పరిపాలనా వ్యవస్థకు వెన్నెముకగా... సమర్ధతకు మారుపేరుగా పరిగణించే సివిల్ సర్వీసుకు ఎంపిక కావడం కోసం ఏటా లక్షలాదిమంది అభ్యర్థులు పోటీపడుతుంటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్‌సీ) నిర్వహించే ఈ పరీక్షల్లో ఇటీవలికాలంలో వెల్లడవుతున్న ఫలితాలు ఆశాజనకంగా, స్ఫూర్తిదాయ కంగా నిలుస్తున్నాయి. కేవలం సంపన్నవర్గాలకు మాత్రమే సివిల్ సర్వీస్ పరిమిత మన్న పాత అభిప్రాయాలను పటాపంచలు చేస్తున్నాయి. నిరుడు వెల్లడైన ఫలితాల్లో తొలి నాలుగు స్థానాలనూ యువతులే సాధించారు. ప్రథమ ర్యాంక్ తెచ్చుకున్నామె వికలాంగురాలు కూడా. ఈసారి ఫలితాల్లో అగ్రగామిగా నిలిచిన యువతి టీనా దాబి వయసు కేవలం 22 ఏళ్లు. పైగా ఆమెకిది తొలి ప్రయత్నం. దళిత వర్గంనుంచి వచ్చిన టీనా ఇక్కడ పాతుకుపోయి ఉన్న పితృస్వామిక భావ జాలాన్ని, లింగ వివక్షను పారదోలడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానంటున్నది.
ఆ విషయాల్లో ఎక్కువ సమస్యాత్మకంగా ఉన్న హర్యానాను తన కార్య క్షేత్రంగా ఎంచుకోబోతున్నట్టు ప్రకటించింది. అమ్మానాన్నలిద్దరూ ఇంజనీర్లు కావడంవల్ల కలిగిన ఆర్ధిక వెసులుబాటు, ప్రతిభకు పదునుపెట్టుకునే అవకాశం ఆమెను ఢిల్లీలోని ఉన్నత శ్రేణి విద్యా సంస్థ లేడీ శ్రీరాం కళాశాలకు చేర్చి ఉండొచ్చు గానీ...బయటి సమాజంలో ఆడపిల్ల ఎలాంటి వివక్షకు గురవుతున్నదో ఒక యువతిగా ఆమె అవగాహనలోకి వచ్చింది. ఆ వివక్షను రూపుమాపాలన్న కృత నిశ్చయమూ ఏర్పడింది. రెండో ర్యాంకర్‌గా నిలిచిన యువకుడు అతర్ అమిర్ స్వస్థలం నిత్యం ఉద్రిక్తతలతో సతమతమయ్యే జమ్మూ–కశ్మీర్‌లోని అనంతనాగ్. రెండో ప్రయత్నంలో ఇంత ఉన్నతమైన ర్యాంక్‌ను చేజిక్కించుకున్న అతర్‌కుకూడా ఇక్కడి సమస్యల విషయంలో సంపూర్ణమైన అవగాహన ఉంది. తను పుట్టి పెరిగిన ప్రాంతం మిలిటెన్సీ ప్రభావం ఎక్కువగా ఉన్న దక్షిణ కశ్మీర్‌లోనిది. యువత ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం పాటుబడతానని అతర్ చెబుతున్నాడు.
ఎన్నో సంక్లిష్టతలతో, వడబోతలతో కూడుకుని ఉండే సివిల్ సర్వీస్ పరీక్షల్లో వెనకబడిన ప్రాంతాలనుంచి వచ్చినవారు విజేతలుగా నిలవడం మెచ్చదగిన విషయం. వీరిలో చాలామంది బడుగు, బలహీనవర్గాలకు చెందినవారు. అందు వల్ల సమాజంలో ఎన్నో ఇబ్బందులు పడినవారు. 361వ ర్యాంక్ సాధించిన 21 ఏళ్ల అన్సార్ అహమద్ షేక్ పొందిన అనుభవాలు దిగ్భ్రమ కలిగిస్తాయి. పూణేలో పీజీ చేయడానికి వెళ్లినప్పుడు మైనారిటీ అయిన కారణంగా తలదాచుకోవడానికి ఆశ్రయం దొరక్క ఇబ్బందులు పడిన తీరును అతను వివరించాడు. తన మిత్రుడి పేరు శుభంను సొంతం చేసుకుంటే తప్ప దిక్కూ మొక్కూ లేకపోయిందని అన్సార్ చెప్పిన మాటలు మన సమాజం పాటిస్తున్న విలువలను ప్రశ్నిస్తాయి. రెండు తెలుగు రాష్ట్రాలనుంచీ మెరుగైన ర్యాంకులు సాధించినవారిలో కూడా పలువురు వెనకబడిన ప్రాంతాలవారూ, నిరుపేద కుటుంబాలకు చెందినవారున్నారు. నల్ల గొండ జిల్లాకు చెందిన చామకూరి శ్రీధర్ ఒకవైపు పేదరికంతో, మరోవైపు అంగ వైకల్యంతో పోరాడుతూనే అహోరాత్రాలూ శ్రమించి 348వ ర్యాంక్ సాధించాడు.
