'ప్రేమకు సరైన నిర్వచనం చెబుతాం'
న్యూఢిల్లీ: ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకునేందుకు లవర్స్ సిద్దమవుతుండగా వారికి 'పెళ్లి' చేసేందుకు హిందూ సంస్థలు సన్నాహాలు చేసుకుంటున్నాయి. ప్రేమికులు కనబడితే కళ్యాణం చేస్తామని హిందూ మహాసభ ప్రకటించింది. ఇందుకోసం సుశిక్షితులైన 45 మంది వాలంటీర్లను రంగంలోకి దింపనున్నట్టు హిందూ మహాసభ అధ్యక్షుడు చంద్రప్రకాశ్ కౌశిక్ తెలిపారు. పార్కులు, ధియేటర్లు, రెస్టారెంట్ లు ఇతర ప్రాంతాల్లో తమ వాలంటీర్లను మొహరించనున్నట్టు చెప్పారు. విశృంఖలత్వాన్ని సహించబోమని హెచ్చరించారు.
ప్రేమికులకు తమ వాలంటీర్లు ప్రేమకు సరైన నిర్వచనం చెబుతారని వెల్లడించారు. ప్రేమకు తాము వ్యతిరేకం కాదని, బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడితనాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టం చేశారు. కులం, తల్లిదండ్రులు ఒత్తిడి తదితర కారణాలతో బాధపడే ప్రేమికులకు పెళ్లిళ్లు చేయాలని భావిస్తున్నామన్నారు. అయితే హిందూ మహాసభ హెచ్చరికలను ఖతారు చేయబోమని, తామేం తప్పు చేయడం లేదని ప్రేమికులు అంటున్నారు.