సమయపాలన పాటించని వైద్యులు
♦ పది గంటలు దాటినా పత్తాలేని సిబ్బంది
♦ డాక్టర్ల కోసం రోగులపడిగాపులు
♦ ఉపాధిపనులు చేస్తుండగా ఓ కూలీకి గాయం
♦ గంటల పాటు తల్లిడిల్లిన బాధితులు
మెదక్ : ఆస్పత్రిలో సిబ్బంది సమయపాలన పాటించకపోవటంతో రోగులు నానా అవస్తలు పడిన సంఘటన మండల పరిధిలోని సర్దన ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో మంగళవారం చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలాఉన్నాయి. మెదక్ పట్టణానికి 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న సర్దనలో ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి మండలంలోని అనేక గ్రామాల నుంచి రోగులు పెద్ద సంఖ్యలో వస్తుంటారు. కాగా మంగ ళవారం గ్రామంలో ఉపాధి పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు ఓ మహిళా కూలీ చేతికి తీవ్ర గాయమైంది. దీంతో ఆమెను హుటాహుటిన ఉపాధి సిబ్బంది ఉదయం 8 గంటలకు స్థానిక ఆస్పత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆమె వైద్యుల కోసం 10.30 వరకు వేచి చూసినా పత్తాలేదు.
గతంలో గ్రామానికి చెందిన వెంకటేశం అనే వ్యక్తికి ఓ ప్రమాదంలో చేతికి గాయమైంది. దీంతో ఆయన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి వచ్చినా వైద్యులు అడ్రస్సే లేదు. అలాగే బాలమ్మ, సత్తమ్మ, పెంటమ్మ అనే మహిళలతో పాటు మరికొంత మంది ఆస్పత్రికి వచ్చారు. ఆస్పత్రికి తాళం వేసి ఉండటంతో చేసేదిలేక రోగులు పంటిబిగువున బాధను అదిమిపెట్టుకొని 10.30 వరకు అక్కడే వేచి ఉన్నారు. 10.30 గంటల సమయంలో వచ్చిన వైద్య సిబ్బంది వైద్య సేవలను ప్రారంభించారు. ఆస్పత్రిలో నిత్యం ఇదే పరిస్థితి ఉంటుందని గ్రామస్తులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కప్పుడు 24 గంటల పాటు ఆస్పత్రి తెరిచే ఉండేదని, ప్రస్తుతం వారు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మాకు పెళ్లాం పిల్లలు లేరా..
కాగా ఆస్పత్రికి ఆలస్యంగా వచ్చిన సిబ్బంది రోగులపై మండిపడుతూ ఉదయాన్నే రావటానికి ఁమాకు పెళ్లాం పిల్లలు లేరా* అంటూ మండిపడ్డారు.. ఁమీలాగా పొద్దున లేవగానే రావాలంటే సాధ్యం కాదని, ఫోన్లు చేస్తూ ఎందుకు విసిగిస్తున్నారని*, ఓ ఉద్యోగి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రోగులు పేర్కొన్నారు. విధినిర్వహణలో నిర్లక్ష్య వైఖరి అవలంబిస్తున్న సర్దన ఆస్పత్రి సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకొని ఆస్పత్రి 24 గంటల పాటు తెరచి ఉంచేలా చూడాలని చుట్టుపక్క గ్రామాల ప్రజలు కోరుతున్నారు.