animals death
-
వణికిస్తున్న లంపీ ముప్పు.. రోజుకు 600–700 ఆవులు మృత్యువాత
దేశంలో కొద్ది నెలలుగా మరో వైరస్ పేరు మారుమోగుతోంది. పాడి పశువుల్లో ఈ వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తోంది. అదే లంపీ స్కిన్ వ్యాధి (ఎల్ఎస్డీ). కాప్రిపాక్స్ అని పిలిచే ఈ వైరస్ ఆవులు, గేదెలకు సోకుతోంది. ఈ ఏప్రిల్‌లో గుజరాత్‌లోని కచ్‌లో తొలిసారి ఇది బయటపడింది. రాజస్తాన్, మహారాష్ట్ర, పంజాబ్, హరియాణా, యూపీ సహా పలు రాష్ట్రాలకు విస్తరించింది. దేశవ్యాప్తంగా ఇప్పటికే 70 వేల పశువులు మరణించాయి. మరో 15 లక్షల పశువులకు వైరస్ సోకింది. ఈ అంటువ్యాధి మరింత విస్తరిస్తే దేశ పాడిపరిశ్రమకే తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళనలున్నాయి. రాజస్తాన్‌లో పశువులపై తీవ్ర ప్రభావం లంపీ స్కిన్ వ్యాధి రాజస్తాన్‌లో ప్రమాదఘంటికలు మోగిస్తోంది. వ్యాధితో రాష్ట్రంలోనే ఏకంగా 57,000 ఆవులు మరణించగా, మరో 11 లక్షల ఆవులు దీని బారిన పడ్డాయి. రోజుకి సగటున 600–700 ఆవులు మరణిస్తున్నాయి. ఈ వ్యాధి కారణంగా పాల ఉత్పత్తి 15–18 శాతం తగ్గిపోయింది. దీంతో పాలు, వాటితో తయారు చేసే స్వీట్ల ధరలు బాగా పెరిగిపోయాయి. రోజుకు 5–6 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి తగ్గిపోయిందని రాజస్థాన్ కో ఆపరేటివ్ డెయిరీ వెల్లడించింది. రాజస్తాన్ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తతలు ఈ వ్యాధి నివారణకు రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టడం లేదంటూ భారతీయ జనతా పార్టీ మంగళవారం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించింది. ఈ సందర్భంగా నిరసనకారులు, పోలీసుల మధ్య ఘర్షణాత్మక వాతావరణం నెలకొంది. అసెంబ్లీ ముట్టడికి భారీ సంఖ్యలో తరలివచ్చిన బీజేపీ కార్యకర్తల్ని పోలీసులు అడ్డుకున్నారు. కానీ నిరసనకారులు బారికేడ్లు దూకి మరీ అసెంబ్లీలోకి చొచ్చుకుపోవడానికి ప్రయత్నించారు. దీంతో చాలా సేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఒక బీజేపీ ఎమ్మెల్యే ఈ వ్యాధి తీవ్రత గురించి అందరికీ తెలియజేయడానికి సోమవారం అసెంబ్లీ ప్రాంగణంలోకి ఒక ఆవుని కూడా తోలుకొని వచ్చారు. వ్యాధి సోకిన పశువులకి రాష్ట్ర ప్రభుత్వం రూ.50 వేలు నష్టపరిహారం చెల్లించాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సతీశ్ పూనియా డిమాండ్ చేశారు. మరోవైపు దీనిపై కేంద్రమే స్పందించాలని రాజస్తాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ డిమాండ్ చేస్తున్నారు. దాదాపుగా 13 రాష్ట్రాల్లో పశువులకి ఈ వ్యాధి సోకడం వల్ల జాతీయ విపత్తుగా ప్రకటించి రాష్ట్రానికి సాయం అందించాలన్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఏమిటీ వైరస్? దోమలు, ఈగలు, పేలు మరికొన్ని కీటకాల ద్వారా ఈ వ్యాధి సంక్రమిస్తుంది. ఇది గోటోపాక్స్, షీప్ పాక్స్ కుటుంబానికి చెందిన వైరస్. ఈ వ్యాధితో పశువులకు జ్వరం సోకడంతో పాటు వాటి చర్మంపై గడ్డలు ఏర్పడతాయి. ఈ వైరస్ సోకితే పశువులు ఆహారం తీసుకోలేవు. అధికంగా లాలాజలం ఊరి నోట్లో నుంచి బయటకు వస్తుంది. ముక్కు, కళ్లల్లోంచి కూడా స్రవాలు బయటకి వస్తాయి. కొన్నాళ్లకే పశువులు బరువును కోల్పోవడం, పాల దిగుబడి తగ్గిపోవడం జరుగుతోంది.ఈ వైరస్‌కు ఎలాంటి చికిత్స లేకపోవడంతో ఎన్నో పశువులు మృత్యువాత పడుతున్నాయి. పశువుల్లో ప్రాణాంతకంగా మారిన ఈ వైరస్ సోకిన జంతువులకు పశు వైద్యులు ప్రస్తుతానికి యాంటీబయోటిక్స్ ఇస్తూ ఉపశమనం కలిగిస్తున్నారు. మనుషులకు సోకదు లంపీ స్కిన్ వ్యాధి మనుషులకి సోకే అవకాశం ఎంత మాత్రం లేదదిది జూనోటిక్ (మనుషులకు సంక్రమించదు) వైరస్ కాదని, మనుషులకు సోకదని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ఐవీ) నిపుణులు వెల్లడించారు. వ్యాధి సోకిన ఆవుల పాలను నిర్భయంగా తాగవచ్చునని మనుషులకు ఎలాంటి ముప్పు లేదని చెబుతున్నారు. పరిష్కారమేంటి? ప్రస్తుతానికి ఈ వ్యాధి మరింత విస్తరించకుండా రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలు బాధ్యత తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. రైతులు, పశుపోషకుల్లో ఈ వ్యాధిపై అవగాహన పెరిగేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని, కేంద్రం రాష్ట్రాల పశుసంవర్ధక శాఖలకు ఆదేశాలు జారీ చేసింది. ఇరుగు పొరుగు రాష్ట్రాలకు కొన్నాళ్లు పాటు పశువుల్ని వేరే రాష్ట్రాలకు తరలించవద్దని సూచించింది. గోట్‌పాక్స్ వైరస్ నిరోధక వ్యాక్సిన్ దీనినీ అరికడుతుందని నిపుణులు చెప్పడంతో ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 1.5 కోట్లను ఈ వైరస్ ఉన్న ప్రాంతాలకు పంపిణీ చేశారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్), ఇండియన్ వెటర్నరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఐబీఆర్‌ఐ) సంయుక్తంగా లంపీ స్కిన్ వ్యాధికి వ్యాక్సిన్ కనుగొన్నారు. అయితే ఇది అందుబాటులోకి రావడానికి మరో మూడు నాలుగు నెలలు పడుతుంది. దేశంలోని పశువులన్నింటికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే 18–20 టీకా డోసులు అవసరం. దేశంలోని పశువులకి 80శాతం వ్యాక్సినేషన్ పూర్తి అయితేనే ఈ వ్యాధి ముప్పు నుంచి బయటపడతామని ఏనిమల్ సైన్సెస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ బి.ఎన్. త్రిపాఠి అభిప్రాయపడ్డారు. 2025 నాటికి వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి అవుతుందని కేంద్రం అంచనా వేస్తోంది. -
వికారాబాద్ జిల్లాలో కొత్త రకం వైరస్ కలకలం
సాక్షి, వికారాబాద్: జిల్లాలో కొత్తరకం వైరస్ మూగ జీవుల ఉసురు తీస్తోంది. ఈ మహమ్మారి ఎంటో వైద్యులకు కూడా అంతుచిక్కకపోవడంతో పశువులకు సరైన వైద్యం అందించలేకపోతున్నారు. దీంతో పశువులు ప్రాణాలు కోల్పోతున్నాయి. పశువుల చర్మంపై చిన్న చిన్న రంధ్రాలు పడి రక్తం కారుతుండటంతో వాటిని ముట్టుకోవడానికి కూడా రైతులు భయపడుతున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 300 పైగా పశువులకు ఈ వింత రోగం సోకడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఈ మాయదారి మహమ్మారి నుంచి పశువులను రక్షించుకునేందుకు రైతులు ప్రైవేటు మెడికల్ షాపుల్లో వేలకు వేల రూపాయలను ఖర్చు పెడుతున్నారు. అయినా ఫలితం దక్కడం లేదు. ఇక ఇది రోగమా? వైరస్ అనేది తెలియక పశువైద్యులు పరెషాన్ అవుతున్నారు. ప్రస్తుతం వైద్యులు పశువులకు గోట్ పాక్స్ వ్యాక్సిన్ ఇచ్చి సరిపెడుతున్నారు. అయితే ఈ మాయదారి రోగం ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నట్లు పశు వైద్యులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
కొత్త రకమైన వైరస్ విజృంభిస్తోంది..!
వనపర్తి/మదనాపురం: జిల్లా వ్యాప్తంగా మూగజీవాలను కొత్త రకమైన వైరస్ వెంటాడుతోంది. కేవలం తెల్ల పశువులకే సోకుతున్న ఈ వైరస్ లంపి స్కిన్‌గా ఇటీవలె పశుసంవర్ధకశాఖ అధికారులు నిర్ధారించారు. ఇదివరకే ఈ విషయంపై రాష్ట్రస్థాయి అధికారులు జిల్లాలో పర్యటించి నమూనాలు సేకరించి ఇది కౌ ఫాక్స్ వైరస్ లాంటిదేనని, కానీ రాష్ట్రంలో కొత్తగా బయటపడినట్లు రాష్ట్ర స్థాయి అధికారులు వెల్లడించారు. వైరస్ సోకిన పశువుల్లో దద్దుర్ల తీవ్రత ఎక్కువగా ఉంటే తప్పా మరణాలు సంభవించవని ప్రకటించారు. ఇటీవల మదనాపురం మండలం అజ్జకోలులో వారం రోజుల్లో రూ.లక్షలు విలువ చేసే ఏడు పశువులు మృతి చెందటం, మరో మూడు పశువులు గత పదిహేను గంటలుగా మృత్యువుతో పోరాడటం చర్చనీయాంశంగా మారింది. అయితే, అజ్జకోలులోని బాధిత రైతులు మా పశువులు వైరస్ వలన చనిపోలేదని, పశువైద్యులు ఇచ్చిన అధిక మోతాదు మందుల వల్లనే చనిపోయాయని ఆరోపించడం గమనార్హం. లాక్‌డౌన్‌కు ముందు నుంచే.. జిల్లాలోని పెబ్బేర్, ఖిల్లాఘనపురం, పెద్దమందడి, మదనాపురం, కొత్తకోట, పాన్‌గల్ తదితర ప్రాంతాల్లో ఈ వైరస్ భారిన పశువులు పడినట్లు వైద్యాధికారుల నివేదిక ద్వారా వెల్లడవుతోంది. ఇప్పటి వరకు లంపి స్కిన్ వైరస్ భారిన జిల్లా వ్యాప్తంగా సుమారు 3,500 పశువులు పడినట్లు అధికారులు వెల్లడించారు. కౌ ఫాక్స్ తరహాలోని ఈ వైరస్ సోకిన పశువుల్లో వంటిపై దద్దుర్లు, గొంతువాపు, ఆయాసం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ విషయంపై ఇదివరకే జిల్లా పశుసంవర్ధకశాఖఅధికారులు స్పందించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారు జిల్లాలోని పలు ప్రాంతాల్లో పర్యటించి పశువుల నుంచి రక్తం, మలమూత్రాల శాంపిల్స్ సేకరించి పరీక్షలు చేసి లంపి స్కిన్ వైరస్ అని నిర్ధారించారు. ఒక దాని నుంచి మరో దానికి వ్యాప్తి.. తాజాగా జిల్లాలోని మదనాపురం మండలం అజ్జకొల్లులో రాజవర్ధన్‌రెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, బాలరాజు రైతులకు చెందిన పశువుల్లో కొన్నింటికీ లంపీ స్కిన్ వైరస్ సోకింది. దీంతో కొత్తకోట పశువైద్యాధికారి డాక్టర్ విజయ్‌కుమార్ పెన్సిలిన్తో పాటు ఐసోప్లడ్ ఇంజక్షన్, గ్లూకోజ్ ఇచ్చాడు. అనంతరం మూడు రోజుల అనంతరం మొత్తం ఆరు పశువులతోపాటు ఒక కోడె సైతం మృతిచెందాయి. మరికొన్ని మృత్యువుతో పోరాడుతుండగా.. జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి వెంకటేశ్వర్లు, కొత్తకోట పశువైద్యుడు విజయ్‌కుమార్ అజ్జకొల్లుకు చేరుకొని వాటికి చికిత్స అందించారు. రాష్ట్ర బృందం పరిశీలన పశువుల మృతి నేపథ్యంలో తెలంగాణ స్టేట్ వెటర్నరి అండ్ బయోలాజికల్ రిసర్చ్ ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్తలు డాక్టర్ దేవేందర్‌రావు, డాక్టర్ యం. కళ్యాణి వారి బృందంతో కలిసి శుక్రవారం అజ్జకొల్లును సందర్శించి మృత్యువుతో పోరాడుతున్న పశువులను పరిశీలించారు. వాటి నుంచి మలమూత్రం, రక్తంతో పాటు లాలాజలం నమూనాలను సేకరించారు. అలాగే, మృతి చెందిన పశువుకు పోస్టుమార్టం నిర్వహించి కొన్ని నమూనాలను సేకరించారు. వీటిని హైదరాబాద్ ల్యాబ్‌లో పరీక్షించి పశువులు మృతి చెందటానికి గల కారణం వైరస్.. లేక హై డోస్ మెడిసిన్ ఇవ్వటం వలనా అనే విషయం వెల్లడిస్తామన్నారు. ఈ వైరస్‌కు మందు లేదు జిల్లాలో చాలా ప్రాంతాల్లో పశువులకు లంపీ స్కిన్ వైరస్ సోకింది. ఈ వైరస్‌కు మందు లేదు. ఉన్న మెడిసిన్ వాడుతూ.. పశువులను కాపాడే ప్రయత్నం చేస్తున్నాం. ఇక్కడా అదే విధంగా మా వైద్యులు ప్రయత్నం చేశారు. రాష్ట్ర స్థాయి బృందం వైరస్ భారిన పడిన పశువుల నమూనాలు సేకరించారు. ల్యాబ్‌లో పరీక్షించి మృతికి గల కారణాలను త్వరలో వెల్లడిస్తారు. – డాక్టర్ వెంకటేశ్వర్‌రెడ్డి, జిల్లా పశుసంవర్ధకశాఖ అధికారి, వనపర్తి మా పశువులకు నయం అయ్యింది గత కొన్ని రోజుల క్రితం నాకు ఉన్న పదహారు పశువులకు గొంతు వాపు, వల్లు దుదు ర్లు వస్తే.. అజ్జకోలు స బ్ సెంటర్లో ఉండే సి బ్బంది దృష్టికి తీసుకువెళ్లా. మెరిక్వీన్, అస్రోప్లడ్ అనే మందు రాసిచ్చారు. కొని వా డితే తగ్గింది. మరీ మా గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు, మరో వ్యక్తి పశువులకు ఎందుకు మృతి చెందాయో తెలియదు. నా పశువులు ప్రస్తుతం ఆరోగ్యంగా ఉన్నాయి. – సంజీవకుంట వెంకటేష్, అజ్జకోలు -
వేట ఆగేదెప్పుడు?
సాక్షి, కాళేశ్వరం: మహదేవపూర్, పలిమెల మండలాల్లో వన్యప్రాణుల వేట మళ్లీ మొదలైంది. నిత్యం అడవిలోని జీవాలను వేటాడి వేటగాళ్లు చంపుతున్నారు. అడవిని కాపాడే అధికారులే పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా వన్యప్రాణుల వేట కొసాగుతుందని ఆరోపణలు వస్తున్నాయి. వేసవి కాలం కావడంతో అడవి జీవాలు దాహం తీర్చుకునేందుకు అడువుల్లో ఉండే నీటి గుంటల వద్దకు రావడంతో వేటగాళ్లు ఉచ్చులు వేసి పట్టుకుంటున్నారు. విద్యుత్ తీగలు అమర్చి షాక్ ఇచ్చి చంపుతున్నారు. అడవుల్లో ఉండే కుందేలు, దుప్పులు, జింకలతో పాటు అడవిపందులను వేటాడుతున్నారు. ఈ మాంసాన్ని, చర్మాలను ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కిలో రూ. 300.. మామూలుగా మేక మాంసం కంటే అడవి జంతువుల మాంసానికి డిమాండ్ ఎక్కువగా ఉంటోంది. వేటాడిన దుప్పి మాంసాన్ని వేటగాళ్లు మరీ చౌకగా కిలో రూ. 300ల వరకు విక్రయిస్తున్నారు. మహదేవపూర్, పలిమెల అడవి ప్రాంతాల్లో వేటాడిన జంతువుల మాంసం భూపాలపల్లి జిల్లా కేంద్రంతో పాటు మంచిర్యాల, చెన్నూరు వరకు తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఇలా నిత్యం అడవి మాంసాన్ని విక్రయిస్తు వేటగాళ్లు సొమ్ము చేసుకుంటున్న పరిస్థితి ఉంది. వన్యప్రాణుల కనుమరుగు.. ఇలా నిత్యం వేట కొనసాగుతుంటే రాబోయే కా లంలో వన్యప్రాణలు కనుమరుగు అయ్యే పరిస్ధితి నెలకొంది. గతంలో పులులు, ఎలుగుబంట్లు, జింకలు, దుప్పులు, సాంబార్, కుందేళ్ళు, అడవి పందులు గుంపులు గుంపులుగా దర్శనమిచ్చెది. అడవుల్లో వేటగాళ్లు చెలరేగిపోతుండడం, అడవులు పలచబడడంతో వన్యప్రాణుల మనుగడ తగ్గుతూ వస్తోంది. చుట్టపు చూపుగా.. అడవుల్లో ఇంత జరుగుతున్నా అటవీశాఖ అధికా రులు మాత్రం పట్టించుకోవడం లేదు. నిత్యం అ డవులను పర్యవేక్షించాల్సిన అధికారులు చుట్టపు చూపుగా అడవులకు వెళ్తున్న పరిస్థితి ఉంది. అడవులు అంతరించి పోతున్నా అటువైపు చూసిన దాఖలాలు లేవు. కలప సరిహద్దులు దాటుతున్నా, వన్యప్రాణుల ప్రాణాలు గాల్లో కలుస్తున్న పట్టించుకునే వారే కరువయ్యారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నిత్యం పర్యవేక్షిస్తున్నాం.. ప్రతినిత్యం అడవులతో పాటు సిబ్బందిని పర్యవేక్షిస్తున్నాం. విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే ఉపేక్షించేది లేదు. ఇలాంటివి తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటాం. – జగదీశ్వర్‌రెడ్డి, ఎఫ్ఆర్వో -
టీడీపీ సమావేశం.. పాడిరైతుల పాలిట శాపం
సాక్షి, అనంతపురం అర్బన్: టీడీపీ కార్యకర్తల సమావేశం పాడి రైతుల పాలిట శాపంగా మారింది. కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం అక్కడే గుట్టగా వదిలేసి వెళ్లారు. పాడైపోయిన ఆ అన్నాన్ని తిని ఐదు పాడి ఆవులు మృతి చెందాయి. ఈ ఘటన కళ్యాణదుర్గం రోడ్డులోని జొన్నా ఐరెన్ మార్ట్ వెనుక వైపు చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు ఈ నెల 23న వచ్చారు. 24న బళ్లారి రోడ్డులోని వైఎంఆర్ ఫంక్షన్ హాల్లో టీపీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హాల్‌కు కొద్ది దూరంలో కార్యకర్తల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు చేసిన తరువాత మిగిలిన అన్నంను అక్కడే వదిలేసి వెళ్లారు. చెడిపోయిన అన్నం తిని ఐదు ఆవులు చనిపోయాయి. ఇందుకు సంబంధించి వివరాలను బాధితులు నరసింహులు తిరుపతయ్య తెలిపారు. ఫంక్షన్‌హాల్‌కు సమీపంలోని ఒక ఎస్టేట్‌లో నరసింహులు వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు ఒంగోలు, రెండు జెర్సీ అవులను మేపుతున్నాడు. అదే విధంగా తిరుపతయ్య అనే పాడి రైతు ఒక జెర్సీ ఆవును మేపుతున్నాడు. అవి ఈనెల 25న అటుగా వెళ్లి అక్కడున్న అన్నం తిన్నాయి. అక్కడిక్కడే రెండు ఆవులు చనిపోగా మరో మూడు ఆవులు కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవుల కోసం వెళ్లిన రైతులు వాటిని చూసి వెంటనే ట్రాక్టర్లో వాటిని వేసుకొచ్చి తమకు దగ్గరలోని పశువైద్యాధికారి సురేశ్‌కు చెప్పడంతో ఆయన తన కాంపౌండర్ గురుముర్తితో పాటు హుటాహుటిన చేరుకుని చికిత్స అందించారు. అయినా ఆవులు బతకలేదు. రూ.3.50 లక్షలు నష్టపోయాం టీడీపీ సమావేశం కోసం భోజనాలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం అక్కడే వదిలేసి వెళ్లారు. మా ఆవులు గడ్డిమేస్తూ ఆ ప్రాంతానికి వెళ్లి చెడిపోయిన అన్నం తిన్నాయి. పాడైపోయిన అన్నం తినడంతో ఆవులు చనిపోయాయని వైద్యాధికారి చెప్పారు. ఒక్కొక్క ఆవు రూ.70 వేలు విలువ చేస్తుంది. ఐదు ఆవుల విలువ రూ.3.50 లక్షలు. పేదలమైన మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి. – బాధితులు నరసింహులు, తిరుపతయ్య -
ఆగని వేట
జిల్లాలోని అడవుల్లో వన్యప్రాణులు, మృగాలకురక్షణ కరువైంది. వేటగాళ్ల ఉచ్చులకు ఎప్పుడు దేని ప్రాణం పోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. వన్యప్రాణులు జనారణ్యంలో రావడం కాదు.. జనమేఅడవుల్లోకి వెళుతూ వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నారు. జిల్లాలోని పలు అడవుల్లో వన్యప్రాణుల కోసం అమర్చిన ఉచ్చులు, నల్లమందు ఉండలు,అడవిని ఆనుకొని ఉన్న పొలాల్లో కరెంటు తీగలు దర్శనమిస్తున్నాయి. మేతకోసం వెళ్లే మేకలు, పశువులు ఉచ్చులో పడి మృత్యువాత పడుతున్నాయి.పదేళ్లలో నాటు తుపాకుల కాల్పులు, నల్లమందు ఉండలకు బలైన వారు 25మంది పైమాటే.వందలాది పశువులు, మేకలు, కుక్కలు సైతం మృత్యువాత పడ్డాయి.–పలమనేరు అడవిలోకి వెళ్లాలంటే భయం భయం.. ⇔ నాలుగేళ్లలో 12 ఏనుగులు, రెండు చిరుతల మృతి ⇔ 2013 వికోట మండలం నాయకనేరి వద్ద మదపుటేనుగు దాడిలో ఆడ ఏనుగు చనిపోయింది. ⇔ 2013లోనే బైరెడ్డిపల్లె మండలం వెంగవారిపల్లెలో ఓ ఏనుగు మృతి చెందింది. అదే ఏడాది గున్న ఏనుగు మృతిచెందింది. ⇔ 2014లో పలమనేరు మండలం కాలువపల్లె వద్ద నీటిదొనలో పడిన గున్న ఏనుగును తిరుపతి జూకి తరలించగా మృతి చెందింది. ⇔ 2013లో రామకుప్పం మండలం నినియాల తాండాలో విద్యుత్‌షాక్‌కు గురై ఓ ఏనుగు మృతి చెందింది. ⇔ 2015లో రామకుప్పం మండలంలోమరో ఏనుగు మృతి చెందింది. ⇔ 2015లో ఆగస్టులో రామకుప్పం మండలంలో బావిలో పడిన గున్న ఏనుగును తిరుపతి జూకు తరలించగా చనిపోయింది. ⇔ 2015లో రామకుప్పం మండలం పల్లికుప్పం వద్ద ఓ ఏనుగు కరెంట్ షాక్‌తో మృతిచెందింది. ⇔ 2017లో కుప్పం సమీపంలోని తమిళనాడు సరిహద్దులో రెండు ఏనుగులు కరెంటు షాక్‌కు బలయ్యాయి. ⇔ తాజాగా ఎర్రావారిపాళ్యం మండలం కోటకాడిపల్లెవద్ద ఓ ఏనుగు మృతిచెందింది. ⇔ ఈ ఏడాది జనవరిలో బంగారుపాళ్యం మండలం పెరుమాళ్లపల్లె అటవీప్రాంతంలో వేటగాళ్ల ఉచ్చులో చిరుత చిక్కుకుంది. ⇔ మూడు రోజుల క్రితం ఐరాలమండలం మల్లార్లపల్లి వద ⇔ వేటగాళ్ల ఉచ్చులో జింక పడింది. దీన్ని జూకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. శేషాచలంలో 1,700 రకాల జీవులు చిత్తూరు, కడప జిల్లాలో వ్యాపించి ఉన్న శేషాచలం అడవులు 4775 చదరపు కిలోమీటర్ల మేర వ్యాపించి ఉన్నాయి. ఇందులో 178 జాతులకు చెందిన 1700 రకాల జీవులకు నిలయంగా ఉం ది. 178 రకాల పక్షులకు ఈ అడవి ఆవాసం. అలాగే కౌండిన్య అభయారణ్యంలోకి 1983లో తమిళనాడులోని అనెకల్, çహోసూర్, కర్ణాటకలోని మైసూరు, బన్నేరుగట్ట అడవుల నుంచి ఏనుగులు, ఇతర జంతువులు వచ్చి చేరాయి. అడవుల్లో లభించే వెదురు, ఇతర ఆకులు, బెరడు ఆహారంగా తీసుకుంటూ ఇక్కడి అడవుల్లోని చిన్న కుంట లు, చెరువుల్లో నీటిని తాగుతూ ఉంటున్నాయి. ప్రధానంగా కౌండి న్య, కైగల్, పాలారు నదులను ఆనుకుని వీటి జీవనం సాగుతోంది. వన్యప్రాణులకు నిలయం కౌండిన్య జిల్లాలోని పశ్చిమ భాగంలో కౌండిన్య అభయారణ్యం పలు వన్యప్రాణులకు నిలయంగా ఉంది. బంగారుపాళ్యం నుంచి పలమనేరు, కుప్పం ప్రాంతాల్లో అటు తమిళనాడు, ఇటు కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల వరకు సుమారు 357 చదరపు కిలోమీటర్ల మేర ఈ అడవి వ్యాపించి ఉంది. ఈ అడవిలో 39 ఏనుగులు, ఏడు వేలకు పైగా జింకలు, ఎనిమిదివేల దుప్పులు, కణితలు, ఎలుగుబంట్లు, కొన్ని హైనాలు, చీటాలు ఉన్నా యి. అడవి గొర్రెలు, కుందేళ్లు, బావురు పిల్లులు, ఉడుములు, నక్కలు, నెమళ్లు, 40 రకాల క్షీరదాలు,160కి పైగా పలురకాల పక్షులు, అరుదైన కొంగలు, వంద రకాల సీతాకోక చిలుకలు, నక్షత్ర తాబేళ్లు, ఇతర కీటకాలతో పాటు మరికొన్ని జంతువులు ఉన్నాయి. జిల్లాలోని మధ్యప్రాంత అడవుల్లో భాగంగా ఉన్న పెద్ద ఉప్పరపల్లె, సోమల, తుంబకుప్పం, తుంబపాళ్యం అడవుల్లోనూ 300 రకాలకుపైగా వన్యప్రాణులున్నాయి. ఈ ప్రాంతంలో నాలుగు దాకా చీటాలున్నట్టు తెలుస్తోంది. పంథా మార్చిన వేటగాళ్లు అటవీప్రాంత గ్రామాల్లోని కొం దరు వేటగాళ్లు నిత్యం వేట కెళ్లడం జీవనోపాధిగా మార్చుకున్నారు. దీనిపై మూడేళ్ల కిందట దృష్టి సారించిన పోలీసులు పెద్ద సంఖ్యలో నాటు తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. దీంతో వేటగాళ్లు పంథా మార్చారు. పాత వేట పద్ధతులను ఎంచుకున్నారు. నాటు బాంబులను, నల్లమందు ఉండలను అడవిలో పెట్టి వస్తున్నారు. కమ్మీలు, వైర్లతో తయారు చేసిన ఉచ్చులు, ఉరులను పగటి పూట అడవిలో చెట్ల మధ్య అమర్చుతున్నారు. వాటిల్లో ఇరుక్కున్న జం తు వులను అక్కడే చంపి మాంసాన్ని తీస్చుకువస్తున్నారు. ఇది నిత్యం జరుగుతున్న సంఘటనే. నాటు తుపాకి ట్రిగ్గర్‌కు రబ్బర్ బ్యాండ్ కట్టి దానికి దారంతో పది అడగుల పొడవున రెండు అడుగుల ఎత్తులో కట్టడం, పొలాలకు రక్షణ పేరిట కరెంటు లాగడం తదితరాలను చేపడుతున్నారు. వీటితో పశువుల కాపరులు, కలపకోసం వెళ్లే కూలీలు సైతం చనిపోతున్నారు. పదేళ్లలో అడవుల్లోకెళ్లి నాటుతుపాకుల కాల్పులు, నల్లమందు ఉం డలకు బలైన వారు 25మందిపైమాటే. తాజాగా చిత్తూరు సమీపంలోని ఓ చెరుకుతోటలో ఏర్పాటు చేసిన కరెంటు తీగలకు ఇద్దరు బలైన విషయం తెలిసిందే. అటవీశాఖ చట్టం ప్రకారం విద్యుత్ తీగలను అడవులకు సమీప పొలాల్లో కంచెగా ఏర్పాటు చేయకూడదనే నిబంధలున్నాయి. కానీ అధికారులు పట్టించుకోకపోవడంతో జంతువులు, ప్రజల ప్రాణాలు గాల్లో కలుస్తున్నాయి. 