clean energy
-
ప్రపంచంలోనే తొలిసారి.. కొత్త టెక్నాలజీతో కరెంటు ఉత్పత్తి
కోతల్లేని కరెంటు అది కూడా కారు చౌకగా దొరికితే ఎలా ఉంటుంది? అద్భుతం అంటున్నారా? నిజమే కానీ.. ఇప్పటివరకూ ఇలా కాలుష్యం లేకుండా, అతి చౌకగా కరెంటు ఉత్పత్తి చేసే టెక్నాలజీ ఏదీ లేదు మరి! ఇకపై కాదంటోంది హైలెనర్!ప్రపంచంలోనే తొలిసారి తాము కోల్డ్ ఫ్యూజన్ టెక్నాలజీ సాయంతో అందించే వేడి కంటే ఎక్కువ వేడిని పొందగలిగామని.. దీనివల్ల భవిష్యత్తులో అనేక ప్రయోజనాలు ఉంటాయని అంటున్నారు సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సిద్ధార్థ దొరై రాజన్! ఏమిటీ టెక్నాలజీ? చౌక కరెంటు ఎలా సాధ్యం అని అనుకుంటున్నారా? చదివేయండి మరి..మనందరికీ వెలుగునిచ్చే సూర్యుడు కోట్ల సంవత్సరాలుగా భగభగ మండుతూనే ఉన్నాడు. విపరీతమైన వేడి, పీడనాల మధ్య హీలియం అణువులు ఒకదాంట్లో ఒకటి లయమై పోతూండటం వల్ల ఈ వెలుగులు సాధ్యమవుతున్నాయి. ఈ ప్రక్రియను కేంద్రక సంలీన ప్రక్రియ లేదా న్యూక్లియర్ ఫ్యూజన్ అంటారన్నది కూడా మనం చిన్నప్పుడు చదువుకునే ఉంటాం. ఇదే ప్రక్రియను భూమ్మీద నకలు చేసి చౌక, కాలుష్య రహిత విద్యుత్తు ఉత్పత్తికి బోలెడన్ని ప్రయోగాలూ జరుగుతున్నాయి.అయితే.. ఇవి ఎంతవరకూ విజయవంతమవుతాయన్నది ఇప్పటికీ ప్రశ్నార్థకమే. ఈ నేపథ్యంలోనే హైలెనర్ ప్రతిపాదిస్తున్న ‘లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్’ టెక్నాలజీ ఆసక్తికరంగా మారింది. న్యూక్లియర్ ఫ్యూజన్ పనిచేసేందుకు విపరీతమైన వేడి, పీడనాలు అవసరమని చెప్పుకున్నాం కదా.. పేరులో ఉన్నట్లే లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్స్లో వీటి అవసరం ఉండదు. ఎంచక్కా గది ఉష్ణోగ్రతలోనే అణుస్థాయిలో రియాక్షన్స్ జరిగేలా చూడవచ్చు. ఫలితంగా మనం అందించే వేడి కంటే ఎక్కువ వేడి అందుబాటులోకి వస్తుంది.హైలెనర్ బుధవారం హైదరాబాద్‌లోని టీ-హబ్‌లో ఈ టెక్నాలజీని ప్రదర్శించిన సందర్భంగా.. వంద వాట్ల విద్యుత్తును ఉపయోగించగా... 150 వాట్లకు సమానమైన శక్తి లభించింది. ఈ ప్రక్రియలో మిల్లీగ్రాముల హైడ్రోజన్ ఉపయోగించడం వల్ల అదనపు వేడి పుట్టిందని అంటున్నారు సిద్ధార్థ దొరై రాజన్! టి-హబ్ సీఈవో మహంకాళి శ్రీనివాస రావు ఈ లో ఎనర్జీ న్యూక్లియర్ రియాక్షన్ పరికరాన్ని ఆవిష్కరించారు.1989 నాటి ఆలోచన..హైలెనర్ చెబుతున్న టెక్నాలజీ నిజానికి కొత్తదేమీ కాదు. 1989లో మార్టిన్ ఫైష్‌మాన్, స్టాన్లీ పాన్స్ అనే ఇద్దరు ఎలక్ట్రో కెమిస్ట్‌లు తొలిసారి ఈ రకమైన టెక్నాలజీ సాధ్యతను గుర్తించారు. భారజలంతో పల్లాడియం ఎలక్ట్రోడ్‌ను వాడుతూ ఎలక్ట్రోలసిస్ జరుపుతున్నప్పుడు కొంత వేడి అదనంగా వస్తున్నట్లు వీరు తెలుసుకున్నారు. అణుస్థాయిలో జరిగే ప్రక్రియలతో మాత్రమే ఇలా అదనపు వేడి పుట్టే అవకాశముందని వీరు సూత్రీకరించారు. దీన్ని నిరూపించేందుకు ఇప్పటివరకూ చాలా విఫల ప్రయత్నాలు జరిగాయి. తాము విజయం సాధించామని హైలెనర్ అంటోంది. దేశ రక్షణకు అత్యంత కీలకమైన క్షిపణులను అభివృద్ధి చేయడంలో కీలకపాత్ర పోషించిన పద్మ శ్రీ ప్రహ్లాద రామారావు ఈ కంపెనీ చీఫ్ ఇన్నొవేటింగ్ ఆఫీసర్‌గా ఉండటం, ఈ టెక్నాలజీకి భారత పేటెంట్ ఇప్పటికే దక్కడం హైలెనర్‌పై ఆశలు పెంచుతున్నాయి.ఎలాంటి లాభాలు సాధ్యం?విద్యుత్తు, వేడి అవసరమైన ఎన్నో రంగాల్లో ఈ టెక్నాలజీ ద్వారా లాభం కలగనుంది. అంతరిక్షంలో తక్కువ విద్యుత్తును వాడుకుంటూ ఎక్కువ వేడిని పుట్టించవచ్చు. చల్లటి ప్రాంతాల్లో గదిని వెచ్చగా ఉంచేందుకు వాడుకోవచ్చు. ఇందుకోసం ఇప్పుడు కాలుష్య కారక డీజిల్ ఇంధనాలను వాడుతున్న విషయం తెలిసిందే. ఇండక్షన్ స్టౌలను మరింత సమర్థంగా పనిచేయించవచ్చ. తద్వారా విద్యుత్తు ఆదా చేయవచ్చు. విద్యుత్తు ఉత్పత్తికీ వాడుకోవచ్చు. హైలెనర్ టెక్నాలజీకి మరిన్ని మెరుగులు దిద్దడం ద్వారా అదనపు వేడి స్థాయిని రెండున్నర రెట్లకు పెంచవచ్చునని తద్వారా విద్యుదుత్పత్తి మరింత సమర్థంగా మారతుందని సిద్ధార్థ దొరైరాజన్ తెలిపారు. ఈ పరికరాలు ఎలాంటి రేడియోధార్మిక పదార్థాలను వాడదని స్పష్టం చేశారు!! -
విద్యుత్ వ్యవస్థకు పునరుత్పాదక‘శక్తి’ కావాలి!
