కథ.. మొదటికే!
♦ వైద్యవిధాన పరిషత్ వైద్యులు ఇతర ప్రాంతాలకు వెళ్లాలని సూచన
♦ ఇప్పటికే అందుబాటులో వైద్యులు, సిబ్బంది లేక అవస్థలు పడుతున్న రోగులు
♦ లెబర్ రూంలో ప్రసవాలు చేసే డాక్టర్ లేకపోవడంతో వేదనపడుతున్న గర్భిణులు
♦ నేడు కమిషనర్ కార్యాలయంలో 13మంది వైద్యులకు కౌన్సెలింగ్
♦ వీరు బదిలీ అయితే అంతోఇంతో అందుతున్న సేవలూ దూరం
♦ సోమవారం జిల్లాస్పత్రిని జనరల్ ఆస్పత్రికి అప్పగింత
జిల్లా ఆస్పత్రికి బదిలీల ఎఫెక్ట్
ఈ ఫొటోలో క్యూలైన్‌లో ఉన్న మహిళలు జిల్లా ఆస్పత్రిలో ఉన్న ఆల్ట్రాసౌండ్ దగ్గర పరీక్షల కోసం ఎదురుచూస్తున్న వారు. ఆల్ట్రాసౌండ్ పరీక్షలు చేయాల్సిన డాక్టర్‌కు ఆరోగ్యం బాగాలేక ఉదయం 11.45 గంటలకు వెళ్లిపోయాడు. అప్పటికే 60 మందికి పరీక్షలు చేసినా.. ఇంకా 60 మందికిపైగా గర్భిణులు ఎదురు చూస్తున్నారు. డాక్టర్ వస్తాడని 11.45 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు అలాగే నిరీక్షించారు. ఎంతకూ రాకపోవడంతో నిరాశతో వెళ్లిపోవాల్సి వచ్చింది.
మహబూబ్‌నగర్ క్రైం: మొన్నటివరకు జిల్లా ఆస్పత్రిలో రోగులు వైద్యం కోసం రావాలంటేనే భయపడేవారు. అధికారులు ప్రత్యేక దృష్టి సారించడంతో ఇటీవల ఓ పద్ధతికి చేరుకుంది. రోగుల సంఖ్య సైతం ఊహించని రీతిలో 2వేల నుంచి 2500వరకు చేరింది. ఇంతవరకు బాగానే ఉన్న జిల్లాస్పత్రి తాజా పరిస్థితిని పరిశీలిస్తే మళ్లీ కథ మొదటికి వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అరకొర వైద్యులు, సిబ్బందితో ఇబ్బందులు పడుతున్న సమయంలో ఉన్నవారిని ఇతర ప్రాంతాలకు బదిలీలు చేయడంతో సమస్య మొదటికి వచ్చింది. ఇప్పటివరకు వైద్యవిధాన పరిషత్‌కు సంబంధించిన వైద్యులు జిల్లాస్పత్రిని ఒంటిచేతితో నడుపుకుంటూ వచ్చారు. ప్రస్తుతం వారిని ఇతర ప్రాంతాలకు పంపిస్తామని చెప్పడంతో ఆస్పత్రి.. మళ్లీ సమస్యల వలయంలో చిక్కుకోనుంది.
జిల్లా ఆస్పత్రిలో గర్భిణులకు ప్రసవ వేదన తప్పడం లేదు. వైద్యుల మధ్య వచ్చిన సమస్యల కారణంగా రోగులు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు మెడికల్ కళాశాల మంజూరు కావడంతో ప్రస్తుతం ఉన్న జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రిగా మార్పు చేశారు. దీంతో ఇన్ని రోజులు వైద్యవిధాన పరిషత్ కింద జిల్లాస్పత్రిలో పనిచేస్తున్న వైద్యులు నారాయణపేట లేదా జడ్చర్ల జిల్లాస్పత్రిగా మారిస్తే అక్కడికి వెళ్లాలని భావించారు. కానీ ఇప్పట్లో జిల్లా ఆస్పత్రి ఏర్పాటుపై స్పష్టత వచ్చే పరిస్థితి కన్పించకపోవడంతో వైద్య విధాన పరిషత్ కింద ఉన్న వారిని ఆయా ఆస్పత్రుల్లో సర్దడానికి చూస్తున్నారు.