విజేతలుగా నిలిచినవారిలో చాలామంది కులం, మతం, ప్రాంతం, పుట్టుక కారణంగా సమాజంలో తమకెదురైన ప్రతికూలతలనూ, సవాళ్లనూ అధిగమించిన వారు. కళ్లల్లో ఎన్నో ఆశలతో, ఆకాంక్షలతో ఇటువైపు వచ్చినవారు. సమకాలీన సమస్యలపైనా, వాటివల్ల కలుగుతున్న అనర్థాలపైనా అవగాహనతోపాటు వాటి పరిష్కారం తమకు సాధ్యమేనని విశ్వసిస్తున్నవారు. అందుకు అవసరమైన సంక ల్పమూ, పట్టుదలా ఉన్నవారు. వీరంతా ఏ బహుళజాతి సంస్థలోనో ఉన్నతో ద్యోగాన్ని సాధించి లక్షల్లో వేతనం పొందగలిగే సత్తా ఉన్నవారు. దాంతో పోలిస్తే తక్కువ జీతమూ, అధిక శ్రమ, ఎన్నో బాధ్యతలు ఉండే సివిల్ సర్వీసులను ఎంచుకోవడం వెనకున్న నిజాయితీని, అంకితభావాన్ని గుర్తించేవారుంటే మంచిదే. కానీ ఫ్యూడల్ భావజాలంతో, దాన్నుంచి కలిగే దురహంకారంతో వ్యవహరించే వారే అధికంగా తారసపడే కార్యనిర్వాహకవర్గం అలాంటి అంశాలను గుర్తించగలిగే స్థాయిలో ఉందా? మూడేళ్లక్రితం యూపీలోని నోయిడా జిల్లా ఉన్నతాధికారిగా పనిచేసిన యువ ఐఏఎస్ అధికారిణి దుర్గాశక్తి నాగ్‌పాల్, హర్యానాలో సీనియర్ ఐఏఎస్ అధికారి అశోక్ ఖేమ్కా, జమ్మూ–కశ్మీర్‌లో ఐఏఎస్ అధికారిణి సోనాలీ కుమార్ వంటివారి అనుభవాలు అందుకు భరోసా నివ్వడంలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై రాజకీయంగా కక్ష సాధించడంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనాకాలంలో కీలక పదవుల్లో పనిచేసిన ఐఏఎస్ అధికారులను నాలుగేళ్ల క్రితం కేసుల పేరుతో ఎంతగా వేధించారో అందరికీ గుర్తుంది.
చట్టాలు ఏం చెబుతున్నా, న్యాయం ఏదైనా తాము అనుకున్నదే అమలు జరగా లని కోరుకునే పాలకుల అభీష్టానికి అనుగుణంగా వ్యవహరిస్తేనే మంచి పోస్టుల్లో కొనసాగడం...లేనట్టయితే అప్రాధాన్య పోస్టులకు బదిలీ కావడం చాలా చోట్ల సివిల్ సర్వీసు అధికారులకు ఎదురవుతున్న అనుభవం. ఒకటి రెండు బదిలీల తర్వాత కూడా ‘దారికి’ రానివారిని మరిన్ని బదిలీలతో వేధించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి అనుభవాలెన్ని ఎదురైనా సేవాభావంతో, కర్తవ్యదీక్షతో పనిచేసి ప్రజల్లో ఈ వ్యవస్థపై నమ్మకాన్ని నిలిపిన ఎస్‌ఆర్ శంకరన్, బి.డి. శర్మ వంటివారు కూడా లేకపోలేదు. ఇప్పుడు కోట్లాదిమంది పేద ప్రజలకు ఆసరాగా నిలుస్తున్న అనేక పథకాలకు వారు రూపశిల్పులు. నిజాయితీగా, నిక్కచ్చిగా వ్యవ హరించడం... రాజకీయ ఒత్తిళ్లున్నా, కక్ష సాధింపులున్నా నిబద్ధతతో పనిచేయడం కత్తిమీది సాము. అందుకు ఎంతో ఓపిక, పట్టుదల, అసహాయులపట్ల ప్రేమ అవసరం. ఆ లక్షణాలను కోల్పోకుండా పనిచేసినప్పుడే ఈ విజేతలంతా సివిల్ సర్వీసుకు వన్నె తెస్తారు.
విజేతలకు అసలైన పరీక్ష
Published Fri, May 13 2016 12:07 AM | Last Updated on Sat, Sep 22 2018 7:39 PM
Advertisement
Advertisement