న్యూఢిల్లీ: భారత్ వాతావరణ (పర్యావరణ పరిరక్షణ) లక్ష్యాలను చేరుకోవడానికి విద్యుత్ వ్యవస్థలో మరింత పునరుత్పాదక శక్తిని అనుసంధానం చేయడం చాలా కీలకమని ఇన్స్టిట్యూట్ ఫర్ ఎనర్జీ ఎకనామిక్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ (ఐఈఈఎఫ్ఏ) తెలిపింది. దేశ విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచడానికి వివిధ చర్యలను కూడా సూచించింది. 2030 నాటికి ఉద్గారాల తీవ్రత తగ్గింపు లక్ష్యాన్ని చేరుకోవడానికి భారత్ పునరుత్పాదక ఇంధనంపై అత్యధిక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇందుకు అనుగుణంగా తన విద్యుత్ వ్యవస్థలో క్లీన్ ఎనర్జీ వాటాను పెంచుకోవాల్సిన అవసరం ఉందని ఐఈఈఎఫ్ఏ ఎనర్జీ అనలిస్ట్, నివేదిక రచయిత చరిత్ కొండా తెలిపారు. 2030 నాటికి నాన్–ఫాసిల్ ఫ్యూయల్ పవర్ ఇన్స్టాల్ కెపాసిటీ వాటాను 50 శాతానికి పెంచడం ఎంతో ముఖ్యమని కొండా పేర్కొన్నారు. 2005 స్థాయిల నుండి 2030 నాటికి దాని ఆర్థిక వ్యవస్థ యొక్క ఉద్గారాల తీవ్రతను 45 శాతానికి తగ్గించడానికి విద్యుత్ వ్యవస్థలో వేరియబుల్ పునరుత్పాదక శక్తిని పెంచడం అవసరమన్నారు. స్థిరమైన టారిఫ్‌లకు బదులుగా ఎఫెక్టివ్ టైమ్–ఆఫ్–యూజ్ (టీఓయూ) విద్యుత్ టారిఫ్‌లను ప్రవేశపెట్టడం, విద్యుత్ రంగానికి మరింత పునరుత్పాదక ఇంధన అనుసంధానం వల్ల భారీ ప్రయోజనాలు ఒనగూరుతాయని, ముఖ్యంగా వినియోగ విధానాల్లో గణనీయమైన మార్పును చూడవచ్చని నివేదిక తెలిపింది. టీఓయూ ప్రైసింగ్ వల్ల పీక్ డిమాండ్ (కీలక సమాయాల్లో విద్యుత్ వినియోగం) 5 నుంచి 15 శాతం తగ్గుతుందని నివేదిక అభిప్రాయడింది. -
శుద్ధ ఇంధన ఉపకరణాలకు పెద్ద మార్కెట్
న్యూఢిల్లీ: శుద్ధ ఇంధన ఆధారిత ఉపకరణాలకు భారీ మార్కెట్ ఉందని, 50 బిలియన్ డాలర్ల విలువైన మార్కెట్ అవాకాశాలు ఉన్నట్టు ఓ నివేదిక తెలియజేసింది. వీటి ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు ఊతం లభిస్తుందని, ముఖ్యంగా మహిళల సాధికారతకు ఉపకరిస్తుందని పవరింగ్ లైవ్లీ హుడ్స్ అనే నివేదిక వెల్లడించింది. భారత్‌లో 75 శాతం మహిళా కార్మికులు వ్యవసాయం, వ్యవసాయ అనుబంధ రంగాలు, ఆహార శుద్ధి పరిశ్రమల్లో ఉపాధి పొందుతున్న విషయాన్ని ప్రస్తావించింది. వికేంద్రీకృత పునరుత్పాదక ఇంధన (డీఆర్ఈ) సాంకేతికతలు విద్యుత్ అంతరాయాలకు పరిష్కారమని చెబుతూ.. వీటి వల్ల గ్రామీణ మహిళల ఉత్పాదక పెరుగుతుందని పేర్కొంది. డీఆర్ఈ సాంకేతికతలపై లైవ్లీహుడ్ ఓ అధ్యయనం నిర్వహించింది. దీనివల్ల 13,000 మందికి పైగా డీఆర్ఈ లైవ్లీహుడ్ సాంకేతికతలు వాడగా, ఇందులో 10,400 మంది మహిళలు ఉన్నారు. వారి ఆదాయం పెరిగినట్టు ఈ నివేదిక వెల్లడించింది. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
