దుబాయ్‌కి త్వరలో అణు విద్యుత్!
Published Sat, Jan 7 2017 8:23 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM
చమురు సరఫరాలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న యూఏఈ.. తన మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంటును పూర్తి చేసే దశలో ఉంది. ఈ ప్లాంటు పనులు దాదాపు 75 శాతం పూర్తయ్యిందని ఎమిరేట్స్ అణు ఇంధన కార్పొరేషన్(ఈఎన్‌ఈసీ) శనివారం తెలిపింది. అబూ దాబీలో ఉన్న ఈఎన్‌ఈసీ... మూడు, నాలుగు యూనిట్ల పని సగానికి పైగా పూర్తయింది. నాలుగు యూనిట్ల నుంచి సురక్షితమైన, శుద్ధమైన, సమర్ధవంతమైన అణుశక్తి సరఫరా అవుతుందని, ఇది తమ దేశంలోని దాదాపు నాలుగోవంతు విద్యుత్ అవసరాలను తీరుస్తుందని చెబుతున్నారు.
అయితే.. ఈ ప్లాంటుకు ఇంకా రెగ్యులేటరీ సమీక్షలు, లైసెన్సింగ్ ప్రక్రియలు మాత్రం పెండింగులో ఉన్నాయి. యూఏఈకి చెందిన అల్ గార్బియాలోని నైరుతి ప్రాంతంలో ఉన్న ఈ బర్కా అణువిద్యుత్ ప్లాంటు నిర్మాణం 2020 నాటికి పూర్తవుతుంది. దీన్నుంచి వచ్చే స్వచ్ఛ ఇంధనం వల్ల ప్రతియేటా 12 మిలియన్ టన్నుల కర్బన ఉద్గారాలను యూఏఈ అరికట్టగలదు. అరబ్బు ప్రపంచంలోనే ఇది మొట్టమొదటి అణు విద్యుత్ ప్లాంటు. దీని నిర్మాణంలో కృషిచేసిన బృందాన్ని ఈఎన్‌ఈసీ సీఈఓ మొహమ్మద్ అల్ హమ్మాది ప్రశంసించారు. మూడు, నాలుగు యూనిట్ల సాధన అనేది ఓ మైలురాయని, ఒకటి రెండు యూనిట్ల భద్రతా పరీక్షలలో నెగ్గడం మంచి పరిణామం అని ఆయన అన్నారు.
Advertisement