దండాలు పెట్టలేదనే బదిలీలు!
దండాలు పెట్టలేదనే బదిలీలు!
Published Thu, Jul 21 2016 9:40 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
దండాలు పెట్టలేదనే బదిలీలు!
చిలకలూరిపేట టౌన్ : మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు, ఆయన సతీమణికి రోజూ ఇంటికెళ్లి దండాలు పెట్టలేదనే చిలకలూరిపేట కమ్యూనిటీ హెల్త్ సెంటర్‌లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బందిని మూకుమ్మడిగా బదిలీ చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ విమర్శించారు. గురువారం ప్రభుత్వాసుపత్రిని పార్టీ నాయకులతో కలిసి పరిశీలించారు. వైద్యులు లేక రోగులు అవస్థలు పడుతున్న పరిస్థితిని తెలుసుకొన్నారు. ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ ఒక పద్ధతి లేకుండా ఒకేసారి పెద్ద ఎత్తున బదిలీలు చేయటంతో రోగులు వైద్యం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఇక్కడ వైద్యులు, సిబ్బంది పనితీరు సరిగా లేదని ఆరోపిస్తూ అసలు వైద్యమే అందని పరిస్థితి కల్పించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జాతీయ రహదారికి దగ్గరలోని ఈ ఆస్పత్రికి నిత్యం ప్రమాద బాధితులు, అత్యవసర కేసులు వస్తుంటాయని చెప్పారు. ఉన్న ఒక్క డాక్టర్ అందరికీ ఎలా వైద్యం చేయగలుగుతారని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ నాయకుల ఆసుపత్రి పర్యటన ఉందన్న విషయం తెలుసుకొని తాత్కాలికంగా ఇద్దరు డాక్టర్లను నరసరావుపేట నుంచి తెస్తే, అక్కడి రోగులకు ఇబ్బంది కాదా? అని ప్రశ్నించారు. వెంటనే బదిలీ చేసిన డాక్టర్లు, సిబ్బంది స్థానాలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.
‘శంకర్‌దాదా ఎంబీబీఎస్’ షో నడిపిన వైనం..
వైఎస్సార్ సీపీ నాయకుల ఆసుపత్రి పరిశీలన ఉందన్న విషయం తెలుసుకొన్న స్థానిక టీడీపీ నాయకులు మద్దినగర్ ప్రాంతం నుంచి పలువురిని తీసుకొచ్చి మంచాలపై పడుకోబెట్టారు. పార్టీ నాయకులు ఆసుపత్రిలోని మూడు వార్డులను పరిశీలించగా రెండు వార్డులకు తలుపులు మూసివేసి ఉంచి ఒక వార్డులో ఇన్‌పేషంట్లకు వైద్యం అందజేస్తున్నట్లు సష్టించారు. ఆసుపత్రి పరిశీలన అనంతరం పార్టీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ మీడియాతో మాట్లాడుతున్న సమయంలో లోపల చికిత్స పొందుతున్నట్లు పడుకున్న నలుగురు వేరే మార్గం ద్వారా బయటకు వెళ్లిపోయారు. ఈ విషయం గమనించినవైఎస్సార్‌సీపీ నాయకులు.. తప్పు కప్పిపుచ్చుకొనేందుకు నాటకాలు ఆడాల్సిన అవసరం ఏముందని విమర్శించారు. కార్యక్రమంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు ఏవీఎం సుభాని, మున్సిపల్ ప్రతిపక్ష నాయకుడు నాయుడు శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ షేక్ అబ్దుల్‌రౌఫ్, షేక్ బాజీబేగం, షేక్ కాలేషావలి, సాపా సైదావలి, నాయకులు రాచమంటి చింతారావు, సయ్యద్ హిదాయతుల్లా, నిడమానూరు హనుమంతరావు, నాంపల్లి రాము, బొల్లెద్దు చిన్నా, బేరింగ్ మౌలాలి, బి.బాలకోటి నాయక్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement