Asian Infrastructure Investment Bank
-
అల్పాదాయ దేశాలకు ఆర్థిక వనరులు అందించాలి
న్యూఢిల్లీ: సాంకేతిక సహాయం, ఇతరత్రా సర్వీసుల ద్వారా అల్పాదాయ సభ్య దేశాలకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉండేలా తోడ్పాటు అందించాలని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్‌కి (ఏఐఐబీ) కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సూచించారు. క్లయింట్ అవసరాలకు అనుగుణంగా సేవలు అందించే విధానాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉజ్బెకిస్తాన్‌లో ఏఐఐబీ బోర్డు గవర్నర్ల 9వ వార్షిక సమావేశం జరగనున్న నేపథ్యంలో బ్యాంక్ ప్రెసిడెంట్ జిన్ లికున్‌తో భేటీ సందర్భంగా ఆమె ఈ విషయాలు తెలిపినట్లు కేంద్ర ఆర్థిక శాఖ మైక్రో బ్లాగింగ్ సైటు ఎక్స్‌లో పోస్ట్ చేసింది. తొమ్మిదేళ్ల స్వల్ప వ్యవధిలోనే రుణ కార్యకలాపాలను ఏఐఐబీ వేగవంతంగా విస్తరించిందని మంత్రి ప్రశంసించారు. అలాగే సంస్థ గవర్నెన్స్ ప్రమాణాలు పాటించడంలోను, వృద్ధి సాధనలోను భారత్ కీలకపాత్ర పోషిస్తోందని బ్యాంకు తెలిపింది. మరోవైపు, ఖతార్ ఆర్థిక మంత్రి అలీ బిన్ అహ్మద్ అల్ కువారీతో కూడా సీతారామన్ భేటీ అయ్యారు. ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులు తదితర అంశాలపై చర్చించారు. ఏఐఐబీలో భారత్ రెండో అతి పెద్ద వాటాదారు, అతి పెద్ద క్లయింట్‌గాను ఉంది. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి ఆర్థిక వనరులను అందించే బహుళపక్ష డెవలప్మెంట్ బ్యాంకుగా, బీజింగ్ కేంద్రంగా ఏఐఐబీ ఏర్పడింది. ఇందులో చైనాకు అత్యధికంగా 2,97,804 షేర్లు ఉండగా, భారత్‌కు 83,673 షేర్లు ఉన్నాయి. -
రూరల్ రోడ్ల పనుల నాణ్యత భేష్
సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది. జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. రూ.5,026 కోట్లతో పనులు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి. కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్‌కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్పర్ట్ ప్రదీప్, ట్రాన్స్పోర్ట్ ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు. -
శుద్ధ ఇంధనాలు, ఇన్ఫ్రాకు ప్రాధాన్యం ఇవ్వాలి
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల శుద్ధ ఇంధనాలు, మౌలిక సదుపాయాల కల్పన తదితర ప్రాధాన్య రంగాల్లో పెట్టుబడులు పెంచాలని ఆసియా మౌలిక అభివృద్ధి బ్యాంకు (ఏఐఐబీ)ను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కోరారు. అలాగే, విద్య, ఆరోగ్యంపైనా పెట్టుబడుల విషయంలో ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఏఐఐబీ బోర్డ్ ఆఫ్ గవర్నర్ల ఏడో వార్షిక సమావేశాన్ని ఉద్దేశించి మంత్రి సీతారామన్ మాట్లాడారు. ప్రాధాన్య రంగాల్లో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఏఐఐబీని కోరారు. విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలు, సామాజిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ సదుపాయాలు, విద్య, ఆరోగ్య సదుపాయాల కల్పన ప్రాధాన్యతలను మంత్రి గుర్తు చేశారు. ఈ రంగాల్లో చెప్పుకోతగ్గ మార్పును తీసుకొచ్చేందుకు మరిన్ని పెట్టుబడుల అవసరం ఉందన్నారు. ఏఐఐబీ సభ్య దేశాల విస్తృత మౌలిక అవసరాలను చేరుకోవడం కేవలం ప్రభుత్వాలు చేసే కేటాయింపులతోనే సాధ్యం కాదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. స్వావలంబన బాటలో భారత్.. భారత్ స్వావలంబన ఆర్థిక వ్యవస్థ బాటలో ఉన్నట్టు గుర్తు చేశారు. దీంతో కరోనా మహమ్మారి కారణంగా ఏర్పడిన ప్రతికూల ప్రభావాలను సమర్థంగా అధిగమించినట్టు చెప్పారు. పెద్ద ఎత్తున నిర్మాణాత్మక సంస్కరణలు చేపట్టడం, లక్ష్యాలకు అనుగుణమైన విధానాలు.. సవాళ్ల మధ్య బలంగా నిలబడేందుకు సాయపడినట్టు వివరించారు. -
కీలక పోస్టులోకి ఆర్బీఐ మాజీ గవర్నర్ ! బ్రిటానియాకు గుడ్‌బై
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్‌గా పని చేసిన ఊర్జిత్ పటేల్‌కి కీలక పదవి దక్కింది. ఊర్జిత్ పటేల్‌ను ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమించింది. ఏఐఐబీ వ్యవస్థాపక దేశాల్లో భారత్ కూడా ఉంది. వైస్ ప్రెసిడెంట్ షియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ప్రధాన కార్యాలయం చైనా రాజధాని బీజింగ్‌లో ఉంది. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 1న ఊర్జిత్ పటేల్ ఈ బ్యాంకు వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించనున్నారు. దీంతో బ్రిటానియా కంపెనీలో ఉన్న పదవులకు ఆయన శనివారం రాజీనామా సమర్పించారు. రిజర్వ్ బ్యాంక్‌కి 24వ గవర్నర్‌గా ఊర్జిత్ పటేల్ సేవలు అందించారు. ఆయన గవర్నర్‌గా ఉన్న సమయంలోనే పెద్ద నోట్ల రద్దు నిర్ణయం జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వ పెద్దలతో పొసగపోవడంతో ఆయన తన పదవికి రాజీనామా చేశారు. రాజీనామ ఆర్బీఐ గవర్నర్ బాధ్యతల నుంచి తప్పుకున్న తర్వాత ఆయన బ్రిటానియా సంస్థలో ఇండిపెండెంట్ డైరెక్టర్ కమ్ నాన్ ఎగ్జిక్యూటివ్ మెంబర్‌గా కొనసాగుతున్నారు. గత నెలలోనే ఊర్జిత్ను వైస్ ప్రెసిడెంట్ నియామక నిర్ణయాన్ని ఏఊఊబీ వెల్లడించింది. గత రెండు వారాలుగా ఈ విషయంపై మౌనంగా ఉన్న ఊర్జిత్ పటేల్.. చివరకు బ్రిటానియాకు తగు సమయం కేటాయించలేకపోతున్నందున రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. చదవండి: ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..! -
ఏఐఐబీ ఉపాధ్యక్షుడిగా ఆర్బీఐ మాజీ గవర్నర్..!
న్యూఢిల్లీ: ఆర్బీఐ మాజీ గవర్నర్ ఉర్జిత్ పటేల్‌ను బీజింగ్ కేంద్రంగా పనిచేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ) ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు బ్యాంకు వర్గాలు ఆదివారం తెలిపాయి. చైనా తర్వాత రెండో అత్యధిక ఓటింగ్ వాటాతో ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు(ఏఐఐబీ)లో భారత్ వ్యవస్థాపక సభ్యదేశంగా ఉంది. ఏఐఐబీకి చైనా మాజీ ఆర్థిక శాఖ వైస్ మినిస్టర్ జిన్ లికున్ నాయకత్వం వహిస్తున్నారు. 58 ఏళ్ల పటేల్ మూడేళ్ల పదవీకాలం గల ఏఐఐబీ ఐదుగురు ఉపాధ్యక్షుల్లో ఒకరుగా ఉంటారు. వచ్చే నెలలో ఆయన తన పదవిలో చేరనున్నట్లు తెలుస్తోంది. ఏఐఐబీలో వైస్ ప్రెసిడెంట్ పదవి చేపట్టిన డిజె పాండియన్ తర్వాత ఆయన బాధ్యతలు చేపట్టనున్నట్లు ఏఐఐబీ వర్గాలు పీటీఐకి తెలిపాయి. గతంలో గుజరాత్ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన పాండియన్ ఈ నెల చివర్లో భారతదేశానికి తిరిగి రానున్నారు.సెప్టెంబర్ 5, 2016న రఘురామ్ రాజన్ తరువాత రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 24వ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ బాధ్యతలు చేపట్టారు. డిసెంబర్ 2018లో "వ్యక్తిగత కారణాల వల్ల" పటేల్ రాజీనామా చేశారు. సెప్టెంబర్ 6, 2016న బాధ్యతలు చేపట్టడానికి ముందు అతను రఘురామ్ రాజన్ ఆధ్వర్యంలో ఆర్బీఐలో ద్రవ్య విధాన విభాగాన్ని పర్యవేక్షిస్తున్న డిప్యూటీ గవర్నర్‌గా ఉన్నారు. పటేల్ గతంలో అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్), బోస్టన్ కన్సల్టింగ్ గ్రూప్ & రిలయన్స్ ఇండస్ట్రీస్ వంటి ప్రముఖ ఇతర సంస్థలతో కలిసి పనిచేశారు. ఏఐఐబీ నుంచి 28 ప్రాజెక్టులకు 6.8 బిలియన్ డాలర్లు రుణం తీసుకుంది. అతిపెద్ద లబ్ధిదారుగా అవతరించిన భారతదేశానికి ఏఐఐబీ పటేల్ పోస్టింగ్ ముఖ్యమైనది అని పాండియన్ శనివారం తన వీడ్కోలు సమయంలో తెలిపారు. (చదవండి: ఎలక్ట్రిక్ వాహన కొనుగోలుదారులకు 2022లో పండగే..!) -
వ్యాక్సిన్ల కొనుగోలుకు రూ.11 వేల కోట్ల రుణం
న్యూఢిల్లీ: కోవిడ్–19 వ్యాక్సిన్ కొనుగోలు కోసం ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంకు భారత్‌కు 150 కోట్ల అమెరికా డాలర్ల (దాదాపు రూ.11,185 కోట్లు) రుణాన్ని మంజూరు చేసింది. ఈ విషయాన్ని గురువారం ఏడీబీ ఒక ప్రకటనలో వెల్లడించింది. కోవిడ్‌పై పోరాటం కోసం సురక్షితమైన, సమర్థవంతమైన వ్యాక్సిన్ల కొనుగోలు కోసం 150 కోట్ల అమెరికా డాలర్ల రుణాన్ని మంజూరు చేస్తున్నట్టుగా ఆ ప్రకటన తెలిపింది. చైనాలోని బీజింగ్ కేంద్రంగా పని చేసే ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) అదనంగా మరో 50 కోట్ల డాలర్లను రుణంగా ఇవ్వడానికి అవకాశాలున్నాయి. -
ఏపీకి కొత్తగా ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
-
ఏపీకి కొత్తగా ఏఐఐబీ 3 బిలియన్ డాలర్ల రుణం
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త 3 బిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకు (ఏఐఐబీ) సంసిద్ధత వ్యక్తం చేసింది. గతంలో ఇచ్చిన రుణానికి ఇది అదనమని బ్యాంకు ప్రతినిధులు వెల్లడించారు. ప్రభుత్వ పాలసీలతో తమకు సంబంధం లేదని, నిర్దేశించుకున్న ప్రాధాన్యతల ప్రకారం ఈ డబ్బును ఖర్చు చేసుకోవచ్చని స్పష్టం చేసింది. సచివాలయంలోని కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో ఏఐఐబీ ప్రతినిధులు గురువారం సమావేశమయ్యారు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఇన్వెస్టిమెంట్ ఆఫీసర్ పాండియన్, డైరెక్టర్ జనరల్–ఇన్వెస్ట్మెంట్ ఆపరేషన్స్ డిపార్ట్మెంట్ యీ–ఎన్–పంగ్, ప్రిన్సిపల్ సోషల్ డెవలప్మెంట్ స్పెషలిస్ట్ సోమనాథ్ బసు ముఖ్యమంత్రితో భేటీ అయ్యారు. ఏఐఐబీ ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాజెక్టులకు సహాయ సహకారాలు అందిస్తోందని, వీటితోపాటు మరిన్ని ప్రాజెక్టులకు ఆర్థిక సహాయం చేస్తామని ముఖ్యమంత్రికి తెలిపారు. రాష్ట్రం వ్యవసాయక రాష్ట్రమని, 62 శాతం మంది ప్రజలు ఆదేరంగంపై ఆధారపడి ఉన్నారని, అలాగే ఎక్కువమందికి ఉపాథి కల్పించేది వ్యవసాయరంగమేనని సీఎం స్పష్టంచేశారు. అందుకే ఇరిగేషన్ ప్రాజెక్టులు తమకు అత్యంత ప్రాధాన్యమైనవని ఏఐఐబీ ప్రతినిధులకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఏది ప్రాధాన్యత అనుకుంటే దానికి ఖర్చుపెట్టుకోవచ్చని ఈ సందర్భంగా బ్యాంకు ప్రతినిధులు స్పష్టంచేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న నవరత్నాలు సహా పలు కార్యక్రమాలపై ఆరా తీశారు. ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికి, అట్టడుగున ఉన్న వర్గాలవారిని ఆదుకోవడానికి చేపడుతున్న కార్యక్రమాలను సీఎం వివరించారు. స్కూళ్లు, ఆస్పత్రుల్లో నాడు – నేడు కింద చేపడుతున్న కార్యక్రమాలను కూడా సీఎం బ్యాంకు ప్రతినిధులకు సవివరంగా తెలియజేశారు. ఇంగ్లిషు మీడియంను స్కూళ్లలో ప్రవేశపెట్టడంతోపాటు, కల్పిస్తున్న కనీస సదుపాయాలు, మధ్యాహ్న భోజనంలో చేపట్టిన మార్పులను కూడా వారికి వివరించారు. నిరక్షరాస్యత నిర్మూలించడానికి, ఆ దిశగా పిల్లలను బడులకు పంపేలా తల్లులను ప్రోత్సహించడానికి అమ్మ ఒడి కింద నేరుగా నగదు బదిలీచేసిన అంశాన్ని కూడా బ్యాంకు అధికారులకు తెలిపారు. ఉపాథే లక్ష్యంగా ఉన్నత విద్యా కోర్సుల్లో ప్రవేశపెడుతున్న మార్పులను, ఒక ఏడాది అప్రెంటిస్‌షిప్ ప్రవేశపెడుతున్న విధానాన్ని, ప్రతి పార్లమెంటుకూ స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. పూర్తిస్థాయి ఫీజు రియింబర్స్‌మెంట్, విద్యా వసతి పథకం వివరాలపై సీఎం సమగ్రంగా మాట్లాడారు. ఈ కార్యక్రమాలపై ఏఐఐబీ అధికారులు ప్రశంసలు కురిపించారు. నాలెడ్జ్ మీద పెడుతున్న పెట్టుబడులుగా అభివర్ణించారు. భవిషత్తు తరాలకు ఇవ్వగలిగే ఆస్తి చదువేనన్న సీఎం వ్యాఖ్యలతో వారు ఏకీభవించారు. అలాగే వైద్య విద్యపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారన్న దానిపై బ్యాంకు ప్రతినిధులు సీఎంను ఆరాతీశారు. ప్రతి పార్లమెంటు స్థానానికీ ఒక బోధనాసుపత్రి ఉండేలా చూస్తున్నామని, దీనికోసం మరో 16 మెడికల్‌కాలేజీలు కొత్తగా పెట్టేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. సీఎం ప్రణాళికలు బాగున్నాయని బ్యాంకు అధికారులు వ్యాఖ్యానించారు. 20 ఏళ్లుగా ప్రైవేటైజేషన్ మాటలు విన్నామని, కాని ప్రజల కేంద్రంగా, వారి సంక్షేమం, నాణ్యమైన జీవన ప్రమాణాల సాధన ధ్యేయంగా జరుగుతున్న కార్యక్రమాల గురించి మళ్లీ వింటున్నామని ఏఐఐబీ అధికారులు సీఎంతో అన్నారు. కొత్తగా నిర్మించదలచుకున్న పోర్టులపై సీఎంను ఆరా తీయగా, శ్రీకాకుళం జిల్లాలోని భావనపాడు, కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం, ప్రకాశం జిల్లాలోని రామాయపట్నంలో పోర్టులను నిర్మించడానికి చర్యలు తీసుకుంటున్నామని ముఖ్యమంత్రి తెలిపారు. ఒక పోర్టుకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నామని బ్యాంకు అధికారులు వెల్లడించారు. ఇరిగేషన్, రోడ్లు, వాటర్ గ్రిడ్, ఎయిర్ పోర్టుల నిర్మాణాలకు తమ సహాయం ఉంటుందని తెలిపారు. గోదావరి – కృష్ణా నదుల అనుసంధానంపైన కూడా సీఎం బ్యాంకు అధికారులకు వివరించారు. సముద్రంలో కలిసి పోతున్న నీటిని తరలించడం ద్వారా శాశ్వతంగా ప్రజలకు మేలు జరుగుతుందని వివరించారు. ప్రభుత్వం నిర్ణయించుకున్న ఏ ప్రాధాన్యతలకైనా తమ సహాయం ఉంటుందని ఏఐఐబీ అధికారులు స్పష్టంచేశారు. తన ప్రణాళికలను వివరించడానికి బ్యాంకు ప్రధాన కార్యాలయానికి రావాల్సిందిగా ముఖ్యమంత్రిని ఏఐఐబీ బ్యాంకు అధికారులు ఆహ్వానించారు. -
ఇన్ఫ్రాపై దృష్టి పెట్టాలి
ఏఐఐబీ ప్రెసిడెంటుకి ప్రధాని సూచన న్యూఢిల్లీ: ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) ఆసియా దేశాల వృద్ధికి తోడ్పడేలా రైలు..రోడ్డు.. పోర్టుల ద్వారా కనెక్టివిటీని పెంచేలా మౌలిక రంగ అభివృద్ధిపై దృష్టి సారించాలని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఏఐఐబీ ప్రెసిడెంటుగా నియమితులైన జిన్ లికున్‌తో సోమవారం ఆయన భేటీ అయ్యారు. కోట్ల మంది ప్రజలను పేదరికం నుంచి బైటపడేసేందుకు ఇన్ఫ్రాను మెరుగుపర్చుకోవడం కీలకమని మోదీ పేర్కొన్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకులకు పోటీ పూర్వకంగా ఏర్పాటైన ఏఐఐబీ వచ్చే నెలలో కార్యకలాపాలు ప్రారంభించనుంది. -
ఆసియా ఇన్ఫ్రా బ్యాంకులో మరో 3 దేశాలు
బీజింగ్: ఆసియా దేశాల్లో మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)లో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ చేరాయి. దీంతో చైనా సారథ్యంలోని ఏఐఐబీలో భారత్ సహా సభ్య దేశాల సంఖ్య 30కి చేరింది. 50 బిలియన్ డాలర్లతో ప్రతిపాదిత ఏఐఐబీని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గతేడాది ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్ సహా 26 దేశాలు ఇందులో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి. బీజింగ్ కేంద్రంగా ఈ ఏడాది ఆఖరు నాటికి క్రియాశీలకంగా ఇది పనిచేయడం మొదలుపెట్టనుంది. ఈ బ్యాంకు పారదర్శకతపై అమెరికా సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ..పాశ్చాత్య దేశాల నుంచి ముందుగా బ్రిటన్ ఇందులో చేరింది. బ్యాంకులో చేరడానికి దరఖాస్తులు చేసుకునేందుకు మార్చి 31 ఆఖరు తేదీగా చైనా ఆర్థిక మంత్రి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మరో మూడు దేశాలు చేరాయి. ఆస్ట్రేలియా కూడా చేరడంపై ఆసక్తిగా ఉంది. ఏఐఐబీ అనేది ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు(ఏడీబీ) సహాయకారిగా మాత్రమే ఉంటుందే తప్ప పోటీ బ్యాంకు కాబోదని చైనా పేర్కొంది. -