15.83 శాతం అడవులు జిల్లా భౌగోళిక అటవీ ప్రాతం 15,151 చదరపు కిలోమీటర్లు. ఇందులో ఏడు ప్రాంతాల్లో మాత్రం అతి దట్టమైన అడవులు, 29 ప్రాంతాల్లో దట్టమైన అడవులున్నాయి. ఓపెన్ ఫారెస్ట్‌గా 1463 కిలోమీటర్లు, మిగిలినవి చిట్టడవులుగా వ్యాపించి ఉన్నాయి. మొత్తం విస్తీర్ణంలో అడవులు 15.83 శాతం విస్తరించి ఉన్నాయి. -
పశువుల ప్రాణాలు హరించిన ప్లాస్టిక్
రాయచూరు రూరల్, న్యూస్‌లైన్ : ప్లాస్టిక్ వస్తువుల వినియోగం పర్యావరణానికే కాదు పశువుల ప్రాణాలకు కూడా ముప్పే. ప్లాస్టిక్ వాడకం ఎంత హానికరమనేది గడచిన రెండు నెలల్లో మలియాబాద్ గోశాలలో వందకుపైగా వీధి పశువులు మృత్యువాత పడడం తెలియచేస్తోంది. నగరంలో ఎక్కడబడితే అక్కడ పడేసిన చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు తింటే ప్రాణహాని అని ఆ వీధి పశువులకు తెలియదు.ఆకలితో వాటిని తిని ఆ మూగజీవాలు ప్రాణాలు కోల్పోతున్నాయి. నగరంలోని అక్రమ కట్టడాల తొలగింపు కార్యక్రమం తరువాత నగరసభ యంత్రాంగం వీధి పశువుల తరలించే కార్యక్రమాన్ని చేపట్టింది. నగరంలోని వివిధ రహదారుల్లో అడ్డదిడ్డంగా సంచరిస్తూ, రాత్రి సమయాల్లో రహదారులపై అడ్డంగా పడుకుని ట్రాఫిక్‌కు అంతరాయం కల్పిస్తుండేవి. వీటి బెడదను అరికట్టాలని నగరసభ యంత్రాంగం రాయచూరుకు 5 కిమీ దూరంలోని మలియాబాద్ అటవీ ప్రాంతంలో ఉన్న ఓ ప్రైవేట్ గోశాలకు రెండు నెలల క్రితం వీధి పశువులను తరలించింది. అక్కడ వరిగడ్డి వేస్తున్నా, సమీపంలోని పొలం గట్లపై ఉన్న పచ్చిగడ్డిని ఈ పశువులు తినేవికావు. దీంతో అనారోగ్యానికి గురై రోజూ ఒకటి రెండు వంతున పశువులు చనిపోతున్నాయి. రెండు నెలల్లో గోశాలకు తరలించిన గోవులలో100కు పైగా మృతి చెందాయి. ఈ పశువులు నగరంలోని చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు తినడం వల్ల అనారోగ్యం బారిన పడి మృతి చెందాయి. వాటి కళేబరాల్లో చెత్తాచెదారం, ప్లాస్టిక్ సంచులు నిండి ఉండడం ఈ విషయాన్ని స్పష్టం చేస్తుంది. చనిపోయిన పశువులను గోశాల సమీపంలో పడేయడం దారుణం. అవి కుళ్లి దుర్గంధం వ్యాపించిన పట్టించుకున్న నాథుడే లేడు. కనీసం అవి ఎందుకు చనిపోతున్నాయని అధికారులు ఆరా తీసిన పాపాన పోలేదు. గోశాలకు తరలించి అధికారులు చేతులుదులుపుకున్నారు. గోశాలలో గోసంరక్షణకు అవసరమైన సౌకర్యాలు లేవని నిర్వాహకులు మొరపెట్టుకున్నా, పత్రికల్లో కథనాలు ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. గోసంరక్షపై వారి చిత్తశుద్దిని ఇది తెలియచేస్తుంది. పశువుల మృతితోనైనా ప్లాస్టిక్ వినియోగంపై నిషేధాన్ని అధికారులు కచ్చితంగా అమలు చేయాలి. ఆదిశగా ప్రజలనుజాగృతి చేసే కార్యక్రమాలు చేపట్టాలి.