టీడీపీ కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం గుట్టగా వదిలేసిన దృశ్యం
సాక్షి, అనంతపురం అర్బన్: టీడీపీ కార్యకర్తల సమావేశం పాడి రైతుల పాలిట శాపంగా మారింది. కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం అక్కడే గుట్టగా వదిలేసి వెళ్లారు. పాడైపోయిన ఆ అన్నాన్ని తిని ఐదు పాడి ఆవులు మృతి చెందాయి. ఈ ఘటన కళ్యాణదుర్గం రోడ్డులోని జొన్నా ఐరెన్ మార్ట్ వెనుక వైపు చోటు చేసుకుంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటనకు ఈ నెల 23న వచ్చారు. 24న బళ్లారి రోడ్డులోని వైఎంఆర్ ఫంక్షన్ హాల్‌లో టీపీపీ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. హాల్‌కు కొద్ది దూరంలో కార్యకర్తల కోసం భోజనాలు ఏర్పాటు చేశారు. భోజనాలు చేసిన తరువాత మిగిలిన అన్నంను అక్కడే వదిలేసి వెళ్లారు. చెడిపోయిన అన్నం తిని ఐదు ఆవులు చనిపోయాయి.
ఇందుకు సంబంధించి వివరాలను బాధితులు నరసింహులు తిరుపతయ్య తెలిపారు. ఫంక్షన్‌హాల్‌కు సమీపంలోని ఒక ఎస్టేట్‌లో నరసింహులు వాచ్‌మ్యాన్‌గా పనిచేస్తున్నాడు. అతను రెండు ఒంగోలు, రెండు జెర్సీ అవులను మేపుతున్నాడు. అదే విధంగా తిరుపతయ్య అనే పాడి రైతు ఒక జెర్సీ ఆవును మేపుతున్నాడు. అవి ఈనెల 25న అటుగా వెళ్లి అక్కడున్న అన్నం తిన్నాయి. అక్కడిక్కడే రెండు ఆవులు చనిపోగా మరో మూడు ఆవులు కొన ప్రాణంతో కొట్టుకుంటున్నాయి. సాయంత్రం ఐదు గంటల సమయంలో ఆవుల కోసం వెళ్లిన రైతులు వాటిని చూసి వెంటనే ట్రాక్టర్లో వాటిని వేసుకొచ్చి తమకు దగ్గరలోని పశువైద్యాధికారి సురేశ్‌కు చెప్పడంతో ఆయన తన కాంపౌండర్ గురుముర్తితో పాటు హుటాహుటిన చేరుకుని చికిత్స అందించారు. అయినా ఆవులు బతకలేదు.
రూ.3.50 లక్షలు నష్టపోయాం
టీడీపీ సమావేశం కోసం భోజనాలను ఏర్పాటు చేశారు. కార్యకర్తలు తినగా మిగిలిన అన్నం అక్కడే వదిలేసి వెళ్లారు. మా ఆవులు గడ్డిమేస్తూ ఆ ప్రాంతానికి వెళ్లి చెడిపోయిన అన్నం తిన్నాయి. పాడైపోయిన అన్నం తినడంతో ఆవులు చనిపోయాయని వైద్యాధికారి చెప్పారు. ఒక్కొక్క ఆవు రూ.70 వేలు విలువ చేస్తుంది. ఐదు ఆవుల విలువ రూ.3.50 లక్షలు. పేదలమైన మాకు ప్రభుత్వం న్యాయం చేయాలి.
– బాధితులు నరసింహులు, తిరుపతయ్య
Comments
Please login to add a commentAdd a comment