సాక్షి నాలెడ్జ్ సెంటర్: అంతర్జాతీయ సమాజం ఆంక్షలను పెడచెవినపెట్టి క్షిపణి ప్రయోగాలతో దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియా ఆయుధాలకు ఇంధనం ఎక్కడి నుంచి వస్తోంది? ఈ రాకెట్ ఇంధనం మొదట్లో చైనా, రష్యా నుంచి సరఫరా అయ్యేదనీ, ఇప్పుడు ఉత్తర కొరియానే సొంతంగా తయారుచేసుకుంటూ ఉండొచ్చని అమెరికా గూఢచార సంస్థలు భావిస్తున్నాయి. క్షిపణులు, రాకెట్లను ప్రయోగించడానికి అన్‌సిమిట్రికల్ డైమిథైల్ హైడ్రజైన్ (యూడీఎంహెచ్) అనే శక్తిమంతమైన ఇంధనం అవసరం.
కమ్యూనిస్ట్ కొరియాపై ఆంక్షలకు ముందు యూడీఎంహెచ్‌ను చైనా రష్యాలు గుట్టచప్పుడుకాకుండా అందజేసేవి. ఇప్పుడు ఉత్తర కొరియాయే సొంతగా ఈ ఇంధనం ఉత్పత్తిచేసే స్థాయికి చేరుకుని ఉంటుందని అమెరికా సర్కారు అంచనావేస్తోందని ప్రసిద్ధ అమెరికా దినపత్రిక న్యూయార్క్‌టైమ్స్ వెల్లడించింది. అయితే యూడీఎంహెచ్ తయారీకి అవసరమైన పదార్థాలను చైనా, రష్యా ఇంకా రహస్యంగా రవాణాచేస్తున్నాయా? అనే విషయం తేల్చడానికి అమెరికా ప్రభుత్వం నానా పాట్లు పడుతోందంది. ఒకవేళ అదే నిజమైతే ఈ ముడిపదార్థాల సరఫరాను ఆంక్షల ద్వారా ఆపడానికిగానీ, విద్రోహ చర్యల ద్వారా దెబ్బదీయడానికిగాని ఏంచేయాలనేదానిపై అమెరికా భద్రతా సంస్థలు యోచిస్తున్నాయి.
కిమ్ సర్కారే తయారుచేసుకుంటోందా?
యూడీఎంహెచ్ సరఫరా కోసం కిమ్ జోంగ్ ఉన్ ప్రభుత్వం ఇతర దేశాలపై ఆధారపడే దశలో లేదనీ, ఇప్పటికే దీన్ని ఉత్పత్తి చేస్తోందని గూఢచార సంస్థలు చెబుతున్నాయి. ఈ విషయాన్ని ఎప్పటి నుంచో చెబుతు న్నా అమెరికా సర్కారు పెడచెవిన పెట్టిందని ఈ సంస్థలు అంటున్నాయి. అమెరికాలోని ఏ ప్రాంతాన్నైనా లక్ష్యంగా చేసుకుని ధ్వంసం చేయగల క్షిపణులకు అవసరమైన ఇంధనాన్ని ఉత్తరకొరియా తయారుచేయడం నేర్చుకుందని జార్జి డబ్ల్యూ బుష్ ప్రభుత్వ హయాంనాటి రహస్య డాక్యుమెంట్లలోనే అంచనా వేశారు. కిమ్ ప్రభుత్వం ఇటీవల ప్రదర్శించిన సాంకేతిక సామర్థ్యం చూస్తే ఈపాటికే యూడీఎంహెచ్ ఉత్పత్తిచేయడం ప్రారంభించిందని అనుకోవచ్చని నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ప్రతినిధి టిమోతీ బారెట్ చెప్పారు.
యూడీఎంహెచ్ తయారీ నిలిపేసిన అమెరికా!
యూడీఎంహెచ్ తయారీని చైనా, పలు యూరప్ దేశాలు కొనసాగిస్తుండగా అమెరికాలో 1966లోనే నాసా సలహా మేరకు నిలిపివేశారు. అప్పటి నుంచి అగ్రరాజ్యం తమ ఆయుధాలకు మరింత స్థిరమైన, ఘన ప్రొపెలంట్ ఇంధనాన్ని వినియోగిస్తోంది. తేలికగా మండుతూ వేగంగా ఆవిరైపోయే యూడీఎంహెచ్ ఎంతో ప్రమాదకరమైనది. యూడీఎంహెచ్‌తో ఎగిరే క్షిపణుల ప్రయోగ సమయంలో ఎందరో కార్మికులు గతంలో మరణించారు. రష్యాలో యూడీఎంహెచ్‌ను ‘దెయ్యం విషం’ అని పిలుస్తారు.
రష్యా లేదా చైనా నుంచి ఉత్తర కొరియాకు సరఫరా ఆగిపోయుంటే, ఈ రసాయనం ఎలా తయారుచేయాలో ఉత్తరకొరియా ఇప్పటికే నేర్చుకుని ఉంటుందని నమ్ముతున్నానని యూడీఎంహెచ్ వంటి ఇంధనాలపై పుస్తకం రాసిన ఇక్‌హార్ట్ ష్మిడ్ పేర్కొంటున్నారు. ఈ ఇంధనం తయారీ టెక్నాలజీ, యంత్రాలు ఉత్తరకొరియా సంపాదించే ఉంటుందని, పూర్తిగా సొంతంగా ఉత్పత్తి చేసే స్థితికి చేరే క్రమంలో ఎందరో కార్మికులు ప్రాణాలు కోల్పోయి ఉంటారని అమెరికా విదేశాంగశాఖ మాజీ అధికారి వాన్ డీపెన్ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment