సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం చేయూత
35 శాతం సబ్సిడీతో గరిష్టంగా రూ.10 లక్షల వరకు ఆర్థిక సాయం
వ్యక్తిగత, ఎఫ్‌పీఓ, స్వయం సహాయక సంఘాలకు ప్రోత్సాహం
మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు
రూ.300 కోట్లకు పైగా రుణాలందించిన రాష్ట్ర ప్రభుత్వం
సాక్షి, అమరావతి: గ్రామీణ స్థాయిలో సూక్ష్మ ఆహార శుద్ధి పరిశ్రమలకు ఆర్థిక తోడ్పాటు ఇవ్వడంలో రాష్ట్ర ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచింది. తద్వారా ఊరూరా ఉపాధి కల్పించేందుకు బాటలు వేస్తోంది. చిన్నపాటి వ్యాపారాలు చేసుకుంటూ.. పదిమందికి ఉపాధి కల్పిస్తూ గ్రామీణ ఆర్థికాభివృద్ధికి తోడ్పాటు అందిస్తున్న ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు పెద్దఎత్తున ప్రోత్సాహం అందిస్తోంది.
ఈ తరహా పరిశ్రమలు దేశవ్యాప్తంగా 25 లక్షలకు పైగా ఉంటే.. మన రాష్ట్రంలో 2 లక్షలకు పైగా ఉన్నాయి. వీటిని ఆధునికీకరించేందుకు అవసరమైన తోడ్పాటు ఇవ్వడమే కాకుండా కొత్తగా ఈ రంగంలోకి వచ్చే వారిని ప్రోత్సహించే కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ‘వన్ డి్రస్టిక్ట్.. వన్ ప్రోడక్ట్’ కింద జిల్లాకో ఉత్పత్తిని ఎంపిక చేసి.. ఆ ఉత్పత్తికి సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహిస్తోంది.
ప్రధాన మంత్రి ఫార్మలైజేషన్ మైక్రో ఫుడ్ ప్రోసెసింగ్ ఎంటర్‌ప్రైజస్ (పీఎం ఎఫ్‌ఎంఈ)ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60:40 నిష్పత్తితో ఆర్థిక చేయూత ఇస్తున్నాయి. 2021లో ప్రారంభించిన ఈ పథకం కింద ఐదేళ్లలో రూ.460 కోట్ల ఆర్థిక చేయూతతో 10 వేల యూనిట్లు ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. మూడేళ్లలో 3,843 పరిశ్రమలకు రూ.300 కోట్లకు పైగా ఆర్థిక చేయూత అందింది.
రూ.10 లక్షల వరకు చేయూత
వ్యక్తిగత కేటగిరీతో పాటు వ్యవసాయ సహకార సంఘాలు (ఎఫ్‌పీఓ), ఉత్పత్తిదారుల సంఘాలు (పీఓ), స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు గరిష్టంగా రూ.10 లక్షల వరకు రుణ అనుసంధాన గ్రాంట్ మంజూరు చేశారు. పచ్చళ్లు, తినుబండారాలు తయారు చేస్తూ జీవనోపాధి పొందే ఎస్‌హెచ్‌జీల్లోని çసభ్యులకు రూ.40 వేల వరకు సీడ్ క్యాపిటల్ కింద అందించారు. వ్యక్తిగత కేటగిరీలో ప్రాజెక్టు వ్యయంలో 35 శాతం వరకు రుణ అనుసంధాన రాయితీ (క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ) గరిష్టంగా రూ.10 లక్షల వరకు అందించారు. ఇందులో 10 శాతం లబ్దిదారు భరిస్తే మిగిలిన 55 శాతం బ్యాంకుల నుంచి రుణాల రూపంలో అందించారు.
కల్పించిన సౌకర్యాలివే..
ఈ స్కీమ్ కింద పొందే రుణాలతో కామన్ ప్రోసెసింగ్ ఫెసిలిటీ కింద వ్యవసాయ ఉత్పత్తులను సారి్టంగ్, గ్రేడింగ్, గోడౌన్లు, కోల్డ్ స్టోరేజ్ వంటి సౌకర్యాలతోపాటు ఉత్పత్తులను ప్రోసెస్ చేయడానికి ఇంక్యుబేషన్ సెంటర్, ప్రయోగశాలలు అందుబాటులోకి తీసుకొచ్చారు.
కెపాసిటీ బిల్డింగ్‌లో భాగంగా 9 కేటగిరీల్లో ఫుడ్ ప్రోసెసింగ్ టెక్నాలజీలు, తయారీ పద్ధతులు, ఆహార ప్రమాణాలు, నిబంధనలు, ఫుడ్ లైసెన్సింగ్ వంటి వాటిపై నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. మనుగడలో ఉన్న పరిశ్రమల క్రమబద్దీకరణతోపాటు మార్కెటింగ్, బ్రాండింగ్‌లో శిక్షణ, రిటైల్ సంస్థలతో వాణిజ్య ఒప్పందాలు చేసుకోవడంలో చేయూత ఇచ్చారు. బ్రాండింగ్ ఉత్పత్తుల ద్వారా మెరుగైన వాణిజ్యానికి సహకారం అందించారు.
యంత్రాలు కొన్నాం
మాది గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్. మసాలా దినుసులు తయారు చేస్తాం. పరిశ్రమను విస్తరించాలనుకున్నాం. కరోనా వల్ల వెనక్కి తగ్గాం. ఆ సమయంలో ఉద్యాన శాఖ అధికారులొచ్చి ఈ స్కీమ్ గురించి చెప్పారు. దగ్గరుండి దరఖాస్తు చేయించారు. 35 శాతం సబ్సిడీతో రూ.30 లక్షల రుణం తీసుకున్నాం. కొత్త యంత్రాలు కొనుగోలు చేశా. వ్యాపార విస్తరణకు ఇది ఎంతగానో దోహదపడింది. – బలుసు వీణ, గృహలక్ష్మి ఫుడ్ ఇండస్ట్రీస్, కడప
జీడిపప్పు వ్యాపారానికి చేయూత
కొన్నేళ్లుగా జీడిపప్పు వ్యాపారం చేస్తున్నాం. మెషినరీ కొనుగోలు కోసం ఆలోచిస్తున్న సమయంలో రాష్ట్ర ప్రభుత్వం 35 శాతం సబ్సిడీతో రూ.7.50 లక్షల రుణం మంజూరు చేసింది. ఈ మొత్తం పరిశ్రమకు అవసరమైన మెషినరీ కొనుగోలుకు ఉపయోగపడింది. – మణిదేవి, వజ్జిలపేట, తూర్పు గోదావరి జిల్లా
పప్పు పరిశ్రమకు విస్తరించాం
పప్పు ప్రోసెస్ చేసి మార్కెట్‌లోకి తీసుకెళ్తాం. వ్యాపారం విస్తరించుకోవాలని అనుకున్నాం. ఆర్థిక పరిస్థితి సహకరించలేదు. పీఎంఎఫ్‌ఎ స్కీమ్ కింద దరఖాస్తు చేశాం. రూ.28 లక్షల రుణమిచ్చారు. మెషినరీ కొనుగోలుతోపాటు వ్యాపారాన్ని మరింత విస్తరించుకోగలిగాం. – జోడు లక్ష్మీదేవి, ప్రొద్దుటూరు
Comments
Please login to add a commentAdd a comment