న్యూఢిల్లీ: మన మట్టిలో పుట్టిన గ్రామీణ క్రీడ ఇప్పుడు ప్రపంచకప్‌గా ప్రసిద్ధికెక్కెందుకు సిద్ధమైంది. ప్రప్రథమ ఖోఖో ప్రపంచకప్ టోర్నమెంట్‌కు న్యూఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 19 వరకు జరిగే పోటీలను ఢిల్లీలోని త్యాగరాజ్ స్టేడియంలో నిర్వహిస్తారు. దీనికి సంబంధించిన అధికారిక లోగోను ‘ది వరల్డ్ గోస్ ఖో ఖో’ ట్యాగ్‌లైన్‌తో బుధవారం ఆవిష్కరించారు.
మొత్తం 24 దేశాలకు చెందిన పురుషులు, మహిళల జట్లు ఇందులో పాల్గొంటాయని నిర్వాహకులు తెలిపారు. భారత ఖోఖో సమాఖ్య (కేకేఎఫ్‌ఐ) అధ్యక్షుడు సుధాన్షు మిట్టల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘ఖోఖో ఆట మన మట్టిలో పుట్టింది. ఇప్పుడు ‘మ్యాట్’ మీదికి మారి మరో స్థాయికి చేరడం చాలా ఆనందంగా ఉంది. ఈ గ్రామీణ క్రీడను అంతర్జాతీయ క్రీడగా ఎదిగేందుకు కృషి చేసిన మన సమాఖ్యను అభినందించాల్సిందే.
ముందుగా మన దేశంలో ఈ ఆటను అల్టిమేట్ ఖోఖో లీగ్‌గా ప్రేక్షకుల ముందుకు తెచ్చాం. ఇప్పుడు మరో అడుగు ముందుకేసి ప్రపంచకప్ మెగాఈవెంట్‌గా తీసుకొస్తున్నాం’ అని అన్నారు.
కేంద్ర క్రీడలు, యువజన సర్వీసుల శాఖ సహాయ మంత్రి రక్ష ఖడ్సే మాట్లాడుతూ మహాభారత కాలంలోనే ఖోఖో మన చరిత్రలో భాగమైందని, భారత ప్రభుత్వం ఇలాంటి క్రీడలకు విశిష్ట గౌరవాన్ని తీసుకొచ్చేందుకు ఎంతో కృషి చేస్తోందని, ఈ వరుసలోనే తొలి ఖోఖో ప్రపంచకప్ ఆతిథ్యమిస్తోందని చెప్పారు. ఈ విషయంలో కేకేఎఫ్‌ఐ పోషించిన పాత్రను ఆమె అభినందించారు.
Comments
Please login to add a commentAdd a comment