సాక్షి, అమరావతి: ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ) సహాయంతో చేపట్టిన ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల నాణ్యతపై ఆ బ్యాంకు ప్రతినిధి బృందం పూర్తి సంతృప్తిని వ్యక్తం చేసింది. తమ బ్యాంకు సహాయంతో చేపట్టిన ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది. ఈ మేరకు బ్యాంకు ఇంప్లిమెంటేషన్ సపోర్టు మిషన్ బృందం 5 రోజులపాటు ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లో ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనులు జరుగుతున్న ప్రాంతాల్లో పర్యటించింది.
జిల్లా స్థాయి పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లతో సమావేశమై పనుల ప్రగతిని, నాణ్యతను పరిశీలించింది. తదనంతరం మంగళవారం విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డితో ఈ బృందం సమావేశమైంది. రాష్ట్రంలో జరుగుతున్న ఏపీ రూరల్ రోడ్డు ప్రాజెక్టు పనుల ప్రగతిని వివరించి పనులపై పూర్తి సంతృప్తిని వ్యక్తం చేయడంతోపాటు తమ బ్యాంకు ఆర్థిక సహాయంతో జరుగుతున్న గ్రామీణ రహదారి పనుల్లో నాణ్యతతో కూడిన ఒక ఉత్తమ ప్రాజెక్టుగా కితాబిచ్చింది.
రూ.5,026 కోట్లతో పనులు
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో గ్రామీణ ఆవాసాలకు మెరుగైన రహదారి సౌకర్యాలను కల్పించడంతోపాటు పశ్చిమ గోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో దెబ్బతిన్న గ్రామీణ రహదారుల మరమ్మతుల కోసం ఏషియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకు రుణ సహాయంతో ఏపీ రూరల్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. మొత్తం ప్రాజెక్టు విలువ రూ.5,026 కోట్లు కాగా.. ఏఐఐబీ రూ.3,418 కోట్లను రుణంగా అందిస్తోంది.
రాష్ట్ర ప్రభుత్వం రూ.1,608 కోట్లను సమకూరుస్తోంది. ఈ ప్రాజెక్టు కింద మొత్తం 3,665 పనులు చేపట్టి 7,213 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం, మరమ్మతు పనులు చేపట్టారు. ఇప్పటికే కాంపొనెంట్–1ఏ కింద 6,215 కిలోమీటర్ల పొడవున 3,231 పనులు చేపట్టగా.. ఇప్పటికే 2,450 కి.మీ. పొడవు గల 1,201 పనులు పూర్తయ్యాయి. మరో 3,765 కి.మీ. పొడవు గల 2,030 పనులు ప్రగతిలో ఉన్నాయి.
కాంపొనెంట్–1బీ కింద 364 కి.మీ. పొడవు గల 142 పనులు చేపట్టగా.. వివిధ దశల్లో ప్రగతిలో ఉన్నట్టు పంచాయతీరాజ్ శాఖ ఇంజినీర్లు వివరించారు. సమావేశంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బి.రాజశేఖర్, ఆర్థిక శాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, రాష్ట్ర పాఠశాల విద్యశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్, పంచాయతీరాజ్ ఈఎన్‌సీ బాలూనాయక్, ఏఐఐబీ ప్రతినిధి బృందం లీడర్ ఫర్హద్ అహ్మద్, సీనియర్ కన్సల్టెంట్ అశోక్‌కుమార్, పర్యావరణ, సోషల్ ఎక్స్‌పర్ట్ శివ, ఫైనాన్సియల్ ఎక్స్‌పర్ట్ ప్రదీప్, ట్రాన్స్‌పోర్ట్ ఇన్వెస్ట్‌మెంట్ అసోసియేట్ తౌషిక్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment