
‘సీ-శాట్’ను పార్లమెంట్‌లో ప్రస్తావిస్తాం
సివిల్ సర్వీసు ప్రవేశ పరీక్షల్లో గణిత అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న ప్రస్తుతపరీక్షా విధానంలో మార్పుకోసం .....
తనను కలసిన ఆశావహ అభ్యర్థులకు జగన్‌మోహన్‌రెడ్డి హామీ
హైదరాబాద్: సివిల్ సర్వీసు ప్రవేశ పరీక్షల్లో గణిత అభ్యర్థులకు ప్రయోజనం చేకూర్చేలా ఉన్న ప్రస్తుతపరీక్షా విధానంలో మార్పుకోసం కేంద్రంపై ఒత్తిడి తేవాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డిని ఆశావహ అభ్యర్థులు కోరారు. పార్టీ విద్యార్థి విభాగం కార్యదర్శి వై ప్రదీప్‌రెడ్డి, కర్నూలు జిల్లా పార్టీ విద్యార్థి విభాగం నేత రఘునాథ్‌రెడ్డి నాయకత్వంలో ఇరు తెలుగు రాష్ట్రాలకు చెందిన దాదాపు 70 మంది ఆశావహ అభ్యర్థులు సోమవారం జగన్‌మోహన్‌రెడ్డితో సమావేశమయ్యారు. 2011 ముందు యూపీఎస్‌సీ అనుసరించిన పరీక్షా విధానం అందరికీ అవకాశాలు కల్పించేదిగా ఉందని వారు జగన్‌కు తెలిపారు. సీ శాట్ ఏర్పాటుతో గణితం, ఆంగ్లంలలో పట్టున్న వారికే సివిల్స్‌లో అవకాశాలొస్తున్నాయని వివరించారు.
గ్రామీణ విద్యార్థులతోపాటు పట్టణ ప్రాంతాల్లో సాధారణ సబ్జెక్టులపై సమగ్ర అవగాహన కలిగిన అభ్యర్థులు నష్టపోతున్నారన్నారు. సీ-శాట్ విధానం...ఐఐటీ, ఐఐఎం వంటి కోర్సులు చేసిన వారికి లబ్ధి కలిగించేదిగా ఉందని, ఈ విధానం అమల్లోకొచ్చాక వెలువడిన సివిల్ సర్వీసు ఫలితాల్ని విశ్లేషిస్తే వారికే ఎక్కువ అవకాశాలు దక్కుతున్నాయని వివరించారు. గతంలో ఆర్ట్స్, సైన్సు, కామర్స్, ఎకనమిక్స్, పాలిటీ, మెడికల్, ఇంజనీరింగ్ తదితర అన్నివర్గాలతోపాటు గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారికి వారివారి సామర్ధ్యాన్ని గుర్తించి సమానావకాశాలు కల్పించేలా సివిల్ సర్వీసు పరీక్షలు ఉండేవన్నారు. సీ-శాట్ వల్ల ఇంజనీరింగ్ విద్యార్థులకు లబ్ధి కలుగుతుండగా, ఇతరులు నష్టపోతున్నారన్నారు. ఈ విషయమై పార్లమెంట్‌లో కేంద్రంపై ఒత్తిడి తెచ్చి తమకు న్యాయం కల్పించాలని వారు జగన్‌ను కోరారు. సీ-శాట్‌ను రద్దుచేసి పాత విధానంలోనే సివిల్ సర్వీసు పరీక్షలు నిర్వహించేలా కేంద్రంపై ఒత్తిడి తేవాలని విన్నవించారు. ఈ విషయాన్ని పార్టీ తరఫున పార్లమెంట్‌లో ప్రస్తావిస్తామని జగన్...తనను కలసిన ప్రతినిధులకు హామీ ఇచ్చారు.