ప్రసవం కోసం వచ్చే గర్భిణిలకు కాన్పు చేయడానికి అవసరం అయిన గైనకాలజిస్టులు లేకపోవడంతో ఆస్పత్రిలో గర్భిణిలు ప్రసవ వేదనకు గురి అవుతున్నారు. జనరల్ ఆస్పత్రికి సంబంధించిన వైద్యులు, సిబ్బంది అవసరం అయిన వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో సమస్య మరింత జఠిలం అవుతుంది. ప్రస్తుతం ఉన్న వాళ్లు కూడా నేడు (మంగళవారం) హైదరాబాద్ కమిషనర్ కార్యాలయంలో నిర్వహించే కౌన్సెలింగ్‌కు వెళ్తున్నారు. వెళ్లున్న వారిలో గైనిక్ –4, ఈఎన్‌టీ, ఆర్థో–3, సివిల్‌సర్జన్లు 3, అసిస్టెంట్ సర్జన్–1 రేడియాలజిస్ట్–1, పెథాలజీ–1 ఉన్నారు. వీరు బదిలీ అయితే ప్రస్తుతం ఆస్పత్రిలో కాన్పు చేసే వైద్యుడు ఉండడు.
జిల్లాస్పత్రిని అప్పగింత
పాలమూరు మెడికల్ కళాశాల మంజూరు అయిన తర్వాత ప్రస్తుతం జిల్లా ఆస్పత్రిగా ఉన్న దానిని జనరల్ ఆస్పత్రిగా మార్పు చేశారు. అయితే మెడికల్ కళాశాల ఏర్పాటు అయి దాదాపు ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో జిల్లాస్పత్రిని పూర్తిగా జనరల్ ఆస్పత్రిగా మార్చాలని రెండు నెలల నుంచి అన్ని రకాల ప్రక్రియ సాగుతోంది. చివరకు సోమవారం ఉదయం జిల్లా ఆస్పత్రిని జనరల్ ఆస్పత్రికి అప్పగించారు. జిల్లాస్పత్రి డాక్టర్ మీనాక్షి ఆధ్వర్యంలో జనరల్ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాధకు అప్పగించారు. ఇదే సమయంలో అంబులెన్స్‌లు, ఇతర వాహనాలు, ఫైనాన్స్ వ్యవహారాలు, ఫర్నిచర్, డ్రగ్స్, ఫార్మసీ, భవనాలను పూర్తిగా అప్పగించారు. దీంతో ఇకనుంచి పూర్తిగా జిల్లా ఆస్పత్రి నిర్వహణ మొత్తం జనరల్ ఆస్పత్రి పరిధిలోకి వెళ్లింది.
గర్భిణులకు ప్రసవ వేదన వేధిస్తున్న కొరత
కేసీఆర్ కిట్, అమ్మ ఒడి పథకాలు ప్రారంభం తర్వాత జనరల్ ఆస్పత్రిలో ప్రసవాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. బాలింతలకు కనీసం బెడ్స్ దొరకని పరిస్థితి. రోజుకు 35నుంచి 40కేసుల వరకు లెబర్ రూంలో నమోదవుతున్నాయి. వీటిలో రోజుకు 20పైగా ప్రసవాలు జరుగుతుంటే .. గదులు సరిపోవడం లేదు. ప్రస్తుతం ఉన్న మెటర్నిటీ వార్డుతోపాటు మరో రెండు గదులు పూర్తిగా నిండిపోవడంతో బాలింతలను వరండాలో, కింద ఫ్లోర్‌పై పడుకోబెడుతున్నారు. ఒకవైపు ఆస్పత్రిలో కాన్పులు రోజు రోజుకూ పెరిగిపోతుంటే వైద్యుల కొరత వల్ల సమస్య ఏర్పడుతుంది. గర్భిణులకు ఇచ్చిన తేదీ ప్రకారం.. ప్రసవం చేయకపోవడంతో వారు అవస్థలు పడుతున్నారు.