ఆసియా ఇన్‌ఫ్రా బ్యాంకులో మరో 3 దేశాలు
బీజింగ్: ఆసియా దేశాల్లో మౌలిక రంగ ప్రాజెక్టులకు నిధులు సమకూర్చడానికి ఉద్దేశించిన ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (ఏఐఐబీ)లో తాజాగా ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ చేరాయి. దీంతో చైనా సారథ్యంలోని ఏఐఐబీలో భారత్ సహా సభ్య దేశాల సంఖ్య 30కి చేరింది. 50 బిలియన్ డాలర్లతో ప్రతిపాదిత ఏఐఐబీని చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ గతేడాది ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. భారత్ సహా 26 దేశాలు ఇందులో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నాయి.
బీజింగ్ కేంద్రంగా ఈ ఏడాది ఆఖరు నాటికి క్రియాశీలకంగా ఇది పనిచేయడం మొదలుపెట్టనుంది. ఈ బ్యాంకు పారదర్శకతపై అమెరికా సందేహాలు వ్యక్తం చేసినప్పటికీ ..పాశ్చాత్య దేశాల నుంచి ముందుగా బ్రిటన్ ఇందులో చేరింది. బ్యాంకులో చేరడానికి దరఖాస్తులు చేసుకునేందుకు మార్చి 31 ఆఖరు తేదీగా చైనా ఆర్థిక మంత్రి ఇటీవలే ప్రకటించిన నేపథ్యంలో తాజాగా మరో మూడు దేశాలు చేరాయి. ఆస్ట్రేలియా కూడా చేరడంపై ఆసక్తిగా ఉంది. ఏఐఐబీ అనేది ప్రపంచ బ్యాంకు, ఆసియా అభివృద్ధి బ్యాంకులకు(ఏడీబీ) సహాయకారిగా మాత్రమే ఉంటుందే తప్ప పోటీ బ్యాంకు కాబోదని చైనా పేర్కొంది.