
అటెండరే డాక్టర్..
♦ ఇక్కడ ఆయనే పెద్ద దిక్కు
♦ ఇద్దరు డాక్టర్లున్నా వచ్చేది ఒక్కరే
♦ సమయపాలన పాటించని సిబ్బంది
♦ వైద్యం అందక అవస్థలు పడుతున్న రోగులు
ఎవరూ లేనివారికి దేవుడే దిక్కు అన్నట్టు ఆసుపత్రిలో వైద్యులు లేనప్పుడు అటెండరే దిక్కు. స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి వైద్యులు ఎప్పుడు వస్తారో.. ఎప్పుడు పోతారో తెలియని పరిస్థితి. ఇక్కడ ఇద్దరు డాక్టర్లున్నా విధుల్లో ఉండేది ఒక్కరే. ఆ ఒక్కరు కూడా సమయపాలన పాటించరు. ఫార్మాసిస్ట్ ఉన్నా అటెండర్ ద్వారానే మందులు ఇప్పిస్తున్నారు. ఇంత అధ్వానంగా మారిన ఈ ఆరోగ్య కేంద్రాన్ని ఆ దేవుడే బాగు చేయాలి.
పుల్‌కల్
మండల కేంద్రమైన పుల్‌కల్‌తోపాటు 16 గ్రామాలకు ఈ ఆసుపత్రి అం దుబాటులో ఉండటంతోపాటు రవాణా సౌకర్యం ఉన్నందున వివిధ గ్రామాలు, తండాల నుంచి నిత్యం సుమారు రెండు వందల మందికి పైగా రోగులు వైద్యం కోసం ఇక్కడికి వస్తుంటారు. ఉదయం 10 గంటలైనా సిబ్బంది లేకపోవడంతో అత్యవసర పరిస్థితిలో వచ్చే వారంతా ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఈ ఆరోగ్య కేంద్రంలో ఇద్దరు డాక్టర్లు, ఓ ఫా ర్మాసిస్టు, ఏఎన్‌ఎం, స్టాఫ్‌నర్సు, ల్యాబ్ టెక్నీషియన్లు ఇక్కడ పనిచేస్తున్నారు. కానీ ఇద్దరు డాక్టర్లు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నట్టు రికార్డులో ఉన్నా ఒక్కరు మాత్రమే విధులు నిర్వహిస్తారు. ప్ర సవం కోసం వచ్చే వారికి సూచనలు, అ త్యవసరమైన సమయంలో డెలివరీ చేయడం కోసం మహిళా డాక్టర్‌ను నియమించారు. ఆమె ఎప్పుడు వస్తుందో తెలియదని స్థానికులంటున్నారు. ఆపరేషన్ థియేటర్ తెరుచుకోకపోవడంతో పరికరాలు మూలనపడ్డాయి.
ఎప్పుడొస్తారో తెలియదు...
పుల్‌కల్ ఆరోగ్య కేంద్రంలో పనిచేస్తున్న వైద్య సిబ్బంది సమయపాలన పాటిం చడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక్కడ పని చేసే సిబ్బంది సంగారెడ్డి, జోగిపేట నుంచి వచ్చి రాకపోకలు సాగిస్తుంటా రు. దీంతో బస్సులు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి మధ్యాహ్నం సైతం 3 గంటలకే తిరిగి వెళ్తున్నారనే ఆరోపణలున్నాయి. డాక్టరుతోపాటు సిబ్బంది సైతం సమయానికి రాకపోవడంతో అక్కడ కాం ట్రాక్టు పద్ధతిన పనిచేస్తున్న అటెండరే పెద్ద దిక్కయ్యారు. ఇటీవల సమయానికి ఎవ్వరూ లేకపోవడంతో బైకుపై నుంచి పడి గాయపడిన యువకుడికి అతనే వైద్యం చేశారు. ఆసుపత్రితో సంబంధం లేని వ్యక్తులు సైతం ఇక్కడ రోగులకు మందులు ఇస్తున్నారు. ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యులు ఎవరో అధికారులకే తెలియాలి.