ఆసియా ఇన్ఫ్రా బ్యాంక్ ఆవిర్భావం
ప్రపంచ బ్యాంక్, ఐఎంఎఫ్‌ల పెత్తనానికి చెక్..! * బీజింగ్ కేంద్రంగా ఏర్పాటు; వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు * భారత్, చైనాతో పాటు మరో 19 దేశాలకు సభ్యత్వం... * అవగాహన ఒప్పందంపై సంతకాలు * అధీకృత మూలధనం 100 బిలియన్ డాలర్లు... బీజింగ్: అమెరికా, ఇతరత్రా పశ్చిమ దేశాల కనుసన్నల్లో పనిచేస్తున్న ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్య నిధి(ఐఎంఎఫ్) పెత్తనానికి చెక్ చెప్పేవిధంగా ఆసియాలో కొత్త బ్యాంకు ఆవిర్భవించింది. ఈ ప్రాంతంలోని దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధులందించే లక్ష్యంతో ఆసియా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్(ఏఐఐబీ) శుక్రవారం ఏర్పాటైంది. చైనా నేతృత్వంలో బీజింగ్ కేంద్రంగా నెలకొల్పనున్న ఏఐఐబీ కోసం అవగాహన ఒప్పందాల(ఎంఓయూ)పై చైనా, భారత్‌తో పాటు మరో 19 దేశాలు సంతకాలు చేశాయి. ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకులకు పోటీగా... వాటిపై ఆధారపడటాన్ని తగ్గించుకోవడం కూడా దీని ప్రధానోద్దేశంగా భావిస్తున్నారు. ఇక్కడి ‘గ్రేట్ హాల్ ఆఫ్ ద పీపుల్’లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఏఐఐబీ ఏర్పాటుకు శ్రీకారంచుట్టారు. భారత్ తరఫున ఆర్థిక మంత్రిత్వ శాఖలోని ఆర్థిక వ్యవహారాల విభాగం జాయింట్ సెక్రటరీ ఉషా టైటస్ ఈ ఎంఓయూపై సంతకాలు చేశారు. విధివిధానాలు త్వరలో ఖరారు... ఏఐఐబీ వచ్చే ఏడాది నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుంది. 100 బిలియన్ డాలర్ల(సుమారు రూ.6.1 లక్షల కోట్లు) అధీకృత మూలధనంతో ఇది ఏర్పాటవుతుందని ఎంఓయూలో పేర్కొన్నారు. ప్రాథమిక వినియోగ మూలధనం 50 బిలియన్ డాలర్లు ఉండొచ్చని అంచనా. చైనా ఆర్థిక శాఖ ఉప మంత్రి జిన్ లిక్వన్ ఏఐఐబీకి తొలి సెక్రటరీ జనరల్‌గా వ్యవహరించనున్నారు. ఆసియా అభివృద్ధి బ్యాంక్(ఏడీబీ) వైస్ ప్రెసిడెంట్‌గా కూడా ఆయన గతంలో పనిచేశారు. సభ్య దేశాలతో సంప్రదింపుల తర్వాత ఓటింగ్ హక్కులు, ఇతర ప్రామాణిక అంశాలపై నిర్ణయం తీసుకోనున్నారు. జీడీజీ, ప్రజల కొనుగోలు శక్తి(పర్చేజింగ్ పవర్ పారిటీ-పీపీ) ఆధారంగా వీటిని ఖరారు చేయనున్నారు. దీనిప్రకారం చూస్తే భారత్‌కు ఏఐఐబీలో చైనా తర్వాత రెండో అతిపెద్ద వాటాదారు కానుంది. ఈ కొత్త బ్యాంకు కారణంగా ఆసియా ప్రాంతంలోని దేశాలకు మౌలిక సదుపాయాల అభివృద్ధికి నిధుల లభ్యత పెరగనుందని ఉషా టైటస్ పేర్కొన్నారు. ఇటీవల బ్రెజిల్లో బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత్ ప్రధాని మోదీతో భేటీ అయిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఏఐఐబీలో సభ్యత్వానికి ఇండిమాను ఆహ్వానించారు. భారత్, చైనాలతో పాటు ఏఐఐబీలో వియత్నాం, ఉజ్జెకిస్థాన్, థాయ్‌లాండ్, శ్రీలంక, సింగపూర్, ఖతార్, ఒమన్, ఫిలిప్పైన్స్, పాకిస్థాన్, నేపాల్, బంగ్లాదేశ్, బ్రూనై, కంబోడియా, కజకిస్థాన్, కువైట్, లావో పీడీఆర్, మలేసియా, మంగోలియా, మయన్మార్లు వ్యవస్థాపక సభ్య దేశాలుగా చేరాయి. అయితే, ఏడీబీలో ప్రధాన భూమిక పోషిస్తున్న జపాన్‌తో పాటు దక్షిణకొరియా, ఇండోనేసియా, ఆస్ట్రేలియాలు కూడా ఏఐఐబీకి దూరంగా ఉన్నాయి. ప్రధానంగా అమెరికా ఒత్తిడే దీనికి కారణమని పరిశీలకులు భావిస్తున్నారు. కార్పొరేట్లు హర్షం... ఏఐఐబీలో భారత్ సభ్యదేశంగా చేరడాన్ని భారత కార్పొరేట్ రంగం స్వాగతించింది. దీనివల్ల మౌలిక సదుపాయాలకు, నిధుల కొరతకు కొంత పరిష్కారం లభిస్తుందని ఫిక్కీ సెక్రటరీ జనరల్ దిదార్ సింగ్ పేర్కొన్నారు. ఆసియాలో మౌలిక సదుపాయాల కోసం వచ్చే పదేళ్లలో సుమారు 8 ట్రిలియన్ డాలర్ల మేర నిధులు అవసరమవుతాయని అంచనా. ఒక్క భారత్‌కే ట్రిలియన్ డాలర్లు(దాదాపు రూ.61 లక్షల కోట్లు) అవసరమని భావిస్తున్నారు. బ్రిక్స్ బ్యాంకుకు అదనంగా... వర్ధమాన దిగ్గజ దేశాల కూటమి బ్రిక్స్(బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, దక్షిణాఫ్రికా) మౌలిక నిధుల కల్పన కోసం బ్రిక్స్ బ్యాంకును ఏర్పాటు చేయాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఇది కూడా చైనాలోని షాంఘై కేంద్రంగానే ఏర్పాటు కానుంది. దీని మొదటి అధ్యక్ష పదవి కూడా భారత్‌కే లభించనుంది. ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్‌లకు పోటీగానే బ్రిక్స్ బ్యాంకు ఏర్పాటు చేస్తున్నారంటూ ఇప్పటికే పశ్చిమ దేశాల్లో విమర్శలు కూడా వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కొత్తగా ఏఐఐబీ ఆవిర్భావం జరగడం విశేషం. కాగా, ఎంఓయూపై సంతకాల అనంతరం సభ్య దేశాల ప్రతినిధులతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సమావేశమయ్యారు. ఏఐఐబీ ఏర్పాటును అత్యంత కీలక ముందడుగుగా ఆయన అభివర్ణించారు. ‘సంపన్నులు కావాలంటే మంచి ‘రహదారులు’ నిర్మించుకోవాలన్నది చైనాలో సామెత. ఇప్పుడు ఏఐఐబీ ఏర్పాటు వెనుక ప్రధానోద్దేశం కూడా ఇదే. ఆసియా దేశాల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధిని ప్రోత్సహించడం, తద్వారా ఆర్థిక వ్యవస్థలు పరుగులు తీయాలన్న సంకల్పంతోనే ఈ బ్యాంకును నెలకొల్పుతున్నాం’ అని జిన్‌పింగ్ వ్యాఖ్యానించారు. ఒక్క ఆసియా నుంచే కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన దేశాలను కూడా దీనిలో భాగస్వామ్యానికి ఆహ్వానిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఏడీబీ తదితర బహుళజాతి ఆర్థిక సంస్థల నుంచి నిర్వహణ నైపుణ్యాలు, అనుభవాలను ఏఐఐబీకి వినియోగించుకుంటామన్నారు. కాగా, ఈ కొత్త బ్యాంకుతో తమకు ఎలాంటి ముప్పూ ఉండబోదని ఏడీబీ ప్రెసిడెంట్ తకెహికో నకావో బీజింగ్‌లో వ్యాఖ్యానించారు.