
ప్రతీకాత్మక చిత్రం
పదిమందిపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం.
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: విధుల్లో సమయపాలన పాటించడం లేదంటూ మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్‌రోస్ పది మంది ఉపాధ్యాయులపై వేటు వేశారు. శనివారం ఉదయం 9.15 గంటలకు జిల్లా కేంద్రంలోని గాంధీరోడ్డు బాలికల ఉన్నత పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. 16 మంది ఉపాధ్యాయులకు గానూ ముగ్గురు సెలవులో ఉండగా ప్రార్థన సమయానికి కేవలం నలుగురు మాత్రమే పాఠశాలకు హాజరయ్యారు.
పిల్లలతో ప్రార్థనలో పాల్గొన్న కలెక్టర్ పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. ప్రార్థన అయిపోయాక కూడా మిగతా ఉపాధ్యాయులు రాకపోవడం, పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో కలెక్టర్ ఆగ్రహం వ్యక్తంచేస్తూ వెళ్లిపోయారు. కాగా, ఆయన పదిమందిపై సస్పెన్షన్ వేటు వేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశించినట్లు సమాచారం. ఈ విషయంపై డీఈఓ నాంపల్లి రాజేశ్‌ను వివరణ కోరగా విధులకు హాజరుకాని ఉపాధ్యాయులను సస్పెండ్ చేయాలని కలెక్టర్ నుంచి ఆదేశాలు అందిన విషయం వాస్తవమేనన్నారు.