సోలార్ రంగంలో పెట్టుబడుల వెల్లువ
న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా భారత్‌తోసహా సౌర విద్యుత్ రంగంలో కార్పొరేట్ నిధులు అంచనాలను మించి వెల్లువెత్తుతున్నాయి. క్లీన్ ఎనర్జీ కమ్యూనికేషన్స్, కన్సలి్టంగ్ కంపెనీ మెర్కమ్ క్యాపిటల్ గ్రూప్ ప్రకారం.. వెంచర్ క్యాపిటల్, పబ్లిక్ మార్కెట్, డెట్ ఫైనాన్సింగ్ ద్వారా ఈ ఏడాది జనవరి–సెపె్టంబర్ కాలంలో అంతర్జాతీయంగా సోలార్ రంగంలోకి 112 డీల్స్‌తో రూ.1,68,720 కోట్ల నిధులు వచ్చి చేరాయి. గతేడాదితో పోలిస్తే ఇది దాదాపు మూడు రెట్లు అధికంగా ఉండడం విశేషం. 2020 జనవరి–సెపె్టంబర్లో 72 డీల్స్‌తో రూ.57,670 కోట్ల నిధులను ఈ రంగం అందుకుంది. 2010 తర్వాత పెట్టుబడుల విషయంలో ఈ ఏడాది ఉత్తమ సంవత్సరంగా ఉంటుంది. పబ్లిక్ మార్కెట్ ఫైనాన్సింగ్ ద్వారా 23 డీల్స్‌తో రూ.46,620 కోట్ల నిధులు వచ్చి చేరాయి. వెంచర్ క్యాపిటల్ సంస్థలు 39 డీల్స్ ద్వారా రూ.16,280 కోట్లు పెట్టుబడి చేశాయి. అంత క్రితం ఏడాదితో పోలిస్తే ఇది 466 శాతం వృద్ధి. కొనుగోళ్లు, విలీనాలు 83 నమోదయ్యాయి. -
దుబాయ్‌కి త్వరలో అణు విద్యుత్!
చమురు సరఫరాలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూఏఈ.. తన మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంటును పూర్తి చేసే దశలో ఉంది. ఈ ప్లాంటు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యిందని ఎమిరేట్స్ అణు ఇంధన కార్పొరేషన్(ఈఎన్‌ఈసీ) శనివారం తెలిపింది. అబూ దాబీలో ఉన్న ఈఎన్‌ఈసీ... మూడు, నాలుగు యూనిట్ల పని సగానికి పైగా పూర్తయింది. నాలుగు యూనిట్ల నుంచి సురక్షితమైన, శుద్ధమైన, సమర్ధవంతమైన అణుశక్తి సరఫరా అవుతుందని, ఇది తమ దేశంలోని దాదాపు నాలుగోవంతు విద్యుత్ అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు. అయితే.. ఈ ప్లాంటుకు ఇంకా రెగ్యులేటరీ సమీక్షలు, లైసెన్సింగ్ ప్రక్రియలు మాత్రం పెండింగులో ఉన్నాయి. యూఏఈకి చెందిన అల్ గార్బియాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న ఈ బర్కా అణువిద్యుత్ ప్లాంటు నిర్మాణం 2020 నాటికి పూర్తవుతుంది. దీన్నుంచి వచ్చే స్వచ్ఛ ఇంధనం వల్ల ప్రతియేటా 12 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను యూఏఈ అరికట్టగలదు. అరబ్బు ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంటు. దీని నిర్మాణంలో కృషిచేసిన బృందాన్ని ఈఎన్‌ఈసీ సీఈఓ మొహమ్మద్ అల్ హమ్మాది ప్రశంసించారు. మూడు, నాలుగు యూనిట్ల సాధన అనేది ఓ మైలురాయని, ఒకటి రెండు యూనిట్ల భద్రతా పరీక్షలలో నెగ్గడం మంచి పరిణామం అని ఆయన అన్నారు.