడ్జిల్ గ్రామ పంచాయతీ పరిధిలోని మర్లబావితండాలో మంగళవారం ఉదయం 9.30 అవుతున్నా ఓ ఉపాధ్యాయురాలు విధులు హాజరుకాలేదు. విద్యార్థులు గదిలో ఖాళీగా కూర్చున్నారు. ఇలా సర్కారు బడులలో పనిచేసే చాలామంది ఉపాధ్యాయులు నాణ్యమైన విద్యబోధన చేయకపోవడంతో పాటుగా కాలయాపనకే పరిమితం కావడంతో, రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుంది. చాలామంది టీచర్లు సొంత వ్యాపాకాలలో మునిగి తేలుతున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మండల పరిధిలోని వల్లభ్‌రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఏడుగురు ఉపాధ్యాయులు ఉండగా, దాదాపు 90మంది విద్యార్థులు ఉన్నారు. అందులో దాదాపు 75శాతం మంది విద్యార్థులు వారిపేర్లు, తల్లిదండ్రుల పేర్లు రాయరాని పరిస్థితుల్లో ఉన్నారు. ఇటీవల ఇదే మండలంలోని కస్తూర్బా పాఠశాలలో డీఈఓ సోమిరెడ్డి తనిఖీ చేసి విద్యార్థులను వివిధ అంశాలపై ప్రశ్నలు అడిగారు. చాలామంది సమాధానం చెప్పకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన చేయాలని ఆదేశించారు. మండలంలో దాదాపు 50శాతం పాఠశాలల్లో ఇలాంటి పరిస్థితి ఉన్నా.. పట్టించుకునే వారు కరువవడంతో కూలీ నాలిచేసే తల్లిదండ్రులు సైతం తమ పిల్లల్ని ప్రైవేట్ పాఠశాలలో చదివించేందుకు మొగ్గుచూపుతున్నారు. ఇక్కడ ఐదవ తరగతిలో కూడా పేరు కూడా రాయరాని పరిస్థితులు ఉండడంతో చాలా మంది తల్లిదండ్రులు ప్రాథమికస్థాయినుంచి ఇంగ్లిష్ మీడియంలో ఉంచేందుకు పిల్లలను ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారు. నా ఇద్దరి పిల్లలకు అక్షరాలు నేర్పించలేదు నా ఇద్దరు కొడుకులు శివకుమార్ ఐదవ తరగతి, బాలిశ్వర్ రెండవ తరగతి చదువుతున్నారు. ఇద్దరికి కూడా వారి పేర్లు రాయారాని పరిస్థితి ఉంది. పాఠశాలలో పనిచెసే ఉపాధ్యాయులు వారి కొట్లాటలకే పరిమితమవుతున్నారు. వారి మధ్య ఆధిప్యత పోరు నడుస్తున్నది. మధ్యలో పిల్లలను వదిలేశారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాను. – మైబు, విద్యాకమిటీ చైర్మన్, వల్లభ్‌రావుపల్లి పాఠశాల ఆ..ఐదుగురికి సస్పెన్షన్ ఆర్డర్ల అందజేత మిడ్జిల్ మండల పరిధిలోని వల్లభ్‌రావుపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో ఐదవ తరగతి విద్యార్థులకు సైతం తమ పేరు రాయలేని పరిస్థితికి బాధ్యులైన ఐదుగురు ఉపాధ్యాయులకు సస్పెన్షన్ ఆర్డర్లను మంగళవారం అందించారు. కలెక్టర్ తనిఖీలో విద్యార్థులు కనీసం పేర్లు కూడా రాయలేదు. దీంతో కలెక్టర్ రొనాల్డ్‌రోస్ ఆగ్రహంవ్యక్తం చేస్తూ ఉపాధ్యాయులు రాజలక్ష్మి, శ్వేత, భానుప్రకాష్, సతీష్‌కుమార్, విదాయతుల్లాఖాన్లను సస్పెండ్ చేయాలని అక్కడే ఉన్న డీఈఓను ఆదేశించిన విషయం తెలిసిందే. జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి సంబంధిత సస్పెన్షన్ ఆర్డర్లు మంగళవారం స్థానిక ఎమ్మార్సీ కార్యాలయానికి వచ్చాయి. పాఠశాలకు వచ్చిన ఆ..ఐదుగురు ఉపాధ్యాయులకు కార్యాలయం సీఆర్పీ సస్పెన్షన్ ఆర్డర్లు అందజేశారు. ఆర్డర్లు తీసుకున్న ఉపాధ్యాయులు ఇంటికి వెళ్లిపోయారు. -
అటెండరే డాక్టర్..
♦ ఇక్కడ ఆయనే పెద్ద దిక్కు ♦ ఇద్దరు డాక్టర్లున్నా వచ్చేది ఒక్కరే ♦ సమయపాలన పాటించని సిబ్బంది ♦ వైద్యం అందక అవస్థలు పడుతున్న రోగులు ఎవరూ లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు ఆసుపత్రిలో వైద్యులు లేనప్పుడు అటెండరే దిక్కు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లున్నా విధుల్లో ఉండేది ఒక్కరే. ఆ ఒక్కరు కూడా సమయపాలన పాటించరు. ఫార్మాసిస్ట్ ఉన్నా అటెండర్ ద్వారానే మందులు ఇప్పిస్తున్నారు. ఇంత అధ్వానంగా మారిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఆ దేవుడే బాగు చేయాలి. పుల్కల్ మండల కేంద్రమైన పుల్కల్తోపాటు 16 గ్రామాలకు ఈ ఆసుపత్రి అం దుబాటులో ఉండటంతోపాటు రవాణా సౌకర్యం ఉన్నందున వివిధ గ్రామాలు, తండాల నుంచి నిత్యం సుమారు రెండు వందల మందికి పైగా రోగులు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఉదయం 10 గంటలైనా సిబ్బంది లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో వచ్చే వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఓ ఫా ర్మాసిస్టు, ఏఎన్ఎం, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఇద్దరు డాక్టర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు రికార్డులో ఉన్నా ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తారు. ప్ర సవం కోసం వచ్చే వారికి సూచనలు, అ త్యవసరమైన సమయంలో డెలివరీ చేయడం కోసం మహిళా డాక్టర్‌ను నియమించారు. ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదని స్థానికులంటున్నారు. ఆపరేషన్ థియేటర్ తెరుచుకోకపోవడంతో పరికరాలు మూలనపడ్డాయి. ఎప్పుడొస్తారో తెలియదు... పుల్కల్ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటిం చడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది సంగారెడ్డి, జోగిపేట నుంచి వచ్చి రాకపోకలు సాగిస్తుంటా రు. దీంతో బస్సులు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి మధ్యాహ్నం సైతం 3 గంటలకే తిరిగి వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. డాక్టరుతోపాటు సిబ్బంది సైతం సమయానికి రాకపోవడంతో అక్కడ కాం ట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అటెండరే పెద్ద దిక్కయ్యారు. ఇటీవల సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో బైకుపై నుంచి పడి గాయపడిన యువకుడికి అతనే వైద్యం చేశారు. ఆసుపత్రితో సంబంధం లేని వ్యక్తులు సైతం ఇక్కడ రోగులకు మందులు ఇస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరో అధికారులకే తెలియాలి. -
సమయపాలన పాటించని టీచర్లపై కొరడా
సమయ పాలన పాటించకుండా ఇష్టానుసారంగా పాఠశాలలకు వస్తే చర్యలు తప్పవని ఇంచార్జీ ఎంఈఓ దశరథ్ ఉపాధ్యాయులకు హెచ్చరించారు. గురువారం మండలంలోని తాటిపల్లి కేజీవీబీ పాఠశాలను సందర్శించారు. సమయ పాలన పాటించని మన్సాన్పల్లి ప్రై మరీ పాఠశాల ఉపాధ్యాయుడు దుర్గప్రసాద్, మల్లారెడ్డిపేట ప్రై మరీ పాఠశాల ఉపాధ్యాయుడు అరవింద్‌కు మెమో ఇచ్చామన్నారు. ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచి విద్యార్థుల విద్యాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. ఉపాధ్యాయులు సమయ పాలన పాటించకుండా విద్యాభివృద్దిపై నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాదాకరమని అందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో తాటిపల్లి సర్పంచ్ అల్లం నవాజ్‌రెడ్డి, కేజీవీబీ పాఠశాల ప్రిన్సిపాల్ కవిత పాల్గొన్నారు. -
సమయపాలన పాటించని వైద్యులు
♦ పది గంటలు దాటినా పత్తాలేని సిబ్బంది ♦ డాక్టర్ల కోసం రోగులపడిగాపులు ♦ ఉపాధిపనులు చేస్తుండగా ఓ కూలీకి గాయం ♦ గంటల పాటు తల్లిడిల్లిన బాధితులు మెదక్ : ఆస్పత్రిలో సిబ్బంది సమయపాలన పాటించకపోవటంతో రోగులు నానా అవస్తలు పడిన సంఘటన మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. మెదక్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్దనలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మండలంలోని అనేక గ్రామాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాగా మంగ ళవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళా కూలీ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను హుటాహుటిన ఉపాధి సిబ్బంది ఉదయం 8 గంటలకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల కోసం 10.30 వరకు వేచి చూసినా పత్తాలేదు. గతంలో గ్రామానికి చెందిన వెంకటేశం అనే వ్యక్తికి ఓ ప్రమాదంలో చేతికి గాయమైంది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చినా వైద్యులు అడ్రస్సే లేదు. అలాగే బాలమ్మ, సత్తమ్మ, పెంటమ్మ అనే మహిళలతో పాటు మరికొంత మంది ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో చేసేదిలేక రోగులు పంటిబిగువున బాధను అదిమిపెట్టుకొని 10.30 వరకు అక్కడే వేచి ఉన్నారు. 10.30 గంటల సమయంలో వచ్చిన వైద్య సిబ్బంది వైద్య సేవలను ప్రారంభించారు. ఆస్పత్రిలో నిత్యం ఇదే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కప్పుడు 24 గంటల పాటు ఆస్పత్రి తెరిచే ఉండేదని, ప్రస్తుతం వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు పెళ్లాం పిల్లలు లేరా.. కాగా ఆస్పత్రికి ఆలస్యంగా వచ్చిన సిబ్బంది రోగులపై మండిపడుతూ ఉదయాన్నే రావటానికి ఁమాకు పెళ్లాం పిల్లలు లేరా* అంటూ మండిపడ్డారు.. ఁమీలాగా పొద్దున లేవగానే రావాలంటే సాధ్యం కాదని, ఫోన్లు చేస్తూ ఎందుకు విసిగిస్తున్నారని*, ఓ ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రోగులు పేర్కొన్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న సర్దన ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని ఆస్పత్రి 24 గంటల పాటు తెరచి ఉంచేలా చూడాలని చుట్టుపక్క గ్రామాల ప్రజలు కోరుతున్నారు. -
మోడీ.. రోజుకు 18 గంటల పని!!
మౌనముని మన్మోహన్ సింగ్ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కూడా సైలెంట్‌గానే ఉంటున్నారని, అస్సలు ఆయన పనిచేసినట్లే కనిపించడంలేదని ఇటీవలి కాలంలో కొన్ని విమర్శలు వచ్చాయి. అయితే.. మన ప్రధానమంత్రి పని మనకు కనిపించడంలేదు గానీ, పొరుగునున్న చైనాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఆయన తెల్లవారుజామున 5.30 గంటల నుంచి అర్ధరాత్రి ఒంటిగంట వరకు.. అంటే దాదాపు 18 గంటల పాటు మోడీ పనిచేస్తున్నారని చైనాకు చెందిన 'గ్లోబల్ టైమ్స్' పత్రిక తన కథనంలో పేర్కొంది. పరిశుభ్రత, సమయపాలన.. ఈ రెండింటికీ మోడీ సర్కారు అత్యధిక ప్రాధాన్యం ఇస్తోందని, ఫైళ్లలో ఏ ఒక్కటీ పెండింగు ఉండటానికి వీల్లేదని ఉన్నతాధికారులకు స్పష్టం చేస్తోందని ఈ కథనంలో తెలిపారు. మంత్రులంతా తమ తమ శాఖల కార్యాలయాలను ఆకస్మికంగా తనిఖీ చేస్తూ... ఉన్నతాధికారులు సమయానికి వస్తున్నారో లేదో, కార్యాలయం పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయో లేవో చూస్తున్నారని, ఏమాత్రం సరిలేకపోయినా ఊరుకోవట్లేదని ఆ కథనంలో పేర్కొన్నారు. పాత ప్రభుత్వం కాలం నుంచి పెండింగులో ఉన్న ఫైళ్లను కూడా చకచకా క్లియర్ చేసేస్తున్నారని, అధికారులంతా ఉదయం 9 గంటలకల్లా ఆఫీసుకు వచ్చి, సాయంత్రం 6 గంటల వరకు కచ్చితంగా ఉండేలా చేస్తున్నారని వివరించారు. ఏవైనా పనులుంటే 6 గంటల తర్వాత కూడా పనిచేయిస్తున్నారు. శనివారాలు కూడా అందరూ పని చేస్తున్నారని, అధికారులు ఏమైనా పని మిగిలిపోతే ఇళ్లకు ఫైళ్లు తీసుకెళ్తున్నారని చెప్పారు. తమ శాఖల కార్యాలయాల్లో ఎక్కడా దుమ్ము ఉండకుండా, పాత ఫర్నిచర్ మిగలకుండా, ఫైళ్లు డెస్కుల మీద ఉండకుండా, కిళ్లీ ఉమ్మేసిన మరకలు కనపడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను ఆయా శాఖల కార్యదర్శులకు అప్పగించారని పేర్కొన్నారు. చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారిక పత్రిక 'పీపుల్స్ డైలీ'కి ఇంగ్లీషు వెర్షనే ఈ 'గ్లోబల్ టైమ్స్' పత్రిక.